GCPL
-
15 శాతం తగ్గిన సబ్బుల ధరలు
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో పెరిగిపోయిన సబ్బుల ధరలు కొంత దిగొచ్చాయి. సామాన్యుడికి కొంత ఊరట దక్కింది. ముడి పదార్థాల ధరలు క్షీణించడంతో హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్), గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కంపెనీలు సబ్బుల ధరలను 15 శాతం వరకు తగ్గించాయి. సబ్బుల్లో ప్రధానంగా వినియోగించే పామాయిల్ ధరలు ఇటీవల గణనీయంగా తగ్గడం తెలిసిందే. లైఫ్‌బోయ్, లక్స్ సబ్బులను 5–11 శాతం మధ్య పశ్చిమాది ప్రాంతంలో తగ్గించినట్టు హెచ్‌యూఎల్ ప్రకటించింది. గోద్రేజ్ నంబర్ 1, సింథాల్ తదితర బ్రాండ్లపై సబ్బులను విక్రయించే గోద్రేజ్ కన్జ్యూమర్ 13–15 శాతం మధ్య ధరలను తగ్గించింది. ధరలు తగ్గించడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల కాలంలో అధిక విక్రయాలు నమోదు కావచ్చన్న విశ్లేషణ వినిపిస్తోంది. తొలి కంపెనీ మాదే..: గోద్రేజ్ గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సీఎఫ్‌వో సమీర్ షా మాట్లాడుతూ.. ‘‘కమోడిటీల ధరలు దిగిరావడంతో ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేసిన మొదటి ఎఫ్ఎంసీజీ కంపెనీ గోద్రేజ్ కన్జ్యూమరే. గోద్రేజ్ నంబర్ 1 బండిల్ ప్యాక్ (100 గ్రాముల ఐదు సబ్బులు) ధరను రూ.140 నుంచి రూ.120కు తగ్గించాం’’అని వివరించారు. హెచ్‌యూఎల్ అధికార ప్రతినిధి లైఫ్‌బోయ్, లక్స్ ధరల తగ్గింపును ధ్రువీకరించారు. అదే సమయంలో సర్ఫ్, రిన్, వీల్, డవ్ తదితర ఉత్పత్తుల ధరలపై స్పందించలేదు. ‘‘గడిచిన ఏడాది కాలంలో హెచ్‌యూఎల్ సబ్బుల గ్రాములను తగ్గించి, ధరలను పెంచడంతో విక్రయాలపై ప్రభావం పడింది. ఇప్పుడు ధరలు తగ్గించడం కలిసొస్తుంది’’అని ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అబ్నీష్ రాయ్ పేర్కొన్నారు. -
'ఏం కొనేటట్టు లేదు.. తినేటట్టు లేదు' తగ్గిన అమ్మకాలతో కంపెనీలు లబోదిబో!
న్యూఢిల్లీ: కొబ్బరినూనె, బిస్కెట్లు, సబ్బులు, కాస్మోటిక్స్ వంటి ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) పరిశ్రమలో ఏప్రిల్, మే, జూన్ త్రైమాసికంలో డిమాండ్ మందగమనంలో సాగింది. ప్రధాన కంపెనీలు డాబర్, మారికో, గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (జీసీపీఎల్) త్రైమాసిక నివేదికలు స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశాయి. ద్రవ్యోల్బణం తీవ్రత ఆదాయాలపై ప్రభావం చూపుతున్నందున, వినియోగదారులు ప్రధాన వస్తువులపై ఖర్చు చేయడానికి వెనుకాడారని సంస్థలు వెల్లడించాయి. దేశీయ ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయిల కారణంగా భారీగా దెబ్బతిందని పేర్కొన్నాయి. అమ్మకాలపై ప్రతికూల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించాయి. వంట నూనెలు, తేనె, ఇతర వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు సంబంధించి సంస్థల స్థూల మార్జిన్లు ప్రభావితం అయ్యే స్థాయిలో వినియోగం పడిపోయిందని ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు తెలిపాయి. అంతేకాకుండా, పట్టణ మార్కెట్లతో పోలిస్తే గ్రామీణ మార్కెట్ల వృద్ధి జూన్ త్రైమాసికంలో నెమ్మదించిందని వెల్లడించాయి. గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, మారికోలు తమ భారతీయ వ్యాపార పరిమాణం క్షీణ దిశలో ఉందని కూడా ఆందోళన చెందుతుండడం గమనార్హం. పెరుగుతున్న ద్రవ్యోల్బణం డిమాండ్‌ను తగ్గిస్తుండడం దీనికి కారణం. ఇప్పటివరకూ అందిన సమాచారాన్ని బట్టి ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు డిమాండ్ ధోరణులు, సంస్థల పనితీరు గురించి తొలి అంచనాలను తమ అప్డేటెడ్ నివేదికల్లో పేర్కొన్నాయి. జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి వాటి సంబంధిత బోర్డులు సంస్థల ఆర్థిక ఫలితాలను ఆమోదించిన తర్వాత వివరణాత్మక ఆర్థిక ఫలితాలు వెల్లడవుతాయి. మూడు సంస్థలు ఈ మేరకు తమ జూన్ త్రైమాసిక అప్డేటెడ్ తొలి నివేదికలను వెల్లడించాయి. అంతర్జాతీయ వ్యాపారం ఓకే... ప్రపంచ అనిశ్చితి, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ జూన్ త్రైమాసికంలో అంతర్జాతీయ వ్యాపారం నుండి వృద్ధిని నమోదుచేసుకున్నట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు తెలిపాయి. వార్షిక ప్రాతిపదిక చూస్తే, కన్సాలిటేడెడ్ ఆదాయాలు పెరిగినట్లు మారికో పేర్కొంది. డాబర్ ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, బలమైన వృద్ధిని నమోదుచేసుకుంటామన్న ధీమాను వ్యక్తం చేసింది. దాదాపు అన్ని విభాగాల్లో తమ మార్కెట్ వాటా వృద్ధిని నమోదుచేసుకుంటోందని తెలిపింది. కాగా గోద్రెజ్ మాత్రం తమన కంపెనీకి భారత్ తరువాత అతిపెద్ద మార్కెట్ అయిన ఇండోనేయాలో వినియోగం, మార్జిన్లు దెబ్బతింటున్నట్లు తెలిపింది. ఆఫ్రికా, అమెరికా, పశ్చిమాసియాల్లో మాత్రం వృద్ధి రెండంకెల్లో నమోదవుతుందన్న భరోసాను వ్యక్తం చేసింది. వినియోగమంటే భయం ప్రస్తుత పోకడల ప్రకారం చూస్తుంటే, వినియోగదారులు కొన్ని అనవసరమైన వస్తువుల కొనుగోళ్లను మానేశారు. అవసరమైన వస్తువుల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తక్కువ ధర బ్రాండ్‌వైపు మళ్లడం, చిన్న ప్యాక్‌లకు మారడం వంటి ధోరణులను అవలంభిస్తున్నారు. కొన్ని ఉత్పత్తుల అమ్మకాలు క్షీణతలోకి కూడా జారిపోయాయి. సఫోలా ఆయిల్స్‌ను ఇక్కడ ప్రస్తావించుకోవాలి. సఫోలా నూనెలను మినహాయించి, భారతదేశ వ్యాపారం స్వల్ప పరిమాణంలో వృద్ధిని నమోదు చేసింది. పారాచూట్ కొబ్బరి నూనె స్వల్ప పరిమాణంలో క్షీణతను నమోదు చేసింది. – మారికో ఆదాయాలు పరిమితం 2021–22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 35.4 శాతం ఆదాయ వృద్ధి నమోదయ్యింది. అయితే తాజాగా ముగిసిన జూన్ త్రైమాసికంలో ఈ రేటు ఒకంకెకు పరమితం అవుతుంని అంచనావేస్తున్నాం. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాలు అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి. అయితే తాజా పరిస్థితుల ప్రతికూల ప్రభావాలను భారత్ క్రమంగా అధిగమిస్తుందని విశ్వసిస్తున్నాం. తగిన వర్షపాతం, ద్రవ్యోల్బణం తగ్గుదల ఇందుకు దోహదపడతాయని అంచనా. – డాబర్ -
గోద్రెజ్‌లో కీలక మార్పు: కొత్త వారసురాలు
న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆది గోద్రెజ్ (75)తన వారసత్వ నాయకత్వాన్ని మంగళవారం ప్రకటించారు. గోద్రెజ్ గ్రూపునకు చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీని తన కుమార్తెకు అప్పగించారు. గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌ను కుమార్తె నిసాబా(39)కు అందజేశారు. దీంతో 17 ఏళ్ళ పాటు కంపెనీకి నాయకత్వం వహించిన ఆది గోద్రెజ్ ఇక మీదట గౌరవ చైర్మన్‌గా ఉంటారు. రెండు నెలల క్రితం ఛైర్మన్‌గా ఆది గోద్రెజ్ రాజీనామా అనంతరం ఈ కీలక మార్పు చోటు చేసుకుంది. ప్రస్తుతం కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్ననిసాబా ఎగ్జిక్యూటివ్ ఛైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మే 10, 2017నుంచి అమల్లోకి రానుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో అతిపెద్ద కంపెనీకి అధిపతి గా వ్యవహరిస్తున్న అతి చిన్న వయస్కురాలిగా నిసాబా నిలిచారు. తన తండ్రి క్రమశిక్షణ, ఫలితాలపై దృష్టి, వినయపూర్వకమైన విధానం తమ గ్రూపు డీఎన్ఏలో ఎల్లప్పుడూ ప్రధానంగా ఉంటుందని నిసాబా వ్యాఖ్యానించారు. అలాగే తాను జీఎస్పీఎల్ బోర్డులో కొనసాగుతాననీ, కంపెనీ ఎండీ, సీఈవోగా వివేక్ గంభీర కొనసాగుతారని ఆది గోద్రెజ్ ప్రకటించారు. జిసిపిఎల్ పునాదులు ఎంతో బలంగా ఉన్నాయనీ, ఇది కొత్త చైర్పర్సన్ కు బదిలీ చేయడానికి అనువైన సమయమని చెప్పారు. నిసాబా నాయకత్వంలో సంస్థ అభివృద్ధి దిశగా పయనిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. వినియోగదారుల వస్తువులు, రియల్ ఎస్టేట్, గృహోపకరణాలు, వ్యవసాయ రంగాలతో సహా వివిధ రంగాలలో సేవలందిస్తున్న ఉన్న గోద్రెజ్ గ్రూప్ లోని ప్రధాన సంస్థ జీసీపీఎల్. 2007 లో ప్రారంభించిన సంస్థ యొక్క అభివృద్ధిలో నిసాబా మాస్టర్ మైండ్ కీలకం. ముఖ్యంగా దేశీయ సేంద్రీయ వృద్ధి ఆవిష్కరణ, స్థిరీకరణ ద్వారా సంస్థను పరుగులు పెట్టించారు. అదే సమయంలో భారతదేశం బైట అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా జీపీసీఎల్ ప్రపంచవ్యాప్తమైంది. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో 2011 నుంచి పనిచేస్తున్న నిసాబా గత దశాబ్దంలో కంపెనీ వ్యూహంలో మరియు పరివర్తనలో నిసాబా కీలక పాత్ర పోషించారు. ఈ కాలంలో సంస్థ క్యాపిటలైజేషన్ 20రెట్లు అధిగమించింది. రూ. 3వేలకోట్ల నుంచి రూ.60వేల కోట్లకు చేరింది. అలాగే జనవరి మార్చ్ త్రైమాసికంలో అద్భుతమైన లాభాలను ప్రకటించింది. మార్చి 31, 2017 ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో జీసీపీఎల్ రూ. 9,608 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇది రూ. 8,753కోట్లుగాఉంది. కాగా ఆది గోద్రెజ్ ముగ్గురు సంతానంలో నిసాబా రెండవవారు. అతి పెద్ద కుమార్తె తాన్య దుబాష్ గోద్రేజ్ గ్రూప్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ , చీఫ్ బ్రాండ్ ఆఫీసర్‌గా ఉన్నారు. చిన్న కుమారుడు పిరోజ్షా గోద్రెజ్ గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్. యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. రియల్ ఎస్టేట్ వ్యవస్థాపకుడు కల్పెష్ మెహతాను వివాహం చేసుకున్నారు. ఈమెకు ఒక కుమారుడు ఉన్నాడు.