cuts prices
-
15 శాతం తగ్గిన సబ్బుల ధరలు
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో పెరిగిపోయిన సబ్బుల ధరలు కొంత దిగొచ్చాయి. సామాన్యుడికి కొంత ఊరట దక్కింది. ముడి పదార్థాల ధరలు క్షీణించడంతో హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్), గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కంపెనీలు సబ్బుల ధరలను 15 శాతం వరకు తగ్గించాయి. సబ్బుల్లో ప్రధానంగా వినియోగించే పామాయిల్ ధరలు ఇటీవల గణనీయంగా తగ్గడం తెలిసిందే. లైఫ్బోయ్, లక్స్ సబ్బులను 5–11 శాతం మధ్య పశ్చిమాది ప్రాంతంలో తగ్గించినట్టు హెచ్యూఎల్ ప్రకటించింది. గోద్రేజ్ నంబర్ 1, సింథాల్ తదితర బ్రాండ్లపై సబ్బులను విక్రయించే గోద్రేజ్ కన్జ్యూమర్ 13–15 శాతం మధ్య ధరలను తగ్గించింది. ధరలు తగ్గించడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల కాలంలో అధిక విక్రయాలు నమోదు కావచ్చన్న విశ్లేషణ వినిపిస్తోంది. తొలి కంపెనీ మాదే..: గోద్రేజ్ గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సీఎఫ్వో సమీర్ షా మాట్లాడుతూ.. ‘‘కమోడిటీల ధరలు దిగిరావడంతో ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేసిన మొదటి ఎఫ్ఎంసీజీ కంపెనీ గోద్రేజ్ కన్జ్యూమరే. గోద్రేజ్ నంబర్ 1 బండిల్ ప్యాక్ (100 గ్రాముల ఐదు సబ్బులు) ధరను రూ.140 నుంచి రూ.120కు తగ్గించాం’’అని వివరించారు. హెచ్యూఎల్ అధికార ప్రతినిధి లైఫ్బోయ్, లక్స్ ధరల తగ్గింపును ధ్రువీకరించారు. అదే సమయంలో సర్ఫ్, రిన్, వీల్, డవ్ తదితర ఉత్పత్తుల ధరలపై స్పందించలేదు. ‘‘గడిచిన ఏడాది కాలంలో హెచ్యూఎల్ సబ్బుల గ్రాములను తగ్గించి, ధరలను పెంచడంతో విక్రయాలపై ప్రభావం పడింది. ఇప్పుడు ధరలు తగ్గించడం కలిసొస్తుంది’’అని ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అబ్నీష్ రాయ్ పేర్కొన్నారు. -
జీతాల కోతకు ఇంగ్లండ్ క్రికెటర్లు ఓకే
లండన్: కరోనా మహమ్మారి వల్ల టోర్నీలు, సిరీస్లు జరగక... పర్యటనలు లేక చాలా క్రికెట్ బోర్డులు ఆర్థిక కష్టాల్లో ఉన్నాయి. దీంతో పలు బోర్డులు జీతాల కోత విధిస్తున్నాయి. తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రతిపాదనకు ఆ దేశ క్రికెటర్లు సమ్మతించారు. కోవిడ్ వల్ల ఇప్పటికే ఈసీబీ 100 మిలియన్ యూరోల (రూ. 874 కోట్లు) నష్టాన్ని చవిచూసింది. ఈ నష్టం వచ్చే ఏడాదికి రెట్టింపు (రూ. 1,748 కోట్లు) కానుందని ఈసీబీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యయ నియంత్రణ అనివార్యమని భావించిన బోర్డు ఇప్పటికే 62 మంది ఉద్యోగులకు బైబై చెప్పింది. అలాగే ఆటగాళ్ల కాంట్రాక్టు, మ్యాచ్ ఫీజుల కోతకు సిద్ధపడింది. ఈ మేరకు ఆటగాళ్ల సంఘం ముందు ప్రతిపాదన పెట్టగా తాజాగా ఆటగాళ్లు 15 శాతం కోతకు అంగీకరించారు. దీంతో ఈసీబీ డైరెక్టర్ ఆష్లే గైల్స్ తమ టీమ్ ఇంగ్లండ్ ప్లేయర్ల పార్ట్నర్షిప్ (టీఈపీపీ–ఇది ప్లేయర్ల అసోసియేషన్)కు అభినందనలు తెలిపారు. ‘ఆటగాళ్లతో బోర్డు బంధం ఎంతో ధృడమైనది. మా ఆటగాళ్ల సేవలకు గుర్తింపు ఇస్తాం. ఈ కష్టకాలంలో ఆటగాళ్లు కనబరిచిన పరిణతికి మా అభినందనలు, టెస్టు, వన్డే కెప్టెన్లు రూట్, మోర్గాన్, ఆటగాళ్లు అందరూ సవాళ్లను స్వీకరిస్తూనే బాధ్యతల్ని పంచుకుంటున్నారు’ అని గైల్స్ కొనియాడారు. టీఈపీపీ చైర్మన్ రిచర్డ్ బెవాన్ మాట్లాడుతూ క్లిష్ట సమయంలో ఆటగాళ్లంతా బోర్డుకు అండగా నిలవాలనుకోవడం గొప్ప విషయమని అన్నారు. -
భారీగా తగ్గిన నిస్సాన్ మైక్రా కార్ల ధరలు
న్యూఢిల్లీ: జపనీస్ ఆటో దిగ్గజం నిస్సాన్ తమ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్ల ధరలు గణనీయంగా తగ్గించింది. భారతదేశం లో విక్రయించే మైక్రా ఆటో ట్రాన్స్మిషన్ రెండు వేరియంట్ కార్ల ధరల్లో యాభైవేలకు పైగా కోత పెడుతున్నట్టు ప్రకటించింది. మైక్రా సీవీటీ ఆటోమేటిక్ ఎక్స్ ఎల్ వేరియంట్ కార్ ను రూ 54, 252 లకు తగ్గించింది. దీంతో గతంలో రూ 6,53,252కు లభ్యమయ్యే ఈ కారు ప్రస్తుతం రూ 5,99,000 కే అందుబాటులో ఉంటుంది. మైక్రా ఆలోమేటిక్ సీవీటీ-ఎక్స్ వీ ని రూ రూ 45.713 మేర తగ్గించింది. దీంతో ఈ వెహికల్ ధర రూ 7,19,213 నుంచి కింది దిగి 6,73,500 దగ్గర లభ్యమవుతోంది. ఇవి ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధరలని నిస్సాన్ ప్రకటించింది. దీనిపై నిస్సాన్ మోటార్ వ్యాఖ్యానిస్తూ మెరుగైన స్థానికీకరణ నేపథ్యంలో డెలివరీ పరంగా, మంచి వేగవంతమైన, మరింత సమర్థవంతమైన మార్కెట్ సేవలు అందించకలుగుతున్నామని పేర్కొంది.మైక్రా ఉత్పత్తి ఇపుడు ఇండియాలోనే సాధ్యమవుతోందని ,అందుకే తమ కస్టమర్ల సౌకర్యార్ధం రివైజ్డ్ ధరలను అందుబాటులోకి తెచ్చామని నిస్సాన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా తెలిపారు. ఇక ముందు పాపులర్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మోడల్స్ లో మరింత పోటీ ధరలను ప్రవేశపెట్టనున్నామన్నారు. ఏఆర్ఏఐ పరీక్షలు ప్రకారం తమ మైక్రా సీవీటీ 19.34 కెఎంపీల్ మైలేజ్ ఇస్తుందని పేర్కొన్నారు. కాగా నిస్సాన్ మోడల్ మైక్రా ఉత్పత్తి రెనాల్ట్-నిస్సాన్ భాగస్వామ్యంలో చెన్నై ప్లాంట్లో 2010 లో మొదలైన సంగతి తెలిసిందే.