న్యూఢిల్లీ: త్వరలోనే విలీనం కానున్న టెలికం దిగ్గజాలు వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ సంస్థలు దేశీయంగా తమ తమ టవర్ల వ్యాపారాలను ఏటీసీ టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి విక్రయించాలని నిర్ణయించాయి. ఈ డీల్ విలువ సుమారు రూ. 7,850 కోట్లు. ఈ ఒప్పందాల కింద వొడాఫోన్ ఇండియాకి రూ.3,850 కోట్లు (592 మిలియన్ డాలర్లు), ఐడియాకి రూ.4,000 కోట్లు (615 మిలియన్ డాలర్లు) లభిస్తాయని ఇరు సంస్థలు సంయుక్త ప్రకటనలో తెలియజేశాయి. రెండు కంపెనీలకు కలిపి మొత్తం 20,000 టవర్లున్నాయి. డీల్‌పై ఐడియాకు డీఎస్‌పీ మెరిల్ లించ్, వొడాఫోన్‌కి మోర్గాన్ స్టాన్లీ సంస్థలు అడ్వైజర్లుగా ఉన్నాయి. ఈ డీల్ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో పూర్తి కాగలదని అంచనా.
రెండో అతిపెద్ద టవర్స్ అపరేటర్‌గా ఏటీసీ..
తాజా కొనుగోలుతో ఏటీసీ భారత్‌లో ఇండస్ టవర్స్ తర్వాత రెండో అతిపెద్ద టవర్ ఆపరేటింగ్ సంస్థగా నిలుస్తుంది. డీల్ అనంతరం ఏటీసీ వద్ద దాదాపు 70,000 టవర్లుంటాయి. వొడాఫోన్, ఐడియా (11.15 శాతం వాటా), టాటా టెలీ సంస్థల జాయింట్ వెంచర్ అయిన ఇండస్ టవర్స్‌కి ప్రస్తుతం 1.25 లక్షల టవర్లున్నాయి. రెండు సంస్థల విలీనంపై ఈ టవర్ డీల్ ప్రభావమేమీ ఉండదని కంపెనీలు పేర్కొన్నాయి. ‘ఈ డీల్ పూర్తిగా నగదు రూపంలో ఉండనుంది.
మా 9,900 టవర్లకు గాను సుమారు రూ. 4,000 కోట్లు లభిస్తుంది. వొడాఫోన్‌తో విలీనమయ్యే దాకా ఈ మొత్తాన్ని వేరే ప్రత్యేక ఖాతాలో ఉంచుతాం‘ అని ఐడియా ఎండీ హిమాంశు కపానియా తెలిపారు. ‘20,000 టవర్లలో వొడాఫోన్, ఐడియాకి చెందిన 6,300 టవర్లు దాదాపు ఒకే దగ్గర ఉన్నాయి. దీంతో వీటిని విక్రయిస్తే ప్రతి నెలా ప్రతి టవర్‌పై రూ.50,000 నుంచి రూ. 55,000 దాకా మిగులుతుంది. ఆ ప్రకారం చూస్తే భారీగా ఆదా అయినట్లే లెక్క‘ అని ఆయన వివరించారు.
దాదాపు రూ. 54,000 కోట్ల రుణభారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిధులు వెచ్చిస్తారా అన్న ప్రశ్నకు లేదని సమాధానమిచ్చారు. విలీన ఒప్పంద ప్రక్రియలో ఈ డీల్ కూడా భాగమేనని.. ప్రధాన వ్యాపారేతర అసెట్స్/టవర్స్ విభాగాలను మెర్జర్ ముందుగా లేదా విలీన సమయంలోనైనా విక్రయించాలని ఇరు సంస్థలు నిర్ణయించినట్లు ఆయన వివరించారు.
కన్సాలిడేషన్ తప్పని పరిస్థితి..
కొత్తగా వచ్చిన రిలయన్స్ జియో... సంచలన ఆఫర్లతో టెల్కో దిగ్గజాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. దీంతో టెలికంలో కన్సాలిడేషన్ తెరతీస్తూ.. రెండు, మూడు స్థానాల్లో ఉన్న వొడాఫోన్ ఇండియా, ఐడియా సంస్థలు కొన్నాళ్ల క్రితమే విలీన నిర్ణయం తీసుకున్నాయి. ఇది పూర్తయితే సుమారు 35% మార్కెట్ వాటాతో ఏకంగా 23 బిలియన్ డాలర్ల పైగా విలువ చేసే దిగ్గజ టెల్కో ఏర్పాటవుతుంది. అగ్రస్థానంలో కొనసాగుతున్న ఎయిర్‌టెల్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment