తగ్గిన ఐడియా లాభం..
♦ 12 శాతం పెరిగిన నికర అమ్మకాలు
♦ 3 రెట్లు పెరిగిన నికర రుణం
న్యూఢిల్లీ: టెలికం సర్వీసులందించే ఐడియా సెల్యులర్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌లో స్వల్పంగా తగ్గింది. గత క్యూ3లో రూ.767 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.764 కోట్లకు పడిపోయిందని ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ వెల్లడించింది. నికర అమ్మకాలు రూ.8,017 కోట్ల నుంచి 12 శాతం వృద్ధితో రూ.9,010 కోట్లకు పెరిగాయని వివరించింది. మొబైల్ డేటా(2జీ, 3జీ, 4జీ) 76 శాతం, వాయిస్ మినిట్స్ 17 శాతం చొప్పున వృద్ధి సాధించాయని తెలిపింది. తాజా డిసెంబర్ క్వార్టర్‌లో 13 టెలికం సర్కిళ్లలో 3జీ సర్వీసులును, నాలుగు దక్షిణాది టెలికం సర్వీస్ ఏరియాల్లో 4జీ సర్వీసులను ప్రారంభించామని పేర్కొంది.
3జీ డేటాకు సంబంధించి ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు రాబడి(ఏఆర్‌పీయూ) ఆరోగ్యకరమైన స్థాయిలో రూ.196గా ఉందని వివరించింది. గత క్యూ3లో రూ.11,089 కోట్లుగా ఉన్న నికర రుణ భారం ఈ క్యూ3లో మూడు రెట్లు పెరిగి రూ.37,690 కోట్లకు చేరిందని ఐడియా సెల్యులర్ వివరించింది. గత ఏడాది కాలంలో 3జీ డేటా వినియోగదారుల సంఖ్య 82 లక్షల నుంచి 2.12 కోట్లకు పెరిగిందని పేర్కొంది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి మొత్తం వినియోగదారుల సంఖ్య 18.2 కోట్లకు పెరిగిందని తెలిపింది.
హైదరాబాద్‌లో ఐడియా 4జీ సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ కంపెనీ ఐడియా సెల్యులార్ భాగ్యనగరిలో 4జీ ఎల్‌టీఈ సేవలను ప్రారంభించింది. కంపెనీ గతేడాది డిసెంబరు 23 నుంచి 4జీ సర్వీసులను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో హైదరాబాద్ మినహా కరీంనగర్, నిజామాబాద్, కడప, విజయవాడ, వైజాగ్ తదితర పట్టణాల్లో ఈ సర్వీసులను ప్రారంభించింది. దేశంలో మొత్తం 10 సర్కిళ్లలో జూన్ నాటికి 750 నగరాల్లో 4జీ సేవలను విస్తరించాలన్నది సంస్థ లక్ష్యం.