ఐడియా నికర లాభం రూ.931 కోట్లు
వచ్చే ఏడాది నుంచి 4జీ సేవలు
న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం ఐడియా సెల్యులర్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి రూ.931 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రూ.728 కోట్ల నికర లాభం సాధించామని వివరించింది. గత క్యూ1లో రూ.7,561 కోట్లుగా ఉన్న కన్సాలిడేటెడ్ ఆదాయం ఈ క్యూ1లో రూ.8,798కు పెరిగిందని పేర్కొంది. ఇంటర్‌కనెక్టెడ్ నిబంధనల్లో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ మార్పులు చేసినందువల్ల ఈ ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని వివరించింది.
44 లక్షల మంది యాక్టివ్ వినియోగదారులు, వాయిస్ మినిట్స్ 5.8 శాతం పెరగడం, మొబైల్ డేటా వినియోగం(2జీ, 3జీ) 15 శాతం వృద్ధి చెందడం వంటి కారణాల వల్ల స్థూల ఆదాయం వృద్ధి చెందిందని పేర్కొంది. ఐయూసీ రేట్ల మార్పు వల్ల రూ.317 కోట్ల ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ, ఆదాయంలో మంచి వృద్ధి సాధించామని వివరించింది. 16.58 కోట్ల మంది వినయోగదారులకు సేవలందిస్తున్నామని తెలిపింది. గత క్యూ1లో రూ.181గా ఉన్న ఒక్కో వినియోగదారుడికి వచ్చే సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ)ఈ క్యూ1లో రూ.182కు పెరిగిందని వివరించింది.