Telecom giant
-
ఐడియా నికర లాభం రూ.931 కోట్లు
వచ్చే ఏడాది నుంచి 4జీ సేవలు న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం ఐడియా సెల్యులర్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి రూ.931 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రూ.728 కోట్ల నికర లాభం సాధించామని వివరించింది. గత క్యూ1లో రూ.7,561 కోట్లుగా ఉన్న కన్సాలిడేటెడ్ ఆదాయం ఈ క్యూ1లో రూ.8,798కు పెరిగిందని పేర్కొంది. ఇంటర్‌కనెక్టెడ్ నిబంధనల్లో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ మార్పులు చేసినందువల్ల ఈ ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని వివరించింది. 44 లక్షల మంది యాక్టివ్ వినియోగదారులు, వాయిస్ మినిట్స్ 5.8 శాతం పెరగడం, మొబైల్ డేటా వినియోగం(2జీ, 3జీ) 15 శాతం వృద్ధి చెందడం వంటి కారణాల వల్ల స్థూల ఆదాయం వృద్ధి చెందిందని పేర్కొంది. ఐయూసీ రేట్ల మార్పు వల్ల రూ.317 కోట్ల ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ, ఆదాయంలో మంచి వృద్ధి సాధించామని వివరించింది. 16.58 కోట్ల మంది వినయోగదారులకు సేవలందిస్తున్నామని తెలిపింది. గత క్యూ1లో రూ.181గా ఉన్న ఒక్కో వినియోగదారుడికి వచ్చే సగటు ఆదాయం(ఏఆర్పీయూ)ఈ క్యూ1లో రూ.182కు పెరిగిందని వివరించింది. -
బాండ్ల ద్వారా ఎయిర్టెల్ బిలియన్ డాలర్ల సమీకరణ
న్యూఢిల్లీ : టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ పదేళ్ల కాల పరిమితి బాండ్ల జారీ ద్వారా అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి 1 బిలియన్ డాలర్లు సమీకరించింది. ఈ నిధులను పెట్టుబడి వ్యయాల కోసం వినియోగించనుంది. 66 శాతం బాండ్లను అమెరికా ఇన్వెస్టర్లకు, 18 శాతాన్ని యూరప్, 16 శాతాన్ని ఆసియా ఇన్వెస్టర్లకు కేటాయించినట్లు ఎయిర్టెల్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక దేశీ ప్రైవేట్ కంపెనీ.. బాండ్ల జారీ ద్వారా ఇంత పెద్ద మొత్తాన్ని సమీకరించడం ఇదే ప్రథమం. ఎయిర్టెల్ గతేడాది డెట్ మార్కెట్ నుంచి 2.5 బిలియన్ డాలర్లు సమీకరించింది. -
ఆర్‌కామ్ లాభం 48% క్షీణత
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో టెలికం దిగ్గజం రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) నికర లాభం ఏకంగా 48.5 శాతం క్షీణించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 156 కోట్లకు పరిమితమైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో రూ. 303 కోట్ల లాభం నమోదు చేసింది. అప్పట్లో వ్యాపార పునర్వ్యవస్థీకరణతో రూ. 550 కోట్ల మేర వన్‌టైమ్ ఆదాయం రావడం వల్ల గత గణాంకాలు భారీగా ఉన్నాయని, అది మినహాయిస్తే వ్యాపార పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని ఆర్‌కామ్ సీఈవో గుర్దీప్ సింగ్ తెలిపారు. త్రైమాసికాల వారీగా చూస్తే మూడో క్వార్టర్‌తో పోలిస్తే లాభం రూ. 108 కోట్ల నుంచి 44 శాతం మేర పెరిగినట్లయిందని వివరించారు. మొత్తం మీద నాలుగో త్రైమాసికం సంతృప్తికరంగానే సాగిందని సింగ్ పేర్కొన్నారు. ఆదాయం 5 శాతం పెరిగి రూ. 5,130 కోట్ల నుంచి రూ. 5,405 కోట్లకు చేరింది. నికర రుణ భారం 3.3 శాతం పెరిగి రూ. 40,178 కోట్లకు చేరింది. వడ్డీ వ్యయాలు 21 శాతం ఎగిసి రూ. 907 కోట్లుగా నమోదయ్యాయి. ఇక మొత్తం ఆర్థిక సంవత్సరానికి ఆదాయం 3 శాతం పెరిగి రూ. 21,238 కోట్లుగాను, నికర లాభం 55 శాతం పెరిగి రూ. 1,047 కోట్లుగాను నమోదైంది. పెరుగుతున్న ముడి వస్తువుల ధరల సమస్యను అధిగమించే ప్రణాళికలో భాగంగానే ఉచిత టాక్‌టైమ్ తగ్గింపు, టారిఫ్‌ల పెంపు చేపట్టినట్లు సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం మొత్తం ఆదాయంలో జీఎస్ఎం వైర్లెస్ డేటా వాటా 72 శాతంగా ఉందని తెలిపారు.