త్వరలో ఐడియా 4జీ సర్వీసులు
డిసెంబరులో ట్రయల్ ప్రాజెక్ట్
* వచ్చే జనవరి నుంచి వాణిజ్యపరంగా సేవలు...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగంలో ఉన్న ఐడియా సెల్యులార్ త్వరలో 4జీ ఎల్‌టీఈ సర్వీసులను దేశవ్యాప్తంగా ఆవిష్కరిస్తోంది. డిసెంబరులో ప్రయోగాత్మకంగా సేవలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం కంపెనీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ప్రస్తుతం నెట్‌వర్క్ పనితీరుపై సాంకేతిక పరీక్షలు జరుపుతోంది.
4జీ వస్తోందంటూ కస్టమర్లకు కంపెనీ సందేశాలను కూడా పంపుతోంది. వాస్తవానికి నవంబరులోనే 4జీ ఎల్‌టీఈ సేవలు ప్రారంభం కావాల్సి ఉంది. ముందుగా 1,800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు), హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలు, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, కేరళ టెలికం సర్కిళ్లలో కంపెనీ 4జీ సేవల రంగంలోకి అడుగిడుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో...
ఐడియా సెల్యులార్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో హైదరాబాద్‌తోపాటు వైజాగ్, విజయవాడ, వరంగల్ తదితర నగరాల్లో 4జీ ఎల్‌టీఈ సర్వీసులను ప్రారంభిస్తోందని సమాచారం. వాణిజ్యపరంగా 4జీ ఎల్‌టీఈ సేవలు జనవరిలో ప్రారంభం అవుతాయని ఐడియా ప్రతినిధి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు ముంబై నుంచి ఫోన్లో తెలిపారు. దేశంలో 10 సర్కిళ్లలో జూన్‌కల్లా 750 నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
మ్యూజిక్, గేమ్స్, మూవీస్, డిజిటల్ వాలెట్స్ వంటి డిజిటల్ సేవలను సైతం కంపెనీ సొంత బ్రాండ్‌లో 2016-17లో ప్రారంభిస్తోంది. వీటిని ప్రాంతీయ భాషల్లో తీసుకురానుండడం ఐడి యాకు కలిసి వచ్చే అంశం. దీనికోసం స్టార్టప్స్‌తోపాటు యాప్ డెవలపర్స్‌తో ఇప్పటికే చేతులు కలిపింది. డేటా వినియోగం పెరిగేం దుకు కస్టమర్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేయాలని సంస్థ భావిస్తోంది.
4జీ మార్కెట్లో పోటీ..
ఎయిర్‌టెల్ ఇప్పటికే 4జీ సేవలను ప్రారంభించి నగరాలను జోడించుకుంటూ పోతోంది. ఈ రంగంలోకి వొడాఫోన్ డిసెంబరులో ప్రవేశిస్తోంది. అటు రిలయన్స్ జియో నేడో రేపో అన్నట్టు ప్రారంభానికి సిద్ధమవుతోంది. తాజాగా ఐడియా సెల్యులార్ కూడా పోటీలోకి దిగుతోంది. మౌలిక వసతులకుగాను 2015-16లో ఐడియా సుమారు రూ.6,500 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు తెలుస్తోంది.
ఇందులో సగం మొత్తాన్ని ఇప్పటికే వ్యయం చేసిందని మార్కెట్ వర్గాల సమాచారం. సేవలపరంగా 4జీ మార్కెట్లో పోటీనిస్తామని కంపెనీ ఎండీ హిమాన్షు కపానియా ఇటీవల వెల్లడించారు. కాగా, బండిల్ ఆఫర్లను ప్రకటించేందుకు ఐడియా సిద్ధమవుతోంది. ఇందుకోసం ఐడియా బ్రాండ్ 4జీ ఎల్‌టీఈ స్మార్ట్‌ఫోన్లతోపాటు వైఫై గాడ్జెట్స్‌ను ఆవిష్కరించేందుకు దిగ్గజ కంపెనీలతో చర్చలు జరుపుతోంది.