మార్చికల్లా 121 కేంద్రాల్లో ఐడియా 4జీ
♦ ప్రస్తుతం ఏపీ సర్కిల్‌లో 37 పట్టణాల్లో సేవలు
♦ లక్షకు చేరువలో 4జీ కస్టమర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ ఐడియా సెల్యులార్ 4జీ ఎల్‌టీఈ సేవలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో విస్తరిస్తోంది. కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్‌సహా 37 పట్టణాల్లో సర్వీసులను ప్రారంభించింది. మొత్తంగా మార్చి చివరినాటికి 21 జిల్లా కేంద్రాలు, 100 తాలూకాల్లో సేవలను పరిచయం చేస్తామని సర్కిల్ సీవోవో టి.జి.బి.రామకృష్ణ మంగళవారం తెలిపారు. వీటిలో కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం వంటి పట్టణాలున్నాయని వెల్లడించారు. 4జీ ఎల్‌టీఈ సర్వీసులను అధికారికంగా ప్రకటించిన సందర్భంగా చీఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ రజత్ ముఖర్జీతో కలిసి మీడియాతో మాట్లాడారు.
4జీ సేవలకుగాను సర్కిల్‌లో 1,350 టవర్లను కంపెనీ ఏర్పాటు చేసింది. మార్చికల్లా ఈ సంఖ్య 2,250కి చేరుకుంటుందని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 1 లక్ష మంది 4జీ కస్టమర్లు ఉన్నారన్నారు. 4జీ ఎల్‌టీఈ సర్వీసులను 10 సర్కిళ్లలో ఈ ఏడాది జూన్‌లోపే 750 పట్టణాలకు విస్తరిస్తామని ముఖర్జీ వెల్లడించారు. టెలికం మార్కెట్లో ఈ 10 సర్కిళ్ల వాటా 50 శాతముందని వివరించారు. వచ్చే నెలలో మహారాష్ట్ర/గోవా, ఈశాన్య రాష్ట్రాల్లో సేవలను ప్రారంభిస్తామని చెప్పారు. రూ.25 నుంచే 4జీ ప్యాక్‌లను కంపెనీ ఆఫర్ చేస్తోంది.