ఐడియా నష్టాలు రూ.1,107 కోట్లు | Idea losses of Rs 1,107 crore | Sakshi
Sakshi News home page

ఐడియా నష్టాలు రూ.1,107 కోట్లు

Published Tue, Nov 14 2017 1:12 AM | Last Updated on Tue, Nov 14 2017 1:12 AM

Idea losses of Rs 1,107 crore - Sakshi

న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన టెలికం కంపెనీ ఐడియా సెల్యులార్‌కు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.1,107 కోట్ల నికర నష్టాలొచ్చాయి. ధరల విషయమై పోటీ తీవ్రంగా ఉండటం, జీఎస్‌టీ అమలు గట్టి ప్రభావమే చూపించాయని ఐడియా తెలిపింది. కంపెనీకి గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.92 కోట్ల నికర లాభం రాగా... ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో మాత్రం రూ.815 కోట్ల నికర నష్టాలు నమోదయ్యాయి.

గత క్యూ2లో రూ.9,300 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ2లో 20 శాతం క్షీణించి రూ.7,466 కోట్లకు పడిపోయింది. 4జీ నెట్‌వర్క్‌ కోసం భారీగా పెట్టుబడులు పెడుతుండటంతో వడ్డీ వ్యయాలు రూ. 1,183 కోట్లకు, తరుగుదల వ్యయాలు రూ.2,114 కోట్లకు పెరిగాయని కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ చివరి నాటికి నికర రుణ భారం రూ.54,100 కోట్లుగా ఉంది.

7 శాతం తగ్గిన ఏఆర్‌పీయూ: పోటీ కారణంగా టారిఫ్‌ల విషయంలో తీవ్రమైన ఒత్తిడి నెలకొన్నదని ఐడియా తెలిపింది. గతంలో 15 శాతం సర్వీస్‌ ట్యాక్స్‌ ఉందని, ఇప్పుడు 18 శాతం జీఎస్‌టీ అదనపు భారమని వివరించింది.

‘‘ఈ జూన్‌ క్వార్టర్లో రూ.141గా ఉన్న ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు రాబడి (ఏఆర్‌పీయూ) ఈ సెప్టెంబర్‌ క్వార్టర్లో 7 శాతం తగ్గి రూ.132కు పరిమితమయింది. వచ్చే ఏడాది మొదట్లోనే అత్యంత వేగవంతమైన వాయిస్‌ ఓవర్‌ లాంగ్‌–టర్మ్‌ ఇవొల్యూషన్‌ను (ఓల్ట్‌)  అందుబాటులోకి తేనున్నామని ఐడియా వెల్లడించింది. ఆర్థిక ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండడంతో బీఎస్‌ఈలో ఐడియా షేర్‌ 3 శాతం క్షీణించి రూ.94 వద్ద ముగిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement