ఐడియాకు వడ్డీ వ్యయాల భారం
♦ రెండు రెట్లకు పైగా పెరిగిన వడ్డీవ్యయాలు
♦ 39 శాతం తగ్గిన నికర లాభం
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం ఐడియా సెల్యులర్ నికర లాభంపై వడ్డీ వ్యయాలు ప్రభావం చూపాయి. దీంతో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి ఈ కంపెనీ నికర లాభం 39 శాతం తగ్గింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.942 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.576 కోట్లకు పడిపోయిందని ఐడియా సెల్యులర్ తెలిపింది. అయితే కంపెనీ ఆదాయం రూ.8,423 కోట్ల నుంచి 13 శాతం పెరిగి రూ.9,484 కోట్లకు పెరిగిందని వివరించింది.
వడ్డీ వ్యయాలు రూ.292 కోట్ల నుంచి రెండు రెట్లకు పైగా పెరిగి రూ. 808 కోట్లకు చేరాయని పేర్కొంది. డేటా సర్వీస్ ఆదాయం ఒక్కో మెగాబైట్‌కు 44.8 పైసల నుంచి 22.9 పైసలకు, అలాగే వాయిస్ కాల్స్ ఆదాయం 33.9 పైసల నుంచి 33.3 పైసలకు తగ్గాయని తెలిపింది,. ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్పెక్ట్రమ్ బకాయిలతో సహా తమ నికర రుణ భారం ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.38,750 కోట్లుగా ఉందని పేర్కొంది.
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం విషయానికొస్తే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.3,193 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) 4 శాతం క్షీణించి రూ.3,080 కోట్లకు తగ్గిందని ఐడియా సెల్యులర్ తెలిపింది. ఆదాయం రూ.31,571 కోట్ల నుంచి 14 శాతం వృద్ధి చెంది రూ.35,981 కోట్లకు పెరిగిందని వివరించింది.