ఫ్రెషర్ల కంటే తక్కువగా బిర్లా వేతనం
ఫ్రెషర్ల కంటే తక్కువగా బిర్లా వేతనం
Published Fri, Jun 9 2017 12:42 PM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM
టెలికాం మార్కెట్ లో రిలయన్స్ జియో దెబ్బ అంతా ఇంతా కాదు. టెలికాం దిగ్గజాల రెవెన్యూలు భారీగా తుడిచిపెట్టుకుపోవడమే కాక, ఆ కంపెనీ చైర్మన్ ల వేతనాలకు భారీగా గండికొడుతోంది. ఐడియా సెల్యులార్ కు చైర్మన్ గా ఉన్న కుమార్ మంగళం బిర్లా 2017 ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్ల కంటే తక్కువగా వేతనాన్ని ఆర్జించారని తెలిసింది. 2017 ఆర్థికసంవత్సరంలో ఆయన కేవలం రూ.3.30 లక్షల వేతనాన్ని మాత్రమే ఇంటికి తీసుకెళ్లారని కంపెనీ వార్షిక రిపోర్టులో వెల్లడించింది. గతేడాది ఈయన వేతనం రూ.13.15 కోట్లు. 2017లో చైర్మన్ కు లేదా ఇతర నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు కంపెనీ ఎలాంటి కమిషన్లను చెల్లించలేదు. దశాబ్దం క్రితం ఐపీఓకు వచ్చిన తర్వాత తొలిసారి ఈ టెలికాం ఆపరేటర్ వార్షిక నికర నష్టాలను నమోదుచేసింది. రెవెన్యూలను పడిపోయినట్టు పేర్కొంది. కన్సాలిడేటెడ్ బేసిస్ లో ఐడియా రెవెన్యూలు 0.8 శాతం పడిపోవడంతో రూ.404 కోట్ల నష్టాలను మూటకట్టుకుంది.
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మార్కెట్లోకి ప్రవేశించిన అనంతరం టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ లు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. జియో ఉచిత ఆఫర్ల తాకిడి తట్టుకోవడానికి ఈ కంపెనీలు సైతం భారీగా డేటా ధరలను తగ్గించాయి. ఈ పోటీ వాతావరణాన్ని తట్టుకోవడానికి ఐడియా, వొడాఫోన్ లు కలిసి అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించబోతున్నాయి. ఈ డీల్ ఇంకా పూర్తికావాల్సి ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో టెలికాం రంగం కోలుకుంటుందని బిర్లా ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో సంజీవ్ ఆగా పారితోషికం కూడా రూ.16.7 లక్షల నుంచి రూ.5.90 లక్షలకు పడిపోయింది. అయితే మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు కపానియా వేతనం మాత్రం 13 శాతం పెరిగింది. ఆయనతో పాటు ఫైనాన్స్ చీఫ్ అక్షయ మూన్ద్రా వేతనం కూడా రూ.2.23 కోట్ల నుంచి రూ.2.33 కోట్లకు ఎగిసింది. దీనిలో స్టాక్ ఆప్షన్లను కలుపలేదు. కంపెనీలో సగటున ఉద్యోగుల వేతనం 8 శాతం పెరిగింది.
Advertisement
Advertisement