న్యూఢిల్లీ: ‘చేస్తున్న, ప్రవేశించే ప్రతి వ్యాపారంలో మొదటి లేదా రెండవ స్థానంలో ఉండాలనుకుంటున్నాం. కాబట్టి సామర్థ్యం పెంపు ఏకైక మార్గం. అలా కాని పక్షంలో ఈ రోజు మనుగడ సాగించడం చాలా కష్టమని నేను భావిస్తున్నాను. లేదంటే అధిక మార్జిన్‌లను అందించే చాలా ప్రత్యేక, ఉన్నత సాంకేతికత ఉండాలి’ అని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కేఎం బిర్లా అన్నారు.
ఒక మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఆదిత్య బిర్లా గ్రూప్ దాదాపు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు చేసింది. ప్రధానంగా తయారీ రంగంలో పెట్టుబడి పెట్టాం. కంపెనీ నిర్వహించే అన్ని విభాగాలలో మొదటి రెండు స్థానాల్లో నిలవాలని లక్ష్యంగా చేసుకున్నాం. గ్రూప్ పెట్టుబడులు చాలా వరకు రాబోయే 15–20 ఏళ్లలో వ్యాపార దృక్పథం దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలికంగా ఉంటాయి. విలువలు, వ్యక్తులు, సామర్థ్యం పెంపు, దీర్ఘకాలిక లక్ష్యంతో వ్యాపారాల నిర్వహణ అనేది సంస్థ వ్యాపార విధానాన్ని నిర్వచించే కీలక వ్యూహాలు’ అని వెల్లడించారు.
కఠినమైన నిర్ణయాలు..
గ్రూప్ సంస్థ హిందాల్కో ద్వారా నోవెలిస్‌ను కొనుగోలు చేయడంతో సహా అనేక కఠినమైన నిర్ణయాలను తీసుకున్నామని బిర్లా తెలిపారు. నోవెలిస్‌ను దక్కించుకోవడానికి 6 బిలియన్ డాలర్లు వెచ్చించినట్టు చెప్పారు. ‘నేను ఒక కంపెనీని (నోవెలిస్) కొనుగోలు చేశాను. అది చాలా పెద్దది. షేరు దెబ్బతింది. ముఖ్యమైనది కాదని పెట్టుబడిదారులు స్పష్టం చేశారు. తిరిగి పుంజుకోవడానికి దాదాపు ఏడాది పట్టింది. ఆ నిర్ణయం తీసుకున్న ఏ ప్రొఫెషనల్ సీఈవో అయినా తొలగించబడతారు. ఎందుకంటే ఆ సమయంలో అది తప్పుగా అనిపించింది’ అని అన్నారు.
దీర్ఘకాలానికి వ్యాపారాలు నిర్వహించడం అనేది మనలో ఒక సంస్కృతి అని వివరించారు. కంపెనీ 36 ఏళ్లలో 100 మిలియన్ టన్నుల సిమెంట్ సామర్థ్యాన్ని నిర్మించింది. వచ్చే 5 ఏళ్లలో దీనిని 150 మిలియన్ టన్నులకు, 10 ఏళ్లలో 200 మిలియన్ టన్నులకు పెంచుతామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment