టెలినార్‌ను కొంటున్నది ఎవరు?
టెలినార్‌ను కొంటున్నది ఎవరు?
Published Fri, Dec 16 2016 8:49 AM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM
న్యూఢిల్లీ : చౌకైన ఆఫర్లతో తక్కువ కాలంలోనే ఎక్కువమంది టెలికాం ఖాతాదారులను ఆకర్షించుకునేందుకు భారత్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన టెలినార్ ప్రస్తుతం పూర్తిగా అయోమయంలో పడిపోయింది. భారత్ యూనిట్లో తమకొచ్చే నష్టాలు తట్టుకోలేక, ఇక ఇక్కడ తమ వ్యాపారాలు కొనసాగించలేక, ఎలాగైనే భారత్ బిజినెస్ల నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. దీనికోసం మూడో టెలికాం దిగ్గజగా ఉన్న ఐడియా సెల్యులార్తో చర్చలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. తమ భారత్ యూనిట్ను నగదు రహితంగా ఐడియా సెల్యులార్కు విక్రయించేందుకు చర్చలు ప్రారంభించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఈ డీల్ ఓకే అయితే దేశంలో మూడో అతిపెద్ద టెలికాం దిగ్గజంగా ఉన్న ఐడియా చేతికి నార్వేకు చెందిన ఈ టెలికాం ఆపరేటర్ స్థానిక వ్యాపారాలన్నీ దక్కనున్నాయని సమాచారం.. ఎలాంటి వాస్తవ చెల్లింపులు లేకుండా టెలినార్ రుణాలను, ఆస్తులను మార్పిడి చేసుకునేలా ఈ రెండు కంపెనీలు చర్చలు జరుపుతున్నాయని తెలుస్తోంది.
అయితే ఈ చర్చలు సఫలీకృతం కాకపోవచ్చని కంపెనీకి సంబంధించిన మరో వ్యక్తి చెప్పారు. మరో రూ.36,000కోట్లను తన రుణభారంగా మార్చుకునేందుకు ఐడియా సెల్యులార్ సిద్ధంగా లేదని పేర్కొన్నారు. ఇప్పటికే అక్టోబర్ ఆక్షన్లో స్పెక్ట్రమ్ కొనుగోలుకు అదనంగా రూ.13,000 కోట్లను ఐడియా సెల్యులార్ వెచ్చించిన సంగతి తెలిసిందే. టెలినార్ ఇండియాకు ఇప్పటికే రూ.1,900 కోట్లను స్పెక్ట్రమ్ చెల్లింపులుగా కేంద్రానికి చెల్లించాల్సి ఉంది. అంతేకాక ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్స్కు రూ.1,800 కోట్లు బాకీ పడి ఉంది. అయితే ఇటు టెలినార్, ఐడియా సెల్యులార్ రెండు కూడా ఈ విషయంపై స్పందించడం లేదు. ఒకవేళ ఐడియా చేతికి టెలినార్ దక్కితే కొన్ని కీలక సర్కిళ్లలో 1800 ఎంహెచ్జడ్ బ్యాండ్లో 4జీ స్పెక్ట్రమ్ ఈ కంపెనీకి ప్రయోజనంగా మారనుంది. మరోవైపు టెలినార్ కంపెనీ తన ఇండియా బిజినెస్ల నుంచి వైదొలగుతుందని ఓ సీనియర్ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్ కూడా చెప్పారు.
Advertisement
Advertisement