Telenor
-
టెలినార్ ఉద్యోగుల కష్టాలు
హైదరాబాద్: టెలినార్ ఇండియా, ఎయిర్టెల్ విలీనం టెలినార్ ఉద్యోగులకు శాపంగా మారింది. కొంత మందిని ఇంటికి సాగనంపడానికి ఎయిర్టెల్ సిద్ధమౌతోంది. ఈ విషయానికి సంబంధించి భారతీ ఎయిర్టెల్ నుంచి టెలినార్ ఉద్యోగులకు ఈ–మెయిల్స్ వెళ్లినట్లు తెలుస్తోంది. విలీనం అనంతరం టెలినార్ ఇండియాలోని ఉద్యోగులందరూ ఎయిర్‌టెల్‌లో సరైన స్థాయి ఉద్యోగాన్ని పొందలేరని ఎయిర్టెల్ పేర్కొంది. కాగా టెలికం విభాగం మే 14న భారతీ ఎయిర్టెల్, టెలినార్ ఇండియా విలీనానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ‘ఎయిర్టెల్ నుంచి నాకు ఒక ఈ–మెయిల్ వచ్చింది. ఎయిర్టెల్ హెచ్ఆర్ అధికారుల సమావేశానికి హాజరయ్యాను. విలీనం తర్వాత నా ప్రస్తుత హోదాకు వారి సంస్థలో ఖాళీ లేదని చెప్పారు. ఐదు నెలల వేతనాన్ని ఆఫర్ చేసి, ఉద్యోగానికి రాజీనామా చేయాలని కోరారు. ఏం చేయాలో అర్థంకావడం లేదు’ అని ఒక ఉద్యోగి ఆవేదన చెందాడు. ఎయిర్టెల్ ఇంటికి సాగనంపే ఉద్యోగులకు మంచి ఫైనాన్షియల్ ప్యాకేజ్, మెడికల్ ఇన్సూరెన్స్ కొనసాగింపు, ఉచిత కాల్స్ వంటి సౌకర్యాలను ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ‘మేం ఇప్పటికే టెలినార్ ఇండియా నుంచి 700కుపైగా మందిని కొనసాగిస్తున్నాం. వీరి ఎదుగుదలకు ఎయిర్టెల్ ఇండియా సహా ఇతర విభాగాల్లో అవకాశాలను కల్పించాం’ అని ఎయిర్టెల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే టెలినార్ ఇండియాలో 1,400 మంది ఉద్యోగులు ఉన్నారు. ‘టెలినార్ ఇండియా కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌లో కలిసిపోయిందనే విషయాన్ని మీరు తప్పక తెలుసుకోవాలి. ఈ చట్టబద్ధమైన విలీనం నేపథ్యంలో తదనంతర విషయాలు, తదుపరి చర్యల గురించి మీకు తెలియజేయడానికి మిమల్ని ఎయిర్టెల్ బృందంతో సమావేశానికి ఆహ్వానిస్తున్నాం. కింద (మెయిల్లో) తెలియజేసిన సమాచారం ప్రకారం సమావేశానికి అందుబాటులో ఉండండి’ అని ఎయిర్టెల్.. టెలినార్ ఇండియా ఉద్యోగులకు పంపిన ఈ–మెయిల్స్‌లో పేర్కొంది. టెలినార్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ (తూర్పు, పశ్చిమ),అస్సాం సర్కిళ్లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
ఎయిర్టెల్–టెలినార్ విలీనానికి డాట్ ఓకే!
న్యూఢిల్లీ: టెలికం విభాగం (డాట్) తాజాగా భారతీ ఎయిర్టెల్, టెలినార్ ఇండియా విలీనానికి ఆమోదం తెలిపింది. ఇరు కంపెనీలు దాదాపు రూ.1,700 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని కోరుతూ డాట్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గతవారం కొట్టేసింది. రూ.1,700 కోట్ల గ్యారెంటీ మొత్తంలో వేలం లేకుండా ఎయిర్‌టెల్‌కు కేటాయించిన రేడియో వేవ్స్‌కు సంబంధించిన వన్‌టైమ్ స్పెక్ట్రమ్ చార్జీ రూ.1,499 కోట్లు కాగా, మిగిలిన రూ.200 కోట్లకుపైగా మొత్తం టెలినార్ స్పెక్ట్రమ్ చెల్లింపులది. అలాగే సుప్రీం కోర్టు ఇరు కంపెనీల విలీనానికి అంగీకారం తెలియజేయాలని డాట్‌ను ఆదేశించింది కూడా. విలీనం పూర్తయితే ఏడు టెలికం సర్కిళ్లలో ఎయిర్టెల్ స్పెక్ట్రమ్ విస్తృతి మరింత పెరుగుతుంది. దీనికి 1800 మెగాహెర్ట్జ్ బాండ్లో 43.4 మెగాహెర్ట్జ్ ్జ స్పెక్ట్రమ్ అదనంగా సమకూరుతుంది. టెలినార్ ఇండియా ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ (తూర్పు, పశ్చిమ), అస్సాంలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఎయిర్టెల్–టెలినార్ విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ విలీనానికి సీసీఐ ఆమోదం న్యూఢిల్లీ: ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ కంపెనీని విలీనం చేసుకోవడానికి వేదాంత కంపెనీకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ కంపెనీ పునరుజ్జీవనం కోసం వేదాంత కంపెనీ రూపొందించిన ప్రణాళికకు గత నెలలో ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ) కింద మొదటిసారిగా పరిష్కారమైన కేసు ఇదే. ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ కంపెనీ బ్యాంక్ బకాయిలు రూ.13,000 కోట్లు ఉండగా, దీంట్లో ఎస్బీఐ వాటా రూ.5,000 కోట్లుగా ఉన్నాయి. ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ కంపెనీకి జార్ఖండ్‌లోని బొకారోలో 1.5 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల స్టీల్ ప్లాంట్ ఉంది. -
ఎయిర్టెల్-టెలినార్ విలీనం నేడే
సాక్షి ఎక్స్‌క్లూజివ్, హైదరాబాద్ : భారత టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్, టెలినార్ ఇండియాల విలీనం సోమవారం (నేడు) పూర్తికానుంది. ఈ మేరకు కేంద్ర టెలికాం శాఖ అనుమతి ఇచ్చింది. విలీనం అనంతరం 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో మొత్తం 43.4 మెగాహెట్జ్ స్పెక్ట్రం ఎయిర్టెల్ పరంకానుంది. దీనిపై ఇరు టెలికాం కంపెనీలు మధ్యాహ్నం మూడు గంటలకు అధికారికంగా ప్రకటన చేయనున్నాయి. ఏడు సర్కిళ్లు ఆంధ్రప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ(ఈస్ట్), యూపీ(వెస్ట్), అస్సాంలలో టెలినార్ సేవలందిస్తోంది. మార్చి 8న నేషనల్ కంపెనీ లా ట్రెబ్యునల్ ఈ విలీనానికి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ఎయిర్‌టెల్‌లో టెలినార్ విలీనానికి లైన్ క్లియర్
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌లో టెలినార్ విలీన ప్రతిపాదనకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించిన విలీన పథకానికి కొన్ని షరతులతో అనుమతినిచ్చింది. ఇప్పటికే ఈ ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, స్టాక్ ఎక్సే్చంజీలు బీఎస్ఈ.. ఎన్ఎస్ఈల నుంచి అనుమతులు దక్కగా .. టెలికం శాఖ నుంచి ఆమోద ముద్ర లభించాల్సి ఉంది. గతేడాది ఫిబ్రవరిలో రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ సహా ఏడు సర్కిల్స్‌లో టెలినార్ ఇండియా కార్యకలాపాలను ఎయిర్టెల్ కొనుగోలు చేస్తుంది. దీంతో టెలినార్ ఇండియా ఆస్తులు, యూజర్లు అంతా ఎయిర్టెల్ ఖాతాలోకి చేరతారు. -
ఖజానాకు భారీగా గండికొట్టిన టెల్కోలు
న్యూఢిల్లీ : మార్కెట్లోకి నూతనంగా ప్రవేశించిన రిలయన్స్ జియోతో పాటు మరో నాలుగు టెలికాం కంపెనీలు ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొట్టాయి. ఈ టెలికాం కంపెనీలు రూ.14,800 కోట్లకు పైగా రెవెన్యూలను తక్కువ చేసి చూపించాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.2,578 కోట్లు గండికొట్టిందని ఆడిట్ సంస్థ కాగ్ మంగళవారం వెల్లడించింది. నేడు పార్లమెంట్‌కు సమర్పించిన రిపోర్టులో కాగ్ ఈ విషయాలను తెలిపింది. రూ.1,015.17 కోట్ల లైసెన్సు ఫీజులను ప్రభుత్వానికి తక్కువ చెల్లించాయని కాగ్ తెలిపింది. రూ.511.53 కోట్లు స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జ్ రూపంలో, రూ.1,052.13 కోట్లు చెల్లింపులు ఆలస్యంగా చేసినందుకు గాను వర్తించే వడ్డీలు ప్రభుత్వానికి గండికొట్టాయని పేర్కొంది. టాటా టెలిసర్వీసుల నుంచి రూ.1,893.6 కోట్లు, టెలినార్ నుంచి రూ.603.75 కోట్లు, వీడియోకాన్ నుంచి రూ.48.08 కోట్లు, క్వాడ్రాంట్ నుంచి రూ.26.62 కోట్లు, జియో నుంచి రూ.6.78 కోట్లు... లైసెన్సు ఫీజు, ఎస్‌యూసీ, వడ్డీ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన వసూళ్లు తక్కువగా వచ్చాయని కాగ్ వెల్లడించింది. -
తెలుగు కస్టమర్లకు టెలినార్ సరికొత్త ఆఫర్స్
సాక్షి, హైదరాబాద్ : నార్వేకు చెందిన టెలికాం ఆపరేటర్ టెలినార్ తెలుగు రాష్ట్రాల కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్లను లాంచ్ చేసింది. ఈ కొత్త ప్యాకేజీలు ప్రీపెయిడ్ వాయిస్, డేటా సర్వీసులకు ఎంతో సరసమైనవని తెలిపింది. టెలినార్ ప్రవేశపెట్టిన ప్లాన్లలో ఒకటి ఎస్టీవీ 143. ఈ ప్లాన్ కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లోని పాత కస్టమర్లు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా ఎలాంటి అవాంతరాలు లేకుండా 2జీబీ హైస్పీడ్ 4జీ డేటా సర్వీసులను సద్వినియోగం చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. కొత్త కస్టమర్లు ఇవే ప్రయోజనాలను పొందాలంటే ఎఫ్ఆర్సీ 148తో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ వాడక కస్టమర్ల కోసం ఎఫ్ఆర్సీ 448ను లాంచ్ చేసింది. ఈ కొత్త ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్ కింద 84 రోజుల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను, హైస్పీడు 4జీ డేటాను వాడుకోవచ్చని టెలినార్ పేర్కొంది. తమ కొత్త ప్లాన్లలతో కొత్త, పాత కస్టమర్లు బిల్లు గురించి ఆందోళన చెందకుండా తమ ప్రియమైన వారితో అపరిమితంగా మాట్లాడుకోవచ్చని టెలినార్ ఇండియా టీఎస్, ఏపీ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కోటియాన్ తెలిపారు. సరసమైన ఉత్పత్తులు, సంబంధిత సర్వీసులతో కస్టమర్లకు వీలైనన్ని సేవలు టెలినార్ అందిస్తూ ఉంటుందని చెప్పారు. -
భారతి ఎయిర్‌టెల్‌కు ఊరట
ముంబై: దేశీయ టెలీ దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌కు సెబీ ద్వారా భారీ ఊరట లభించింది. ఎయిర్ టెల్ టెలినార్ డీల్ కి సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జియో షాక్ తో ఇబ్బందుల్లో పడిన ఎయిర్టెల్ ఉపశమనం లభించనుంది. నార్వే టెలికాం ఆపరేటర్ టెలినార్ భారతీయ వ్యాపారాన్ని స్వాధీనం చేసుకున్నందుకు సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఆమోదం లభించిందని ఎయిర్టెల్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో చెప్పింది. టెలినార్ కమ్యూనికేషన్స్‌ను విలీనం చేసుకునేందుకు అటు స్టాక్ ఎక్స్ఛేంజీలు, ఇటు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి పొందిన వార్తలతో మార్కెట్లో భారతీ ఎయిర్టెల్ కౌంటర్ బాగా పుంజుకుంది. దాదాపు 3 శాతానికిపైగా జంప్‌చేసింది. మరోవైపు టెలినార్, ఎయిర్టెల్ విలీన ఆమోదానికి గాను భారతి, టెలినార్ రెండూ కలిసి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టి) ఢిల్లీ బెంచ్ వద్ద దరఖాస్తును దాఖలు చేశాయి. అలాగే ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చట్టబద్ధమైన ఆమోదాన్ని కూడా పొందాల్సి ఉంది. కాగా ఫిబ్రవరి 23 న టెలినార్ ను కొనుగోలు చేయనున్నామని ఎయిర్ టెల్ భారత్ ప్రకటించింది. ఈ విలీనం ద్వారా రెవెన్యూ మార్కెట్ వాటాను 35 శాతానికి పెంచుకోవడమే కాకుండా గుజరాత్,మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లో మరింత బలోపేతం కానున్నట్టు తెలిపింది. టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక్క దెబ్బతో మిగతా టెలికాం కంపెనీలన్ని కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్, టెలినార్ విలీనం ప్రాధాన్యతను సంతరించుకోనుంది. జియో ఎంట్రీతో వోడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ కూడా విలీన బాటలో పయనిస్తున్న సంగతి తెలిసిందే. అప్పుల ఊబిలో కూరుకు పోయిన ఆర్ కాం, ఎయిర్‌సెల్ వంటి ఇతర ఆపరేటర్లపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. -
టెలినార్ అన్లిమిటెడ్ డేటా @ 73
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డేటా వార్‌లో టెలినార్ సైతం సవాల్ విసురుతోంది. కొత్త కస్టమర్ల కోసం 30 రోజుల కాలపరిమితితో రూ.73ల ఫస్ట్ రీచార్జ్‌తో అన్లిమిటెడ్ 4జీ/2జీ డేటాను ఆఫర్ చేస్తోంది. ఎస్టీడీ కాల్స్ సైతం నిముషానికి 25 పైసలకే 90 రోజులపాటు చేసుకోవచ్చు. లైఫ్‌టైం వాలిడిటీతో రూ.25 టాక్‌టైం అందుకోవచ్చు. మరో 28 రోజులపాటు అన్లిమిటెడ్ డేటా ఆఫర్ పొందాలంటే కస్టమర్లు రెండో నెలలో రూ.47 రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయోజనాల కోసం ఎఫ్ఆర్ రూ.73 రీచార్జ్ చేసిన 120 రోజుల్లోనే రూ.47 రీచార్జ్ చేయాలి. 120 రోజుల తర్వాత చేసే రూ.47 రీచార్జ్‌తో 28 రోజుల కాలపరిమితితో 400 ఎంబీ 4జీ డేటా ఇస్తారు. -
రూ.103కే అపరిమిత డేటా, వాయిస్ కాల్స్
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో ఎంట్రీ, డేటా ఖర్చులతో సతమతమవుతున్న వారికి ఏ మేర ఉపయోగపడిందంటే. కంపెనీలు భారీ ఎత్తున్న డేటా ఆఫర్లు ప్రకటించేలా చేసింది. జియో దెబ్బకు కంపెనీలన్నీ డేటా రేట్లను తగ్గిస్తూ వినియోగదారులను అలరిస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు తమతమ డేటా రేట్లను భారీగా తగ్గించగా.. తాజాగా టెలినార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం 103 రూపాయలకే అపరిమిత కాలింగ్, 4జీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. యూజర్లందరూ తమ టెలినార్ నెంబర్ పై రూ.103తో రీఛార్జ్ చేసుకుని ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొంది. ఈ స్కీమ్ కింద యూజర్లకు అందుబాటులో ఉండే అపరిమిత 4జీ డేటా 60 రోజుల పాటు వాడుకోవచ్చట. అదేవిధంగా అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని 90 రోజులు వరకు వాడుకోవచ్చని తెలిపింది. రూ.103 ప్యాక్ కింద కొత్త 4జీ యూజర్లైతే 25 రూపాయల ఉచిత టాక్ టైమ్ తో పాటు నిమిషానికి 25 పైసలు మాత్రమే కాల్ ఛార్జ్ భరించేలా రూపొందించింది. అదేవిధంగా అపరిమతి 4జీ డేటా లిమిట్ కూడా వారు రోజుకు 2జీబీ మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. 2జీబీ డేటా అయిపోయిన తర్వాత డేటా స్పీడ్ 128కేబీపీఎస్ కు పడిపోతుంది. టెలినార్ 4జీ సర్వీసులను ఆఫర్ చేసే అన్ని సర్కిళ్లలో ఈ ప్లాన్ అందుబాటులో ఉంచనున్నట్టు కంపెనీ పేర్కొంది. -
కేవలం రూ.47కు 56జీబీ 4జీ డేటా
ముంబై: రిలయన్స్ జియో సంచలనమైన డేటా ఆఫర్లతో టెలికాం కంపెనీలన్నీ ఒక్క ఉదుటున కిందకి దిగొస్తున్నాయి. నార్వేకు చెందిన టెలికాం కంపెనీ టెలినార్ మంగళవారం ఓ స్పెషల్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ కింద కేవలం రూ.47కు 56జీబీ 4జీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. ఈ డేటా 28 రోజుల వరకు వాలిడిటీ ఉంటుందట. అయితే ఎవరైతే రోజుకు గరిష్టంగా 2జీబీ డేటాను వాడుతారో ఆ సబ్స్క్రైబర్లకు మాత్రమే ఈ ప్లాన్ ను సద్వినియోగం చేసుకోవడానికి వీలవుతుందని కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్ కింద 80 పైసలకే 1జీబీ డేటాను అందిస్తామని.. కానీ కండిషన్లు అప్లయ్ అవుతాయని టెలినార్ ఓ ప్రకటలో తెలిపింది. అర్హతగల యూజర్లకు టెలినార్ ఎస్ఎంఎస్ రూపంలో ఈ ప్రాసెస్‌ను పేర్కొంటోంది. అయితే ఈ ఆఫర్ అందరికాకుండా టెలినార్ ఇన్సైడ్ సర్కిళ్లకు మాత్రమే కంపెనీ అందించనుంది. టెలినార్ ప్రకటించిన ఈ ఆఫర్, రిలయన్స్ జియో కొత్తగా అమలుచేయబోతున్న రూ.303 ప్లాన్‌ను పోలి ఉందని తెలుస్తోంది. జియోను టార్గెట్ గా చేసుకుని టెలినార్ ఈ ఆఫర్ ను ప్రకటించిందట. అయితే ఈ ప్లాన్ కింద జియో మాదిరి ఉచిత వాయిస్ కాల్స్ ను టెలినార్ అందించడం లేదు. కేవలం 56జీబీ డేటాను మాత్రమే అందించనుంది. -
జియో ఎఫెక్ట్ : మరో విలీనం కన్ఫార్మ్
-
జియో ఎఫెక్ట్ : మరో విలీనం కన్ఫార్మ్
ముంబై: జియో ఎఫెక్ట్‌తో టెలికాం ఇండస్ట్రీలో మరో విలీనం కన్ ఫార్మ్ అయిపోయింది. మార్కెట్ విస్తరణలో భాగంగా నార్వేకు చెందిన టెలినార్ కంపెనీ ఇండియా బిజినెస్ లను టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయంపై భారతీ ఎయిర్ టెల్ గురువారం ఫైనల్ ప్రకటన చేసింది. టెలినార్(ఇండియా) కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను కొనుగోలుచేసేందుకు తాము టెలినార్ సౌత్ ఆసియా ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఓ నిర్ణయాత్మక ఒప్పందంలోకి ప్రవేశించామని తెలిపింది. రెగ్యులేటరీ ఫైలింగ్ లో టెలినార్ ఇండియాకు సంబంధించిన ఏడు సర్కిళ్లను కొనుగోలు చేస్తున్నట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ(ఈస్ట్), యూపీ(వెస్ట్), అస్సాంలు ఈ సర్కిళ్లలో ఉన్నాయి. ఎక్కువ జన సాంద్రత కలిగిన సర్కిళ్లను కొనుగోలుచేసి, రెవెన్యూలను భారీగా పెంచుకోవాలని ఎయిర్ టెల్ భావిస్తోంది. అయితే ఎంతమొత్తంలో కొనుగోలు చేయబోతుందో, ఒక్కో షేరుకు ఎంత చెల్లించనుందో బీఎస్ఈ ఫైలింగ్ లో ఎయిర్ టెల్ తెలుపలేదు. అగ్రిమెంట్ ప్రకారం ఎయిర్ టెల్, టెలినార్ ఇండియా విలీనం అయిపోతే, టెలినార్ ఇండియా మొత్తం దాని ఆధీనంలోకి వచ్చేస్తోంది. వొడాఫోన్-ఐడియా విలీనానికి ముందే ఈ కొనుగోలు ఒప్పందాన్ని ఎయిర్ టెల్ పూర్తిచేయాలనుకుంటోంది. సబ్ స్క్రైబర్ బేస్ లో దూసుకెళ్తున్నాంటూ ప్రకటిస్తున్న జియోకూ ఇది షాకివ్వాలనుకుంటోంది. టెలినార్ ఇండియాను తనలో విలీనం చేసుకోవడం వల్ల ఎయిర్ టెల్ అదనంగా 52.5 మిలియన్ యూజర్లను పొందుతోంది. ప్రస్తుతం ఎయిర్ టెల్ కు 269.40 మిలియన్ సబ్స్రైబర్లు ఉన్నారు. -
నిమిషానికి 20 పైసలు: టెలినార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ టెలినార్ రూ.22 విలువ గల స్పెషల్ టారిఫ్ వోచర్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా దేశంలో ఏ ప్రాంతానికి చేసే కాల్ అయినా నిముషానికి 20 పైసలు మాత్రమే చార్జీ చేస్తారు. వోచర్ కాలపరిమితి 28 రోజులు. సర్కిల్లో ఇదే చవకైన కాల్ రేట్ అని కంపెనీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ తెలిపారు. -
హైదరాబాద్‌లో టెలినార్ 4జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ టెలినార్ హైదరాబాద్‌లో 4జీ సేవలను ప్రారంభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో కంపెనీ ఇప్పటికే 11 పట్టణాల్లో 4జీ సర్వీసులను అందిస్తోంది. రూ.97లకే 1 జీబీ 4జీ డేటాను 28 రోజుల కాల పరిమితితో ఆఫర్ చేస్తోంది. టెలినార్ కస్టమర్లు 2జీ నుంచి 4జీకి ఉచితంగా అప్‌గ్రేడ్ అవొచ్చు. వీరికి 1 జీబీ డేటాను 15 రోజుల వ్యాలిడిటీతో ఫ్రీగా ఇస్తారు. టెలినార్ బ్రాండెడ్ స్టోర్లు, ఎంపిక చేసిన రిటైల్ ఔట్లెట్లలో సిమ్‌ను మార్చుకోవచ్చు. వేగవంతమైన ఇంటర్నెట్ అందించేందుకు చేపట్టిన టవర్ల ఆధునీకరణ ప్రక్రియ 65 శాతం పూర్తి అయిందని సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా 6 సర్కిళ్లకుగాను 44 పట్టణాల్లో కంపెనీ 4జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. -
జియో ఎఫెక్ట్: ఎయిర్టెల్ మరో ఎత్తుగడ
న్యూడిల్లీ: దేశీయ అతి పెద్ద టెలికాం కంపెనీ భారతి ఎయిర్టెల్ భారీ విస్తరణకు సిద్ధమవుతోంది. ఒక పక్క జియో ఎంట్రీతో ఒక మాదిరి సంస్థలు కుదేలవుతోంటే.. ఎయిర్ టెల్ తన మార్కెట్ ను నిలబెట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తమ మార్కెట్ విస్తరణలో భాగంగా సంస్థ తాజాగా మరో కీలక అడుగు వేయనుంది. నార్వే ఆధారిత టెలికం సంస్థ టెలినార్ కు చెందిన భారత వాటాను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సుమారు 350 మిలియన్ డాలర్ల టెలినార్ వాటాను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం టెలినార్‌తో చర్చలు కూడా జరుపుతోంది. సంస్థలోని సగం వాటాను ప్రస్తుతం కొనుగోలు అనంతరం మిగిలిన సగభాగాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. జనవరి చివరికి నాటికి ఇరు సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని నివేదికలు తెలుపున్నాయి. టెలినార్‌కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5.3 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అయినా తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. స్పెక్ట్రం వేలం చెల్లింపులకు సంబంధించి భారత ప్రభుత్వానికి టెలినార్ రూ.1900 కోట్లు, రుణాల రూపంలో బ్యాంకులకు మరో రూ.1800 కోట్లు బకాయి పడింది. దీంతో ఈ రుణ భారంలో సగం చెల్లించడం ద్వారా దానిని సొంతం చేసుకోవాలని ఎయిర్టెల్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ప్రత్యర్థుల నుంచి తీవ్రంగా ఎదురవుతున్న పోటీ, డేటా స్పెక్ట్రం ఎక్కువగా లేకపోవడం, భారీ నష్టాల కారణంగా భారత్ మార్కెట్ నుంచి వైదొలగాలని భావిస్తోంది. ఈ మేరకు గతనెలలో టెలినార్ ఇండియా ఐడియాతో చర్చలు జరిపింది. అలాగే 7 సర్కిల్స్ లో 4 జీ సేవలు అందిస్తుండగా ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర తదితర 6 సర్కిల్స్ లో 2 జీ సేవలు అందిస్తోంది. అసోం ఇంకా తన సేవల్ని ప్రారంభించాల్సి ఉంది. -
టెలినార్ ఇండియాపై ఎయిర్టెల్ కన్ను
డీల్ విలువ 350 మిలియన్ డాలర్లు! న్యూఢిల్లీ: నార్వే టెలికం సంస్థ టెలినార్‌కి భారత్‌లో ఉన్న వ్యాపార కార్యకలాపాలను కొనుగోలు చేయాలని భారతీ ఎయిర్టెల్ భావిస్తోంది. ఇందుకు సంబంధించి టెలినార్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ డీల్ విలువ దాదాపు 350 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా. టెలినార్ ఇండియా రుణభారంలో సగం తాము, మిగతాది ఆ కంపెనీ మాతృ సంస్థ భరించేలా ఎయిర్టెల్ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. జనవరి ఆఖరు నాటికి ఒప్పందం పూర్తి కావొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. డేటా స్పెక్ట్రం ఎక్కువగా లేకపోవడం, భారీ నష్టాలు, ప్రత్యర్థి సంస్థల నుంచి తీవ్రమైన పోటీ తదితర అంశాల కారణంగా భారత్ మార్కెట్ నుంచి వైదొలగాలని టెలినార్ కొన్నాళ్లుగా యోచిస్తోంది. భారత కార్యకలాపాలను విక్రయించేందుకు ఐడియాతోనూ టెలినార్ చర్చలు జరిపినట్లు సమాచారం. టెలినార్ ఇండియాకు 7 సర్కిళ్లలో 4జీ స్పెక్ట్రం ఉంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర తదితర 6 సర్కిల్స్‌లో కంపెనీ 2జీ సేవలు అందిస్తోంది. స్పెక్ట్రం వేలం చెల్లింపులకు సంబంధించి టెలినార్ ఇండియా .. ప్రభుత్వానికి రూ.1900 కోట్ల దాకా, రుణం రూపంలో ఆర్థిక సంస్థలకు రూ. 1,800 కోట్లు బకాయిపడింది. కంపెనీకి దాదాపు 5.3 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. -
టెలినార్ అపరిమిత కాల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ టెలినార్ అన్ లిమిటెడ్ వాయిస్, ఇంటర్నెట్ ప్లాన్స్‌ను 28 రోజుల కాల పరిమితితో ప్రకటించింది. రూ.249 వోచర్‌తో అపరిమితంగా లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే 1 జీబీ 4జీ, అన్లిమిటెడ్ 2జీ డేటా పొందవచ్చు. రూ.74 వోచర్‌తో టెలినార్ నుంచి టెలినార్‌కు దేశవ్యాప్తంగా అపరిమితంగా కాల్స్ చేయొచ్చు. దీనితోపాటు 1 జీబీ 4జీ/2జీ డేటా కూడా ఉచితమని కంపెనీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ ఈ సందర్భంగా తెలిపారు. టాటా డొకొమో సైతం..: మరో టెలికం కంపెనీ టాటా డొకొమో మూడు ప్లాన్స్‌ను ఆఫర్ చేస్తోంది. రూ.246 ప్యాక్‌తో దేశవ్యాప్తంగా అన్ని కాల్స్ ఉచితం. 2 జీబీ డేటా దీనికి అదనం. కాల పరిమితి 28 రోజులు. 14 రోజుల వాలిడిటీ గల రూ.148 ప్యాక్‌తో అన్ని కాల్స్ ఫ్రీ. అలాగే 1 జీబీ డేటా ఉచితం. రూ.103 ప్లాన్‌తో దేశవ్యాప్తంగా డొకొమో నుంచి డొకొమో కు అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. 500 ఎంబీ డేటా ఉచితం. 28 రోజుల కాల పరిమితి ఉంది. -
టెలినార్‌ను కొంటున్నది ఎవరు?
న్యూఢిల్లీ : చౌకైన ఆఫర్లతో తక్కువ కాలంలోనే ఎక్కువమంది టెలికాం ఖాతాదారులను ఆకర్షించుకునేందుకు భారత్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన టెలినార్ ప్రస్తుతం పూర్తిగా అయోమయంలో పడిపోయింది. భారత్ యూనిట్లో తమకొచ్చే నష్టాలు తట్టుకోలేక, ఇక ఇక్కడ తమ వ్యాపారాలు కొనసాగించలేక, ఎలాగైనే భారత్ బిజినెస్‌ల నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. దీనికోసం మూడో టెలికాం దిగ్గజగా ఉన్న ఐడియా సెల్యులార్తో చర్చలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. తమ భారత్ యూనిట్‌ను నగదు రహితంగా ఐడియా సెల్యులార్కు విక్రయించేందుకు చర్చలు ప్రారంభించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఈ డీల్ ఓకే అయితే దేశంలో మూడో అతిపెద్ద టెలికాం దిగ్గజంగా ఉన్న ఐడియా చేతికి నార్వేకు చెందిన ఈ టెలికాం ఆపరేటర్ స్థానిక వ్యాపారాలన్నీ దక్కనున్నాయని సమాచారం.. ఎలాంటి వాస్తవ చెల్లింపులు లేకుండా టెలినార్ రుణాలను, ఆస్తులను మార్పిడి చేసుకునేలా ఈ రెండు కంపెనీలు చర్చలు జరుపుతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ చర్చలు సఫలీకృతం కాకపోవచ్చని కంపెనీకి సంబంధించిన మరో వ్యక్తి చెప్పారు. మరో రూ.36,000కోట్లను తన రుణభారంగా మార్చుకునేందుకు ఐడియా సెల్యులార్ సిద్ధంగా లేదని పేర్కొన్నారు. ఇప్పటికే అక్టోబర్ ఆక్షన్‌లో స్పెక్ట్రమ్ కొనుగోలుకు అదనంగా రూ.13,000 కోట్లను ఐడియా సెల్యులార్ వెచ్చించిన సంగతి తెలిసిందే. టెలినార్ ఇండియాకు ఇప్పటికే రూ.1,900 కోట్లను స్పెక్ట్రమ్ చెల్లింపులుగా కేంద్రానికి చెల్లించాల్సి ఉంది. అంతేకాక ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్స్కు రూ.1,800 కోట్లు బాకీ పడి ఉంది. అయితే ఇటు టెలినార్, ఐడియా సెల్యులార్ రెండు కూడా ఈ విషయంపై స్పందించడం లేదు. ఒకవేళ ఐడియా చేతికి టెలినార్ దక్కితే కొన్ని కీలక సర్కిళ్లలో 1800 ఎంహెచ్‌జడ్ బ్యాండ్‌లో 4జీ స్పెక్ట్రమ్ ఈ కంపెనీకి ప్రయోజనంగా మారనుంది. మరోవైపు టెలినార్ కంపెనీ తన ఇండియా బిజినెస్‌ల నుంచి వైదొలగుతుందని ఓ సీనియర్ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్ కూడా చెప్పారు. -
టెలినార్ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొన కూడదని ప్రముఖ టెలికాం సంస్థ టెలినార్ నిర్ణయించింది. త్వరలో జరగబోయే ఈ వేలంలో పాల్గొనడం లేదని ఒక ప్రకనటలో వెల్లడించింది. ప్రస్తుత ప్రతిపాదిత స్పెక్ట్రం ధరలు తమకు ఆమోదయోగ్య లేవని, వేలం కోసం ప్రతిపాదించిన కనీస ధరలు అధికంగా ఉండటమే ఇందుకు కారణమని టెలినార్ గ్రూప్ సీఈవో సిగ్వే బ్రెక్కి తెలిపారు. సంస్థ ఆర్థిక ఫలితాల వెల్లడించిన సందర్భంగా ఆయన ఈ వివరణ ఇచ్చారు. భారతదేశంలో ప్రస్తుతం ఏడు సెక్టార్స్‌లో 1800 ఎంహెచ్ జెడ్ బ్యాండ్ లో 4జీ ప్రసారాలు ఉన్నా, వాటిలో ఆరు రాష్ట్రాల్లో 2 జి సేవలను అందిస్తున్నామని తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ , బీహార్, గుజరాత్, మహారాష్ట్రలో2 జీ సేవలు అందిస్తుండగా అస్సాంలో ఇంకా ప్రారంభించలేకపోయామని అందుకే ఈ స్పెక్ట్రం వేలం పాల్గొనబోమని టెలినార్ స్పష్టం చేసింది. దేశీయ వ్యాపారాలకు ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నామని టెలినార్ తెలిపింది. దేశీయంగా ఇతర టెలికాం సంస్థలతో పోటీ పడుతూ, దీర్ఘకాలం కొనసాగాలంటే మరింత స్పెక్ట్రమ్ కావాలి. అయితే అయితే దేశీయ టెలికాం రంగం నుంచి ఇప్పుడే తప్పుకోవడం లేదని, తక్కువ నష్టంతో బయట పడేందుకు కొంతకాలం సేవలు కొనసాగిస్తామన్నారు. త్వరలో జరగబోయే స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నామని సంస్థ ప్రకటించింది. కాగా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో టెలినార్ ఇండియా రూ.105 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.71.3 కోట్లు. ఆదాయం మాత్రం రూ.1,080 కోట్ల నుంచి రూ.1230 కోట్లకు పెరిగింది. మరోవైపు టెలినార్ తో విలీనం చర్చలను వోడా ఫోన్ మరింత వేగవంతం చేసింది. -
టెలినార్పై వొడాఫోన్ కన్ను..
♦ కొనుగోలుకు ఆసక్తికరంగా ఉందంటూ వార్తలు ♦ స్వీడన్ మార్కెట్లో టెలినార్ షేరు జోరు స్టాక్‌హోమ్ : దేశీయ టెలికాం పరిశ్రమలో మరోసారి స్థిరీకరణ జరగనుందా...? మరో విలీన ప్రక్రియకు తెరలేవనుందా...? ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో ఇవే సందేహాలు. నార్వేకు చెందిన టెలినార్ ఇండియా వ్యాపారాన్ని హస్తగతం చేసుకునేందుకు వొడాఫోన్ పావులు కదుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. టెలినార్‌ను కొనుగోలు చేసేందుకు వొడాఫోన్ ఆసక్తికరంగా ఉందన్న వార్తల నేపథ్యంలో... స్వీడన్ స్టాక్ మార్కెట్లో టెలినార్ షేర్ ధర బుధవారం 2.3శాతం ఎగసింది. స్పెక్ట్రమ్ ధర భారీగా ఉందని, కొనుగోలు చేయని పరిస్థితులే ఉంటే భారత్ మార్కెట్ నుంచి తప్పుకోవడం తప్ప వేరే మార్గం లేదని ఇటీవల టెలినార్ అసహనం వ్యక్తం చేయడం కూడా తాజా వార్తలకు బలం చేకూరుతోంది. భారత్‌లో దీర్ఘకాలం కొనసాగడం అనేది వృద్ధి చెందుతున్న డేటా మార్కెట్లో పోటీ పడేందుకు మరింత స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకోవడంపైనే ఆధారపడి ఉందని టెలినార్ సీఈవో సిగ్వే బ్రెక్కే ఏప్రిల్‌లో ప్రకటించారు. ఆచరణాత్మక విధానంలో తగిన అవకాశాలను పరిశీలిస్తామన్నారు. కాగా, రష్యాకు చెందిన సిస్టెమా శ్యామ్‌ను రిలయన్స్ అడాగ్ గ్రూప్ ఇప్పటికే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌కు చెందిన వొడాఫోన్ సైతం హచిసన్ ఎస్సార్ సంస్థను కొనుగోలు చేయడం ద్వారా భారత టెలికాం మార్కెట్ అవకాశాలను చేజిక్కించుకున్న విషయం కూడా విదితమే. తాజా పరిణామాలపై టెలినార్ షేరు కొనుగోలుకు సిఫారసు చేసిన డీఎన్బీ ఏఎస్ఏ అనలిస్ట్ క్రిస్టర్ రోథ్ స్పందిస్తూ... ‘గత కొన్నేళ్లుగా టెలినార్ పనితీరు అంచనాలకు అనుగుణంగా లేదు. ఎన్నో కారణాల రీత్యా భారత్‌లో మరింత పెట్టుబడి పెట్టడం కంటే వీలైనంత సత్వరమే అక్కడి నుంచి వైదొలగడం తెలివైన పని అనిపించుకుం టుంది’ అని వ్యాఖ్యానించారు. టెలినార్‌కు 5 శాతం వాటా ట్రాయ్ ఏప్రిల్ నెల గణాంకాల ప్రకారం టెలినార్‌కు దేశీయ మార్కెట్లో 5.2 కోట్ల మంది (5 శాతం) చందాదారులు ఉన్నారు. వొడాఫోన్ 19.8 కోట్ల మంది (19శాతం) చందాదారులను కలిగి ఉంది. 2008లో భారత మార్కెట్లోకి టెలినార్ ప్రవేశించింది. యూనిటెక్ సంస్థతో కలసి యూనినార్గా కార్యకలాపాలు మొదలుపెట్టిన ఆ సంస్థ... తర్వాత కాలంలో యూనిటెక్ నుంచి వాటాలను పూర్తిగా కొనుగోలు చేసి టెలినార్‌గా పేరు మార్చుకుంది. అయితే, వాయిస్ ఆదాయం తగ్గడం, డేటా ఆదాయం విభాగంలో పోటీ తీవ్రతరం కావడం, అందుకు తగినంత స్పెక్ట్రమ్ కొనుగోలు చేసేందుకు టెలినార్‌కు భారీగా పెట్టుబడులు అవసరం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో టెలినార్ భారత్ మార్కెట్ నుంచి వైదొలిగే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. -
బ్యాలెన్స్ అయిపోతే రూ.5 లోన్: టెలినార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ టెలినార్ తత్కాల్ క్రెడిట్ పేరుతో కొత్త రిచార్జ్ ప్యాక్‌ను ప్రకటించింది. ఫోన్ బ్యాలెన్స్ రూ.1.50 లోపుకు చేరితే రూ.5 లోన్ పొందవచ్చు. ఈ మొత్తంతో 10 నిముషాల లోకల్/ఎస్టీడీ కాల్స్ లేదా 20 ఎంబీ డేటా వాడుకోవచ్చు. బ్యాలెన్స్ తగ్గిన సమయంలో మొబైల్ తెరపై ఫ్లాష్ మెసేజ్ వస్తుంది. తత్కాల్ క్రెడిట్ కావాల్సిన కస్టమర్ స్టార్141హాష్ టైప్ చేయాలి. లోన్ తీసుకున్నందుకుగాను తదుపరి రిచార్జ్ నుంచి రూ.5తోపాటు లావాదేవీ రుసుము కింద రూ.1 తగ్గిస్తారు. రోజులో ఎన్నిసార్లయినా లోన్ తీసుకోవచ్చని టెలినార్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. -
భారత్‌కు గుడ్‌బై చెప్తాం!
♦ టెలినార్ సంకేతాలు... ♦ అధిక స్పెక్ట్రం రేట్లే కారణం... ♦ రూ.2,530 కోట్ల నిర్వహణ ♦ నష్టాల్లో ఉన్నామని వెల్లడి ♦ విశాఖపట్నంలో 4జీ సేవలు షురూ వైజాగ్/ఓస్లో: తక్కువ ధరలకు స్పెక్ట్రం గనుక లభిం చకపోతే తాము భారత్ కార్యకలాపాలకు గుడ్‌బై చెప్పకతప్పదని నార్వే టెలికం దిగ్గజం టెలినార్ సంకేతాలిచ్చింది. భారత్‌లో టెలికం వ్యాపారానికి సంబంధించి తాము దాదాపు రూ.2,350 కోట్ల(310 కోట్ల నార్వేజియన్ క్రోన్స్) నిర్వహణపరమైన నష్టాల్లో కూరుకుపోయామని పేర్కొంది. నార్వేలో కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సందర్భంగా టెలినార్ గ్లోబల్ సీఈఓ సెగ్వీ బ్రెకీ మాట్లాడుతూ ఈ అంశాలను ప్రస్తావించారు. ‘భారత్‌లో దీర్ఘకాలంపాటు మేం కొనసాగుతామా లేదా అనేది అదనపు స్పెక్ట్రం కొనుగోళ్లపై ఆధారపడి ఉంటుంది. పెరుగుతున్న డేటా మార్కెట్‌కు అనుగుణంగా ఇప్పుడు మాకున్న స్పెక్ట్రంతో ప్రత్యర్థి కంపెనీలతో పోటీపడలేకపోతున్నాం. అందుకే మరింత స్పెక్ట్రంను కొనుగోలు చేయడంపై దృష్టిసారిస్తున్నాం. అయితే, ధర మాకు సమ్మతంగా ఉండాలి. రానున్న స్పెక్ట్రం వేలంలో పాల్గొనడంతోపాటు ఇతర కంపెనీల నుంచి కొనుగోలు చేసే ప్రణాళికలు కూడా ఉన్నాయి’ అని బ్రెకీ వ్యాఖ్యానించారు. భారత్‌లో లాభదాయకమైన వ్యాపారం చేయడానికే వచ్చామని, అనుకున్నట్లు రాబడులు లేకపోతే ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాల్సి వస్తుందని టెలినార్ సీఎఫ్ఓ మార్టెన్ కార్ల్సన్ సార్బీ పేర్కొన్నారు. ప్రస్తుత 2016 జనవరి-మార్చి క్వార్టర్లో టెలినార్ ఇండియా ఆపరేటింగ్ నష్టాలు 310 కోట్ల నార్వేజియన్ క్రోన్స్(ఎన్‌ఓకే)కు ఎగబాకాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో నష్టాలు 15.9 కోట్ల ఎన్‌ఓకే మాత్రమే. ఆదాయం మాత్రం 11% వృద్ధితో 130.6 కోట్ల ఎన్ఓకేలకు చేరినట్లు టెలినార్ తెలిపింది. 4జీ సేవల విస్తరణ... అయితే, టెలినార్ ఇండియా మాత్రం 4జీ సేవలను విస్తరణపై దృష్టిపెట్టింది. టెలినార్ ఇండియా కమ్యూనికేషన్స్ సీఈఓ శరద్ మెహరోత్రా బుధవారం విశాఖపట్నంలో 4జీ సర్వీసులను ప్రారంభించారు. కం పెనీ ఇప్పటికే వారణాసిలో ఈ సేవలను ఆరంభిం చింది. కాగా, వచ్చే 45-60 రోజుల్లో మరో 6-8 నగరాల్లో 4జీని ప్రవేశపెట్టనుంది. మాస్ మార్కెట్లో తమ కు మంచి పట్టుందని.. అత్యంత చౌక టారిఫ్‌లతో సర్వీసులను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామని మెహరోత్రా ఈ సందర్భంగా పేర్కొన్నారు. సేవలు ఆరు సర్కిళ్లలోనే... దేశవ్యాప్తంగా 22 టెలికం సర్కిళ్లు ఉండగా... ఆరు సర్కిళ్లలో(ఆంధ్రప్రదేశ్-తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ ఈస్ట్, ఉత్తర ప్రదేశ్ వెస్ట్, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర) మాత్రమే టెలినార్ ఇండియా కార్యకలాపాలు ఉన్నాయి. ఫిబ్రవరి చివరినాటికి కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 5.16 కోట్లుగా నమోదైంది. వాయిస్ సేవల వినియోగం తగ్గడంతో కంపెనీకి ఒక్కో కస్టమర్ నుంచి సగటు నెలవారీ ఆదాయం(ఏఆర్పీయూ) 8 శాతం మేర తగ్గి.. రూ.90కి దిగజారింది. కాగా, రానున్న స్పెక్ట్రం వేలానికి సంబంధించి 700 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం ధరను ఒక్కో మెగాహెర్ట్జ్‌కు రూ.11,485గా ట్రాయ్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అన్ని బ్యాండ్‌విడ్త్‌లోనూ చూస్తే ఇదే అత్యధిక వేలం రేటుగా నిలవనుంది. -
ఈ నెల 27 నుంచి టెలినార్ 4జీ సేవలు
♦ తొలుత వైజాగ్‌లో అందుబాటులోకి ♦ ఆగస్టు కల్లా భాగ్యనగరంలో హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ టెలినార్ సబ్సే సస్తా 4జీ సేవలకు రెడీ అయింది. ఈ నెల 27న వైజాగ్ వేదికగా సర్వీసులను ఆవిష్కరిస్తోంది. వారణాసిలో జరిపిన ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతం కావడంతో ఇప్పుడు సర్కిళ్ల వారీగా సేవలను విస్తరించేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో తొలుత వైజాగ్‌ను ఎంచుకుంది. 4జీ కోసం లీన్ జీఎస్ఎం టెక్నాలజీని కంపెనీ వినియోగిస్తోంది. ఇందుకోసం హువావేకు రూ.1,240 కోట్ల కాంట్రాక్టును అప్పగించిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టులో భాగంగా 25,000 టవర్లను కొత్త టెక్నాలజీతో ఆధునికీకరిస్తోంది. టెలినార్ సేవలందిస్తున్న ఆరు సర్కిళ్లలో ఈ ప్రక్రియ 55% పూర్తి అయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిళ్ళలో 60 శాతం పూర్తయింది. డిసెంబరులోగా 50 నగరాలు.. ఈ ఏడాది డిసెంబరులోగా కనీసం 50 నగరాల్లో 4జీని పరిచయం చేయాలని టెలినార్ కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుతం 30 నగరాల్లో లీన్ జీఎస్ఎం టెక్నాలజీని కంపెనీ పరీక్షిస్తోంది. 4జీని ఆఫర్ చేయాలని అనుకున్న నగరంలో నెట్వర్క్ పూర్తిగా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. అయితే హైదరాబాద్‌లో జూలై తర్వాతే సేవలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ, ఏపీ సర్కిళ్ళలో 3,350 టవర్లకుగాను 2,000లకుపైగా టవర్ల ఆధునీకరణ పూర్తి అయింది. ఇక డేటా చార్జీలను కంపెనీ సవరిస్తోంది. ఇతర టెల్కోల టారిఫ్ కంటే ఇవి చవకగా ఉంటాయని కంపెనీ స్పష్టం చేస్తోంది. -
'సబ్ సే సస్తా' ఇక అందదా..?
న్యూఢిల్లీ: సబ్ సే సస్తా(చాలా చీప్) పేరుతో భారత మార్కెట్లోకి ప్రవేశించిన టెలినార్.. టెలికాం బిజినెస్ నుంచి వైదొలిగేందుకు సిద్ధమౌతోంది. కేవలం 2జీ సర్వీసులకే పరిమితమైన టెలినార్ మార్కెట్లో పోటీని తట్టుకోలేకపోతోంది. ఐడియా సెల్యులార్, వొడాఫోన్ వంటి సంస్థలు 3జీ సర్వీసులు అందిస్తుండగా, రిలయన్స్ జియో కొత్తగా 4జీ సర్వీసులను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ మార్కెట్ పోటీని తట్టుకోలేని టెలినార్ భారత టెలికాం బిజినెస్ నుంచి వైదొలగడమే మంచిదని భావిస్తోంది. నార్వే దేశానికి చెందిన ఈ కంపెనీ 2009లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఏడు సర్కిల్స్ లో స్పెక్ట్రమ్ కల్గి ఉన్న టెలినార్, ఆరు ప్రాంతాల నుంచి 1800 ఎమ్ హెచ్ జడ్ బ్యాండ్ తో సర్వీసులు అందిస్తోంది. రూ.11 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు భారత్ లో టెలినార్ కు బిజినెస్ ఉంది. 2008-09లో దాదాపు రూ.20 వేల కోట్లను భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన టెలినార్, ప్రతి ఏడాది చివరి క్వార్టర్ లో చేదు అనుభవాలనే ఎదుర్కొంటూ వస్తోంది. 2జీ స్పెక్ట్రమ్ స్కామ్ ఫలితంగా 2012లో భారత్ లో లైసెన్సు లన్నింటినీ కోల్పోయింది. దీనిపై కంపెనీ పోరాడినప్పటికీ మరింత ముందుకు పోవడానికి సాహసించలేదు. పోటీదారుడి ఒత్తిడి, నెట్ వర్క్ ఆధునీకరణపై అధిక పెట్టుబడులు టెలినార్ తట్టుకోలేక.. భారత్ మార్కెట్లో నిలదొక్కుకోవడం కష్టంగా భావిస్తోంది. భారత మార్కెట్ ను ఆకట్టుకోవాలంటే ఎక్కువగా ఆక్షన్ ట్రేడింగ్ పై ఎక్కువగా దృష్టిసారించాల్సి ఉంది. కానీ ఈ విషయంలో టెలినార్ విజయవంతమౌతుందనడంలో సందేహం నెలకొంది. 3జీ, 4జీ స్పెక్ట్రమ్ కొనుగోలులో టెలినార్ ఆసక్తి చూపకపోవడం, 2జీ సేవలకే పరిమితమవ్వడం వల్ల మార్కెట్ లో తక్కువ రాబడి షేరుగా టెలినార్ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. టెలినార్ కు వినియోగదారులు పడిపోవడానికి కారణం కూడా సరియైన డేటా సేవలు అందించకపోవడమేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
డేటా ప్యాక్ @ రూ.2
టెలికం రంగంలో టెలినార్ సంచలనం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పల్లెలో అయినా సరే చాయ్ తాగాలంటే కనీసం రూ.5 వెచ్చించాలి. కానీ అంత కంటే తక్కువ ధరకే డేటా ప్యాక్‌ను ఊహించగలమా? టెలికం రంగంలో సంచలనానికి తెరలేపుతూ టెలినార్ ఫుల్ పైసా వసూల్ పేరుతో రూ.2లకే డేటా వోచర్‌ను ఆఫర్ చేస్తోంది. ఇందులో భాగంగా ఒక రాత్రి కాల పరిమితితో 50 ఎంబీ డేటాను అందిస్తోంది. ఇంత తక్కువ ధరలో డేటా ప్యాక్‌ను అందుబాటులోకి తేవడం భారత్‌లో ఇదే తొలిసారి అని కంపెనీ వెల్లడించింది. దీనితోపాటు రూ.5 మొదలుకుని రూ.146 వరకు నూతన డేటా ప్యాక్స్‌ను 30 ఎంబీ - 2 జీబీ ప్రయోజనాలతో ప్రకటించింది. కొత్త కస్టమర్లకు 200 ఎంబీ డేటా ఉచితంగా ఇస్తోంది. అందుబాటు ధరలో వినూత్న ప్యాక్‌లతో వినియోగదార్ల ప్రాధాన్య ఆపరేటర్‌గా నిలవాలన్నది తమ లక్ష్యమని టెలినార్ ఏపీ, తెలంగాణ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ ఈ సందర్భంగా తెలిపారు.