భారత్కు గుడ్బై చెప్తాం!
♦ టెలినార్ సంకేతాలు...
♦ అధిక స్పెక్ట్రం రేట్లే కారణం...
♦ రూ.2,530 కోట్ల నిర్వహణ
♦ నష్టాల్లో ఉన్నామని వెల్లడి
♦ విశాఖపట్నంలో 4జీ సేవలు షురూ
వైజాగ్/ఓస్లో: తక్కువ ధరలకు స్పెక్ట్రం గనుక లభిం చకపోతే తాము భారత్ కార్యకలాపాలకు గుడ్‌బై చెప్పకతప్పదని నార్వే టెలికం దిగ్గజం టెలినార్ సంకేతాలిచ్చింది. భారత్‌లో టెలికం వ్యాపారానికి సంబంధించి తాము దాదాపు రూ.2,350 కోట్ల(310 కోట్ల నార్వేజియన్ క్రోన్స్) నిర్వహణపరమైన నష్టాల్లో కూరుకుపోయామని పేర్కొంది. నార్వేలో కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సందర్భంగా టెలినార్ గ్లోబల్ సీఈఓ సెగ్వీ బ్రెకీ మాట్లాడుతూ ఈ అంశాలను ప్రస్తావించారు. ‘భారత్‌లో దీర్ఘకాలంపాటు మేం కొనసాగుతామా లేదా అనేది అదనపు స్పెక్ట్రం కొనుగోళ్లపై ఆధారపడి ఉంటుంది. పెరుగుతున్న డేటా మార్కెట్‌కు అనుగుణంగా ఇప్పుడు మాకున్న స్పెక్ట్రంతో ప్రత్యర్థి కంపెనీలతో పోటీపడలేకపోతున్నాం. అందుకే మరింత స్పెక్ట్రంను కొనుగోలు చేయడంపై దృష్టిసారిస్తున్నాం. అయితే, ధర మాకు సమ్మతంగా ఉండాలి. రానున్న స్పెక్ట్రం వేలంలో పాల్గొనడంతోపాటు ఇతర కంపెనీల నుంచి కొనుగోలు చేసే ప్రణాళికలు కూడా ఉన్నాయి’ అని బ్రెకీ వ్యాఖ్యానించారు. భారత్‌లో లాభదాయకమైన వ్యాపారం చేయడానికే వచ్చామని, అనుకున్నట్లు రాబడులు లేకపోతే ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాల్సి వస్తుందని టెలినార్ సీఎఫ్‌ఓ మార్టెన్ కార్ల్‌సన్ సార్బీ పేర్కొన్నారు. ప్రస్తుత 2016 జనవరి-మార్చి క్వార్టర్‌లో టెలినార్ ఇండియా ఆపరేటింగ్ నష్టాలు 310 కోట్ల నార్వేజియన్ క్రోన్స్(ఎన్‌ఓకే)కు ఎగబాకాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో నష్టాలు 15.9 కోట్ల ఎన్‌ఓకే మాత్రమే. ఆదాయం మాత్రం 11% వృద్ధితో 130.6 కోట్ల ఎన్‌ఓకేలకు చేరినట్లు టెలినార్ తెలిపింది.
4జీ సేవల విస్తరణ...
అయితే, టెలినార్ ఇండియా మాత్రం 4జీ సేవలను విస్తరణపై దృష్టిపెట్టింది. టెలినార్ ఇండియా కమ్యూనికేషన్స్ సీఈఓ శరద్ మెహరోత్రా బుధవారం విశాఖపట్నంలో 4జీ సర్వీసులను ప్రారంభించారు. కం పెనీ ఇప్పటికే వారణాసిలో ఈ సేవలను ఆరంభిం చింది. కాగా, వచ్చే 45-60 రోజుల్లో మరో 6-8 నగరాల్లో 4జీని ప్రవేశపెట్టనుంది. మాస్ మార్కెట్లో తమ కు మంచి పట్టుందని.. అత్యంత చౌక టారిఫ్‌లతో సర్వీసులను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామని మెహరోత్రా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
సేవలు ఆరు సర్కిళ్లలోనే...
దేశవ్యాప్తంగా 22 టెలికం సర్కిళ్లు ఉండగా... ఆరు సర్కిళ్లలో(ఆంధ్రప్రదేశ్-తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ ఈస్ట్, ఉత్తర ప్రదేశ్ వెస్ట్, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర) మాత్రమే టెలినార్ ఇండియా కార్యకలాపాలు ఉన్నాయి. ఫిబ్రవరి చివరినాటికి కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 5.16 కోట్లుగా నమోదైంది. వాయిస్ సేవల వినియోగం తగ్గడంతో కంపెనీకి ఒక్కో కస్టమర్ నుంచి సగటు నెలవారీ ఆదాయం(ఏఆర్‌పీయూ) 8 శాతం మేర తగ్గి.. రూ.90కి దిగజారింది. కాగా, రానున్న స్పెక్ట్రం వేలానికి సంబంధించి 700 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం ధరను ఒక్కో మెగాహెర్ట్జ్‌కు రూ.11,485గా ట్రాయ్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అన్ని బ్యాండ్‌విడ్త్‌లోనూ చూస్తే ఇదే అత్యధిక వేలం రేటుగా నిలవనుంది.