ఈ నెల 27 నుంచి టెలినార్ 4జీ సేవలు
♦ తొలుత వైజాగ్‌లో అందుబాటులోకి
♦ ఆగస్టు కల్లా భాగ్యనగరంలో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ టెలినార్ సబ్సే సస్తా 4జీ సేవలకు రెడీ అయింది. ఈ నెల 27న వైజాగ్ వేదికగా సర్వీసులను ఆవిష్కరిస్తోంది. వారణాసిలో జరిపిన ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతం కావడంతో ఇప్పుడు సర్కిళ్ల వారీగా సేవలను విస్తరించేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో తొలుత వైజాగ్‌ను ఎంచుకుంది. 4జీ కోసం లీన్ జీఎస్‌ఎం టెక్నాలజీని కంపెనీ వినియోగిస్తోంది. ఇందుకోసం హువావేకు రూ.1,240 కోట్ల కాంట్రాక్టును అప్పగించిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టులో భాగంగా 25,000 టవర్లను కొత్త టెక్నాలజీతో ఆధునికీకరిస్తోంది. టెలినార్ సేవలందిస్తున్న ఆరు సర్కిళ్లలో ఈ ప్రక్రియ 55% పూర్తి అయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిళ్ళలో 60 శాతం పూర్తయింది.
డిసెంబరులోగా 50 నగరాలు..
ఈ ఏడాది డిసెంబరులోగా కనీసం 50 నగరాల్లో 4జీని పరిచయం చేయాలని టెలినార్ కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుతం 30 నగరాల్లో లీన్ జీఎస్‌ఎం టెక్నాలజీని కంపెనీ పరీక్షిస్తోంది. 4జీని ఆఫర్ చేయాలని అనుకున్న నగరంలో నెట్‌వర్క్ పూర్తిగా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. అయితే హైదరాబాద్‌లో జూలై తర్వాతే సేవలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ, ఏపీ సర్కిళ్ళలో 3,350 టవర్లకుగాను 2,000లకుపైగా టవర్ల ఆధునీకరణ పూర్తి అయింది. ఇక డేటా చార్జీలను కంపెనీ సవరిస్తోంది. ఇతర టెల్కోల టారిఫ్ కంటే ఇవి చవకగా ఉంటాయని కంపెనీ స్పష్టం చేస్తోంది.