ఇక టెలినార్ సబ్సే సస్తా 4జీ! | Will launch 4G services in 5-8 circles within 6 months: Telenor | Sakshi
Sakshi News home page

ఇక టెలినార్ సబ్సే సస్తా 4జీ!

Published Wed, Feb 24 2016 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM

ఇక టెలినార్ సబ్సే సస్తా 4జీ!

ఇక టెలినార్ సబ్సే సస్తా 4జీ!

ఏప్రిల్-జూన్ మధ్య ఏపీ, తెలంగాణలో సేవలు..
వారణాసిలో  ప్రయోగాత్మకంగా ఆరంభం

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ టెలికం రంగంలో 4జీ వార్‌కు టెలినార్ రెడీ అయింది. ‘సబ్ సే సస్తా’ అంటూ అందరికన్నా తక్కువకే టెలికం సర్వీసులు అందిస్తామని చెప్పే టెలినార్... 4జీలోనూ ఆ ఒరవడి కొనసాగిస్తానని చెబుతుండటమే అసలు విశేషం. ఇదే జరిగితే కస్టమర్లు చవగ్గా వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందుకునే అవకాశముంది. 2009 డిసెంబర్లో 2జీ సేవలతో ప్రస్థానాన్ని ప్రారంభించిన టెలినార్‌కు (గతంలో యునినార్) దేశవ్యాప్తంగా ఆరు సర్కిళ్లలో 5 కోట్లకుపైగా చందాదారులున్నారు. వీరిలో 23 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. 2017 కల్లా ఈ సంఖ్యను 50 శాతానికి చేర్చాలన్నది సంస్థ లక్ష్యం.

 తెలుగు రాష్ట్రాల్లో త్వరలో..
టెలినార్ ఫిబ్రవరి 9న వారణాసిలో ప్రయోగాత్మకంగా 4జీ సేవలను ఆరంభించింది. తక్కువ స్పెక్ట్రమ్‌పై వేగవంతమైన మొబైల్ బ్రాడ్ బ్యాండ్‌ను అందించే టెక్నాలజీని ఈ సంస్థ వినియోగిస్తోంది. ఇందులో భాగంగానే వారణాసిలో 1.4 మెగాహెర్ట్జ్‌పై సేవలను ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లో 4జీ సేవలు ఏప్రిల్-జూన్ మధ్య ప్రారంభం కానున్నాయి. వారణాసిలో ప్రయోగాత్మకంగా కొన్నాళ్లు పరీక్షించాక... అక్కడి లోటుపాట్లను సరిచేస్తూ తెలుగు రాష్ట్రాల్లో 4జీ సేవల్ని ప్రారంభించనున్నట్లు టెలినార్ వర్గాలు తెలియజేశాయి. 2017 చివరినాటికి 24,000 టవర్లను నూతన టెక్నాలజీతో సంస్థ అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇందుకోసం హువావేకు రూ.1,300 కోట్ల పనులను అప్పగించింది. ఏపీ సర్కిల్‌లో ఆధునీకరణ 50 శాతానికి పైగా పూర్తయింది కూడా. హువావే అభివృద్ధి చేసిన లీన్ జీఎస్‌ఎం సొల్యూషన్‌తో నెట్‌వర్క్ సామర్థ్యం 30 శాతం దాకా పెరుగుతుంది.

 ఆరు నెలల్లో 5-8 నగరాల్లో..
4జీ సేవలను ఆగస్టుకల్లా 5-8 నగరాల్లో ప్రవేశపెడతామని టెలినార్ సీఈవో సిగ్వే బ్రెకీ చెప్పారు. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. స్పెక్ట్రమ్‌ను పెంచుకునేందుకు మరో టెలికం కంపెనీతో చర్చిస్తున్నట్టు తెలియజేశారు. ‘‘మాకు మరింత స్పెక్ట్రమ్ కావాలి. వాయిస్ కస్టమర్లు లేనట్లయితే ఇప్పటికే పెద్ద ఎత్తున 4జీలో విస్తరించి ఉండేవారం’’ అని బ్రెకీ చెప్పారు. నిబంధనలను అనుసరించి, తదుపరి వేలంలో పాల్గొనాలా? వద్దా? అనేది నిర్ణయించుకుంటామని చెప్పారాయన. స్పెక్ట్రమ్ ధర చాలా ఎక్కువగా ఉందని, రిలయన్స్ జియో ప్రవేశిస్తే 4జీలో పోటీ మరింత పెరుగుతుందని చెప్పారు. అత్యంత పోటీ ఉన్న భారత టెలికం మార్కెట్లో పెద్ద కంపెనీలు సైతం లాభాల కోసం ఇబ్బంది పడుతున్నాయని, జియో రాకతో ఇది మరింత తీవ్రమవుతుందని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement