జియో ఎఫెక్ట్: ఎయిర్టెల్ మరో ఎత్తుగడ
న్యూడిల్లీ: దేశీయ అతి పెద్ద టెలికాం కంపెనీ భారతి ఎయిర్టెల్ భారీ విస్తరణకు సిద్ధమవుతోంది. ఒక పక్క జియో ఎంట్రీతో ఒక మాదిరి సంస్థలు కుదేలవుతోంటే.. ఎయిర్ టెల్ తన మార్కెట్ ను నిలబెట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తమ మార్కెట్ విస్తరణలో భాగంగా సంస్థ తాజాగా మరో కీలక అడుగు వేయనుంది. నార్వే ఆధారిత టెలికం సంస్థ టెలినార్ కు చెందిన భారత వాటాను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సుమారు 350 మిలియన్ డాలర్ల టెలినార్ వాటాను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం టెలినార్‌తో చర్చలు కూడా జరుపుతోంది. సంస్థలోని సగం వాటాను ప్రస్తుతం కొనుగోలు అనంతరం మిగిలిన సగభాగాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. జనవరి చివరికి నాటికి ఇరు సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని నివేదికలు తెలుపున్నాయి.
టెలినార్‌కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5.3 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అయినా తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. స్పెక్ట్రం వేలం చెల్లింపులకు సంబంధించి భారత ప్రభుత్వానికి టెలినార్ రూ.1900 కోట్లు, రుణాల రూపంలో బ్యాంకులకు మరో రూ.1800 కోట్లు బకాయి పడింది. దీంతో ఈ రుణ భారంలో సగం చెల్లించడం ద్వారా దానిని సొంతం చేసుకోవాలని ఎయిర్‌టెల్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.
ప్రత్యర్థుల నుంచి తీవ్రంగా ఎదురవుతున్న పోటీ, డేటా స్పెక్ట్రం ఎక్కువగా లేకపోవడం, భారీ నష్టాల కారణంగా భారత్ మార్కెట్ నుంచి వైదొలగాలని భావిస్తోంది. ఈ మేరకు గతనెలలో టెలినార్ ఇండియా ఐడియాతో చర్చలు జరిపింది. అలాగే 7 సర్కిల్స్ లో 4 జీ సేవలు అందిస్తుండగా ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర తదితర 6 సర్కిల్స్ లో 2 జీ సేవలు అందిస్తోంది. అసోం ఇంకా తన సేవల్ని ప్రారంభించాల్సి ఉంది.