యూనినార్.. ఇక టెలినార్
- బ్రాడింగ్‌కు రూ.100 కోట్ల వ్యయం
- కొనసాగనున్న సబ్సే సస్తా పథకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం సేవల రంగంలో ఉన్న యూనినార్ పేరు మారింది. ఇక నుంచి ‘టెలినార్’ బ్రాండ్ పేరుతో సేవలు అందించనుంది. నార్వేకు చెందిన టెలినార్ గ్రూప్ భారత్‌లో 2009లో యూనినార్‌ను ప్రారంభించింది. టెలివింగ్స్ ఇండియాగా ఉన్న కంపెనీ పేరు సైతం టెలినార్ ఇండియా కమ్యూనికేషన్స్‌గా మార్చారు. బ్రాండింగ్‌కు కంపెనీ దేశవ్యాప్తంగా రూ.100 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోసహా దేశంలో 6 సర్కిళ్లలో కంపెనీ టెలికం సేవలు అందిస్తోంది.
చందాదారుల సంఖ్య పరంగా దేశంలో నాల్గవ అతిపెద్ద ఆపరేటర్‌గా నిలిచింది. విస్తరణలో భాగంగా స్పెక్ట్రం షేరింగ్, స్పెక్ట్రం ట్రేడింగ్‌తోపాటు కంపెనీల కొనుగోళ్లకు సిద్ధమని టెలినార్ ఇండియా సీఈవో వివేక్ సూద్ తెలిపారు. మరింత స్పెక్ట్రం కొనుగోలుకు వేలంలో పాల్గొంటామన్నారు. 3జీ, 4జీ సేవలవైపు త్వరగా మళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 2016 జూన్‌కల్లా ప్రవేశించే అవకాశం ఉందని వెల్లడించారు.
సబ్సే సస్తా కొనసాగుతుంది..
మాస్ మార్కెట్‌ను అమితంగా ఆకట్టుకుంటున్న సబ్సే సస్తా పథకాలు కొనసాగుతాయని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. పేరు మారినప్పటికీ ఇతర ఆపరేటర్ల కంటే తక్కువకే వాయిస్, డేటా ప్యాక్‌లను అందిస్తామన్నారు. ధరల విషయంలో పారదర్శక విధానాన్ని పాటిస్తున్నట్టు చెప్పారు. ‘13 దేశాల్లో టెలినార్ బ్రాండ్ సుపరిచితం. అంతర్జాతీయ గుర్తింపులో భాగంగానే యూనినార్ పేరును టెలి నార్‌గా మార్చాం. టెలినార్ సేవలందిస్తున్న ఆరు సర్కిళ్లలో పరిశ్రమ ఆదా యం వృద్ధి 8-9% మాత్రమే. టెలినార్ 38% వృద్ధి చెందింది. పరిశ్రమ కంటే మూడు రెట్ల వృద్ధి నమోదు చేస్తాం’ అని అన్నారు. 4జీ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అధిక ఫీచర్లతో కూడిన ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏడాదిలో ప్రారంభం అవుతాయన్నారు.
కాల్ డ్రాప్ అయితే..
వినియోగదార్లు ఫోన్ మాట్లాడుతున్న సమయంలో కాల్ కట్ అయితే.. కస్టమర్ ఖాతాలో ఒక నిమిషం టాక్‌టైమ్‌ను కంపెనీ జమ చేస్తోంది. ఎస్టీడీ, ఐఎస్డీ కాల్స్‌కు సైతం ఈ సౌకర్యాన్ని విస్తరించినట్టు శ్రీనాథ్ తెలిపారు. కస్టమర్లు చేసే వ్యయానికి మరింత విలువను జోడిస్తామన్నారు. టెలినార్ కస్టమర్లు హై స్పీడ్ ఇంటర్నెట్‌ను త్వరలో పొందనున్నారు. మార్కెట్‌తో పోలిస్తే తక్కువ ధరకే ఈ సేవలను అందించేందుకు నెట్‌వర్క్‌ను పూర్తిగా నూతన టెక్నాలజీతో కంపెనీ ఆధునీకరిస్తోంది. ఇందుకోసం హువావె టెక్నాలజీస్‌కు రూ.1,300 కోట్లకుపైగా విలువ చేసే కాంట్రాక్టును టెలినార్ అప్పగించింది. ఆరు సర్కిళ్లలో 24,000 సైట్స్‌ను ఆధునీకరిస్తారు. సాఫ్ట్‌వేర్‌ను జోడించడం ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ ఆఫర్ చేసేందుకు ఈ టెక్నాలజీతో వీలవుతుంది.