హైదరాబాద్: టెలినార్ ఇండియా, ఎయిర్‌టెల్ విలీనం టెలినార్ ఉద్యోగులకు శాపంగా మారింది. కొంత మందిని ఇంటికి సాగనంపడానికి ఎయిర్‌టెల్ సిద్ధమౌతోంది. ఈ విషయానికి సంబంధించి భారతీ ఎయిర్‌టెల్ నుంచి టెలినార్ ఉద్యోగులకు ఈ–మెయిల్స్ వెళ్లినట్లు తెలుస్తోంది. విలీనం అనంతరం టెలినార్ ఇండియాలోని ఉద్యోగులందరూ ఎయిర్‌టెల్‌లో సరైన స్థాయి ఉద్యోగాన్ని పొందలేరని ఎయిర్‌టెల్ పేర్కొంది. కాగా టెలికం విభాగం మే 14న భారతీ ఎయిర్‌టెల్, టెలినార్ ఇండియా విలీనానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ‘ఎయిర్‌టెల్ నుంచి నాకు ఒక ఈ–మెయిల్ వచ్చింది. ఎయిర్‌టెల్ హెచ్‌ఆర్ అధికారుల సమావేశానికి హాజరయ్యాను. విలీనం తర్వాత నా ప్రస్తుత హోదాకు వారి సంస్థలో ఖాళీ లేదని చెప్పారు. ఐదు నెలల వేతనాన్ని ఆఫర్ చేసి, ఉద్యోగానికి రాజీనామా చేయాలని కోరారు. ఏం చేయాలో అర్థంకావడం లేదు’ అని ఒక ఉద్యోగి ఆవేదన చెందాడు.
ఎయిర్‌టెల్ ఇంటికి సాగనంపే ఉద్యోగులకు మంచి ఫైనాన్షియల్ ప్యాకేజ్, మెడికల్ ఇన్సూరెన్స్ కొనసాగింపు, ఉచిత కాల్స్ వంటి సౌకర్యాలను ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ‘మేం ఇప్పటికే టెలినార్ ఇండియా నుంచి 700కుపైగా మందిని కొనసాగిస్తున్నాం. వీరి ఎదుగుదలకు ఎయిర్‌టెల్ ఇండియా సహా ఇతర విభాగాల్లో అవకాశాలను కల్పించాం’ అని ఎయిర్‌టెల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే టెలినార్ ఇండియాలో 1,400 మంది ఉద్యోగులు ఉన్నారు. ‘టెలినార్ ఇండియా కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌లో కలిసిపోయిందనే విషయాన్ని మీరు తప్పక తెలుసుకోవాలి. ఈ చట్టబద్ధమైన విలీనం నేపథ్యంలో తదనంతర విషయాలు, తదుపరి చర్యల గురించి మీకు తెలియజేయడానికి మిమల్ని ఎయిర్‌టెల్ బృందంతో సమావేశానికి ఆహ్వానిస్తున్నాం. కింద (మెయిల్‌లో) తెలియజేసిన సమాచారం ప్రకారం సమావేశానికి అందుబాటులో ఉండండి’ అని ఎయిర్‌టెల్.. టెలినార్ ఇండియా ఉద్యోగులకు పంపిన ఈ–మెయిల్స్‌లో పేర్కొంది. టెలినార్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ (తూర్పు, పశ్చిమ),అస్సాం సర్కిళ్లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
టెలినార్ ఉద్యోగుల కష్టాలు
Published Thu, May 17 2018 1:14 AM | Last Updated on Thu, May 17 2018 1:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment