టెలినార్ ఇండియాపై ఎయిర్‌టెల్ కన్ను
డీల్ విలువ 350 మిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: నార్వే టెలికం సంస్థ టెలినార్‌కి భారత్‌లో ఉన్న వ్యాపార కార్యకలాపాలను కొనుగోలు చేయాలని భారతీ ఎయిర్‌టెల్ భావిస్తోంది. ఇందుకు సంబంధించి టెలినార్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ డీల్ విలువ దాదాపు 350 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా. టెలినార్ ఇండియా రుణభారంలో సగం తాము, మిగతాది ఆ కంపెనీ మాతృ సంస్థ భరించేలా ఎయిర్‌టెల్ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. జనవరి ఆఖరు నాటికి ఒప్పందం పూర్తి కావొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
డేటా స్పెక్ట్రం ఎక్కువగా లేకపోవడం, భారీ నష్టాలు, ప్రత్యర్థి సంస్థల నుంచి తీవ్రమైన పోటీ తదితర అంశాల కారణంగా భారత్ మార్కెట్ నుంచి వైదొలగాలని టెలినార్ కొన్నాళ్లుగా యోచిస్తోంది. భారత కార్యకలాపాలను విక్రయించేందుకు ఐడియాతోనూ టెలినార్ చర్చలు జరిపినట్లు సమాచారం. టెలినార్ ఇండియాకు 7 సర్కిళ్లలో 4జీ స్పెక్ట్రం ఉంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర తదితర 6 సర్కిల్స్‌లో కంపెనీ 2జీ సేవలు అందిస్తోంది. స్పెక్ట్రం వేలం చెల్లింపులకు సంబంధించి టెలినార్ ఇండియా .. ప్రభుత్వానికి రూ.1900 కోట్ల దాకా, రుణం రూపంలో ఆర్థిక సంస్థలకు రూ. 1,800 కోట్లు బకాయిపడింది. కంపెనీకి దాదాపు 5.3 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు.