మన దేశంలో టీ అంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండరేమో.. తేనీరులో అనేక రకాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో రుచి అంటే ఇష్టం. ఏదిఏమైనా టీ లేకుండా చాలామందికి రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. అయితే ఒక ప్రేమ జంట విక్రయిస్తున్న టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ప్రేమ జంట తయారు చేసే టీ, వారు ఏర్పాటు చేసిన టీ స్టాల్ ఎంతో ప్రత్యేకంగా ఉంటూ, అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జార్ఖండ్‌లోని రాంచీలో వీరు ఈ వినూత్న టీ దుకాణాన్ని నడుపుతున్నారు. ప్రేమ జంట మనీష్, పుతుల్ కుమారి ఇద్దరూ కలసి ఈ టీ స్టాల్‌ను ప్రారంభించారు. ఓ కంపెనీలో కలుసుకున్న వీరు ఈ రోజు సొంతగా టీ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు.
మనీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను శారదా గ్లోబల్ యూనివర్సిటీ నుంచి బీటెక్ చేశానని, ఆ తర్వాత గోద్రెజ్ టెక్ మహీంద్రాలో పనిచేశానని తెలిపారు. అదే సమయంలో పుతుల్‌ను కలిశానని, తాము ప్రస్తుతం రిలేషన్‌షిప్‌లో ఉన్నామన్నారు. తాము ఏదో ఒక వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని ఈ టీ స్టాల్ ప్రారంభించామన్నారు. ప్రస్తుతం రాంచీలోని తమ స్టాల్ ఎంతో ఆదరణ పొందుతున్నదని, ఇక్కడికి టీ తాగడానికి చాలామంది వస్తుంటారని తెలిపారు.
తమ పాకెట్ మనీతో ఈ స్టాల్ ఓపెన్ చేశామని మనీష్ తెలిపారు. చిన్నగా వ్యాపారం ప్రారంభించి, క్రమంగా దానిని విస్తరించాలనుకున్నామన్నారు. తాము మట్టి కుండలో రకరకాల టీలను అందిస్తామని తెలిపారు.
ప్రస్తుతం తాము రోజూ సాయంత్రం టీ దుకాణం తెరిచి, 500 కప్పుల టీలు విక్రయిస్తున్నామని తెలిపారు. రాంచీలో మరిన్ని టీ స్టాల్స్ తెరవాలనేది తమ కల అని, ఏ పని అయినా ప్రాణం పెట్టి చేస్తే విజయం సాధిస్తామని మనీష్ తెలిపారు. తాము ఐదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నామని, భవిష్యత్తులో ఈ సంబంధాన్ని కొనసాగిస్తామని మనీష్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment