ఎల్లుండే బడ్జెట్: ఫ్లాట్గా ముగిసిన మార్కెట్లు
Published Mon, Jan 30 2017 4:22 PM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM
ఆర్థిక సర్వేతో రేపటి నుంచి కేంద్రప్రభుత్వ బడ్జెట్ సెషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దలాల్స్ట్రీట్ అప్రమత్తంగా వ్యవహరించింది. సోమవారం సెషన్లో సెన్సెక్స్, నిఫ్టీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 32.90 పాయింట్ల నష్టంలో 27,849.56వద్ద, నిఫ్టీ 5.60 పాయింట్ల నష్టంలో 8635.65 వద్ద క్లోజ్ అయ్యాయి. భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, ఏషియన్ పేయింట్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ టాప్ గెయినర్లుగా లాభాలు పండించగా.. టాటా మోటార్స్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, హీరోమోటార్ కార్ప్ నష్టాలు గడించాయి. 2017-18కి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. పెద్ద నోట్లను రద్దుచేసి ఎకానమీకి షాకిచ్చిన కేంద్రప్రభుత్వం వచ్చే ఆర్థికసంవత్సరంలో ఏ మేర వ్యయాలను వెచ్చించనుందోనని దలాల్ స్ట్రీట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
నోట్ల రద్దుతో ప్రపంచంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి ఆర్థికవ్యవస్థల్లో కెల్లా భారత్ కొంతమేర మందగించింది. ఆర్థికవ్యవస్థపై చూపిన ఈ ప్రభావం నుంచి బయటపడేయడానికి ప్రభుత్వం ఆర్థికవ్యవస్థకు ఊతంగా బడ్జెట్ను ప్రవేశపెట్టనుందని పెట్టుబడిదారులు అంచనావేస్తున్నారు. ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్వహిస్తున్న కార్యకలాపాలతో ఆసియన్ షేర్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఇమ్మిగ్రేషన్పై కొరడా ఝుళిపిస్తూ తీసుకున్న ట్రంప్ ఆదేశాలతో దేశీయ ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగించింది. బ్యాంకింగ్, ఆటో, పవర్, రియాల్టీ స్టాక్స్ కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
నిష్టీ బాస్కెట్లో ఐడియా సెల్యులార్ షేర్లు మంచి ప్రదర్శనను కనబర్చాయి. ఐడియాలో వొడాఫోన్ ఇండియాను విలీనం చేసేందుకు చర్చలు సాగుతున్నట్టు బ్రిటీష్ దిగ్గజం ధృవీకరించింది. దీంతో ఐడియా షేర్లు 25 శాతం మేర జంప్ అయ్యాయి. ఇతర టెలికాం స్టాక్స్కు డిమాండ్ నెలకొంది. భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ కమ్యూనికేషన్లు 6, 11 శాతం పెరిగాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 0.11 పైసలు బలపడి 67.95 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 17 రూపాయల లాభంతో 28,370గా నమోదయ్యాయి.
Advertisement