
జియో గురి.. 50% మార్కెట్ వాటా
⇒ 2021కి డేటా మార్కెట్ ఆదాయంలో సగభాగంపై కన్ను
⇒ ప్రైమ్ యూజర్లకు అదనపు డేటా ప్రకటన
న్యూఢిల్లీ: కేవలం ఆరు నెలల్లో యూజర్ల సంఖ్యను పది కోట్లకు పెంచుకున్న రిలయన్స్ జియో తాజాగా ఇప్పుడు టెలికం పరిశ్రమ ఆదాయంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. మొబైల్ డేటా వినియోగం వల్ల ఏర్పడే అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. దీని ద్వారా వచ్చే ఐదేళ్లలో కంపెనీ ఆదాయాన్ని బాగా పెంచుకోవాలని ప్రణాళికలు రూపొందించుకుంటోంది.
సగం వాటాపై ధీమాగా..
2021 నాటికి డేటా మార్కెట్ ఆదాయంలో 50% వాటాను దక్కించుకుంటామని జియో ధీమా వ్యక్తం చేసింది. ‘వాయిస్ విభాగపు ఆదాయం క్రమంగా డేటాకు మారుతోంది. దేశంలోని డేటా మార్కెట్ 2020–21 నాటికి రూ.3 లక్షల కోట్లకు చేరుతుంది’ అని రిలయన్స్ జియో తాజాగా పేర్కొంది. ప్రస్తుతం దేశంలోని మొబైల్ డేటా వినియోగంలో 85% వాటా ను కలిగి ఉన్నామని తెలిపింది. నెట్‌వర్క్ పూర్తిస్థాయిలో సిద్ధమయ్యిందని, 2020–21 నాటికి డేటా డిమాండ్‌లో 60%కి పైగా వాటాను హస్తగతం చేసుకుంటామని పేర్కొంది. డిజిటల్ సర్వీసులపై కనీసం రూ.500 వెచ్చించే సబ్‌స్క్రైబర్ల సంఖ్య 40 కోట్లుగా ఉందని తెలిపింది. భారత్‌లో 5జీ సపోర్ట్ నెట్‌వర్క్ కేవలం తమకు మాత్రమే సొంతమని పేర్కొంది.
వాయిస్ నుంచి డేటాకు..
భారత్‌లో రానున్న కాలంలో డేటాకు బలమైన డిమాండ్ ఉంటుందని జియో అభిప్రాయపడింది. ‘వచ్చే రెండేళ్లలో వాయిస్ నుంచి డేటా విభాగానికి ఆదాయపు బదిలీ జరుగుతుంది. వాయిస్ విభాగపు ఆదాయం రూ.1.5 లక్షల కోట్ల నుంచి రూ.0.5 లక్షల కోట్లకు తగ్గుతుంది. డేటా ఆదాయం రూ.1.3 లక్షల కోట్లకు చేరుతుంది’ అని వివరించింది. పరిశ్రమలో గత ఐదేళ్లలో స్వల్ప వృద్ధి నమోదయ్యిందని, కానీ డేటా వినియోగం వల్ల వచ్చే ఐదేళ్లలో పరిశ్రమలో బలమైన వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. ‘మొత్తంగా పరిశ్రమ ఆదాయం 2020–21 నాటికి రూ.3 లక్షల కోట్లకు చేరుతుంది. నెలకు 500–600 కోట్ల జీబీ డేటా డిమాండ్ ఉంటుందనే అంచనాలున్నాయి. ఇక్కడ ఒక జీబీకి రూ.50లు వేసుకున్నా సంవత్సరానికి రూ.3 నుంచి రూ.3.6 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. ఇది అంచనా జీడీపీలో 1.35–1.6 శాతానికి సమానం’ అని వివరించింది.
ప్రైమ్ యూజర్లకు అదనంగా మరో 5 జీబీ డేటా
జియో మరో శుభవార్త ప్రకటించింది. రూ.303లతో రీచార్జ్ చేసుకునే ప్రైమ్ యూజర్లకు ఇదివరకు ప్రకటించిన విధంగా 28 జీబీ డేటాను కాకుండా అదనంగా మరో 5 జీబీ డేటాను అందిస్తున్నట్లు పేర్కొంది. అదే రూ.499తో రీచార్జ్ చేసుకుంటే 56 జీబీ డేటాతోపాటు 10 జీబీ డేటాను అదనంగా పొందొచ్చని తెలిపింది. ఈ అదనపు డేటా ప్రయోజనాలు కేవలం ఒక నెలకే వర్తిస్తాయని పేర్కొంది. అంటే ఏప్రిల్‌లో మాత్రమే అదనపు డేటా వస్తుంది. కాగా కస్టమర్లు రూ.99ల వన్‌టైమ్ వార్షిక ఫీజుతో జియో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌లో సభ్యులుగా చేరి తర్వాత అందుబాటులో ఉన్న ప్లాన్స్‌లో అనువైన దాన్ని ఎంపిక చేసుకుని కంపెనీ అపరిమిత సేవలను ఏడాదిపాటు నిరంతరాయంగా పొందొచ్చు. అయితే జియో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కేవలం వచ్చే ఏడాది మార్చి 31 వరకు మాత్రమే ఉంటుంది. కాగా జియో ప్రైమ్ ఆఫర్ మాత్రం ఈ నెల 31 వరకు మాత్రమే యూజర్లకు అందుబాటులో ఉంటుంది.