జాగ్రత్త పడకుంటే... డేఠా | The fast-growing mobile data use | Sakshi
Sakshi News home page

జాగ్రత్త పడకుంటే... డేఠా

Published Sun, Oct 11 2015 11:33 PM | Last Updated on Sun, Sep 3 2017 10:47 AM

జాగ్రత్త పడకుంటే... డేఠా

జాగ్రత్త పడకుంటే... డేఠా

* వేగంగా పెరుగుతున్న మొబైల్ డేటా వినియోగం
* సామాజిక మాధ్యమాల్లో వాడకమే అధికం
* ఆటోమేటిగ్గా ఖర్చు చేయించేస్తున్న అదనపు ఫీచర్లు
రాహుల్ హైదరాబాద్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. ఉండేది హాస్టల్లో. ఇంట్లో వాళ్లు అవసరమవుతుంది కదా అని మొబైల్ కొనిచ్చారు. ప్రీపెయిడ్ కార్డు ఇచ్చి... నెలకు కొంత లిమిట్ పెట్టారు. ఆ మేరకే వాళ్లు రీచార్జ్ చేస్తుంటారు.

ఒకవేళ అదనంగా అవసరమై రాహుల్ ఫోన్ చేస్తే... అంతలా ఎవరితో మాట్లాడావని వాళ్ల నాన్న క్లాస్ తీసుకుంటాడు. అందుకే రాహుల్ వాళ్లనెప్పుడూ అదనపు రీచార్జ్ అడగడు. కాకపోతే ఈ మధ్య మొబైల్‌లో డేటా ఎక్కువగా ఖర్చవుతుండటంతో తరచూ రీచార్జ్ అవసరమవుతోంది. అందుకని తనకు బాగా చనువున్న బంధువుల్ని అడగటం మొదలెట్టాడు. వాళ్లేమో రాహుల్ అడిగినపుడల్లా ఎంతో కొంత రీచార్జ్ చేయటం జరుగుతోంది.

కానీ ఇలాంటివి ఎప్పుడో ఒకప్పుడు బయటపడతాయి కదా! రాహుల్ విషయం కూడా వాళ్ల నాన్నకు తెలిసింది. ఎందుకిలా చేస్తున్నావని అడిగాడు.‘‘నేను ఎప్పట్లానే వాడుతున్నాను నాన్నా! కానీ ఈ మధ్య ఎక్కువ ఖర్చయిపోతోంది’’ చెప్పాడు రాహుల్.
 
నిజానికి రాహుల్ ఒక్కడిదే కాదు. ఇంటర్నెట్ కోసం మొబైల్ డేటా వాడుతున్న చాలా మందికి ఇది అనుభవమే. డేటా కోసం తరచూ రీచార్జ్ చేయటం... మళ్లీ అంతలోనే అయిపోవటం... ఇవన్నీ కొత్త విషయాలేమీ కాదు. కాకపోతే ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావంతో ఈ ట్రెండ్ మరింత పెరిగింది. అందుకే... మొబైల్ ఆపరేటర్లు కూడా సంప్రదాయ వాయిస్ ఆధారిత సేవలకన్నా ఇపుడు డేటా ఆధారిత సేవలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. రెవెన్యూ వృద్ధి కూడా వాయిస్‌తో పోలిస్తే డేటా నుంచే ఎక్కువగా ఉండటం మారుతున్న ధోరణికి నిదర్శనం.
 
అంతర్జాతీయ రీసెర్చ్ కన్సల్టెన్సీ టీఎన్‌ఎస్ ఇటీవల ‘కనెక్టెడ్ లైఫ్’ పేరిట అంతర్జాతీయంగా ఓ సర్వే చేసింది. 50 దేశాల్లో 60,500 మందికి పైగా పాల్గొన్న ఈ సర్వేలో... సామాజిక మాధ్యమాల సత్తా ఏంటో బయటపడింది. ఎందుకంటే సర్వేలో పాల్గొన్న వారిలో 55 శాతం మంది ప్రతి రోజూ వాట్సాప్, వియ్‌చాట్ వంటి ఇన్‌స్టాంట్ మెసేజింగ్ సేవలు వాడుతున్నారట. ఇక 30 శాతం మంది ప్రతిరోజూ ఫేస్‌బుక్ చూస్తున్నారట.

ఇక ఇండియాలోనైతే ఒక యూజర్ ద్వారా వస్తున్న డేటా ఆదాయం (పర్ యూజర్) రూ.176గా ఉంది. డేటా ద్వారా వచ్చే రెవెన్యూ ఏడాదికి 33 శాతం చొప్పున వృద్ధి అవుతుండగా... వాయిస్ ద్వారా వచ్చే ఆదాయం 3 శాతం చొప్పున మాత్రమే పెరుగుతుండటం గమనార్హం. ఇవన్నీ చూస్తే... డేటా ఎందుకు ఖర్చవుతోందో అర్థమయిపోతుంది. రాహుల్‌ది కూడా ఇలాంటి పరిస్థితే. ఎందుకంటే తను రోజూ ఫేస్‌బుక్ చూస్తాడు.

ఈ మధ్య ఫేస్‌బుక్‌లో వచ్చే వీడియోలు తన ప్రమేయం లేకుండానే ఆటోమేటిగ్గా ప్లే అయిపోతున్నాయి. పెపైచ్చు తన స్నేహితులు వాట్సాప్‌లో బోలెడన్ని గ్రూప్‌లు క్రియేట్ చేశారు. అన్నిట్లోనూ తనను చేరుస్తున్నారు. వచ్చే వీడియోలు బాగుంటున్నాయి కదా అని రాహుల్ కూడా వాటిని చూసి ఎంజాయ్ చేయటమే కాక... వివిధ గ్రూపులకు షేర్ చేస్తున్నాడు. అందుకే... డేటా మంచినీళ్లలా ఖర్చయిపోతోంది.
 
నిజానికి రాహుల్‌కు తన కాలేజీలో వైఫై ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంది. కాకపోతే అందులో ఫేస్‌బుక్, యూ ట్యూబ్ వంటివి రావు. వాట్సాప్‌లో కూడా ఫొటోలు, టెక్స్ట్ మెసేజ్‌లు వస్తాయి తప్ప వీడియోలు డౌన్‌లోడ్ కావు. ఈ మేరకు కాలేజీ యాజమాన్యం కొన్ని పరిమితులతో కూడిన ఇంటర్నెట్ ఇస్తోంది. కాకపోతే ఈ పరిమితులేవీ నచ్చని రాహుల్ లాంటి విద్యార్థులు ఎప్పుడూ డేటాను ఆన్ చేసే ఉంచుతున్నారు. ఫలితం... రీచార్జ్‌ల మీద రీచార్జ్‌లు చేయాల్సి వస్తోంది. అదీ కథ.
 
సింప్లీ వైఫై ఉత్తమం...
మొబైల్ డేటా వ్యయాలను తట్టుకోవాలంటే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకోవడమే మేలు. చక్కగా వైఫై రూటర్ పెట్టుకుని నెట్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ఇంట్లో, కార్యాలయంలో ఉన్న స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీ, ల్యాప్‌టాప్‌ను నెట్‌కు అనుసంధానించవచ్చు. ఇక చార్జీలంటారా... ఇప్పుడు చాలా వరకు బ్రాడ్‌బ్యాండ్ కంపెనీల టారిఫ్‌లు దిగొచ్చాయి. రూ.400-500కు 30జీబీ ఆపైన డేటా పొందవచ్చు. తక్కువ స్పీడుతో ఈ ధరకు అన్‌లిమిటెడ్ ప్యాక్‌లు కూడా దొరుకుతున్నాయి. అధిక నిడివిగల వీడియోలు ఎక్కువ సంఖ్యలో డౌన్‌లోడ్ చేస్తే తప్ప సాధారణంగా ప్యాక్‌లో భాగంగా ఇచ్చే ఉచిత పరిమితికి మించి డేటా వినియోగం కాదు.
 
వీడియోలు ఆటోమేటిగ్గా డౌన్‌లోడ్ కాకుండా..
ఫేస్‌బుక్ ఈ మధ్యే ఆటోమేటిగ్గా వీడియోలు ప్లే అయ్యే ఫీచర్‌ను జోడించింది. అంటే మీరు ఫేస్‌బుక్ తెరిచారంటే... సదరు వీడియో దగ్గరకు వెళ్లేసరికి అది దానంతట అదే ప్లే అవుతుందన్న మాట. ఈ ఫీచర్ వద్దనుకుంటే సెటింగ్స్‌లోకి వెళ్లి... ఆటోమేటిగ్గా ప్లే అయ్యే ఆప్షన్‌ను ఆఫ్ చేసుకోవాలి. లేదంటే డిఫాల్ట్‌గా అవి ప్లే అవుతూనే ఉంటాయి. దానివల్ల అయ్యే డేటా ఖర్చు కూడా ఎక్కువే. ఇక వాట్సాప్, హైక్ వంటి ఇన్‌స్ట్టంట్ మెసేజింగ్ సర్వీసుల విషయంలో ఎవరైనా ఒక గ్రూప్ క్రియేట్ చేసి... తమ కాంటాక్ట్స్‌లో ఉన్న వారిని ఎవ్వరినైనా అందులో చేర్చే అవకాశం ఉంటుంది. దానికి మీరు అంగీకరించాల్సిన పనేమీ లేదు. ఇష్టం లేకపోతే ఎగ్జిట్ అయ్యే అవకాశం మాత్రం ఉంటుంది.
 
ఇక ఈ గ్రూపుల్లో ఆసక్తిగా ఉంది కదాని మీరు పంపినట్టే మరో స్నేహితుడు సైతం మీకూ వీడియోలు, ఫొటోలు పంపిస్తే... మీ ప్రమేయం లేకుండానే డేటా ఖర్చవుతున్నట్లు లెక్క. గ్రూప్‌ల సంఖ్య పెరిగేకొద్దీ రోజూ వచ్చే వీడియోలు, ఫొటోల సంఖ్య పెరుగుతుంది. దీనర్థం... సోషల్ మీడియాలో మీరు ఎంత యాక్టివ్‌గా ఉంటే అంత డేటా ఖర్చవుతుంది. కంపెనీలు, కార్యాలయాల్లో ఉన్నతాధికారి నుంచి కింది స్థాయి ఉద్యోగులకు అధికారిక ఆదేశాలు ఇన్‌స్టాంట్
 
మెసేజింగ్ యాప్‌ల ద్వారానే అందుతున్నాయి. గ్రూప్‌లో సందేశం పంపితే అందరు సభ్యులకు వెంటనే చేరుతుంది కాబట్టి కార్యాలయాలూ ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లపై ఆధారపడక తప్పటం లేదు. కాకపోతే ఆ మేసేజ్‌ల కోసం ఎల్లప్పుడూ డేటా ఆన్‌చేసే ఉంచాల్సి ఉంటుంది. వీడియోల వంటివి ఆటోమేటిగ్గా డౌన్‌లోడ్ కాకుండా మీరు స్వయంగా ‘సెట్’ చేసుకుంటే తప్ప... జేబుకు చిల్లు పడటం ఖాయం.
 
డేటా ఇలా ఖర్చవుతుంది...
నెట్‌కు అనుసంధానమై వెబ్‌సైట్స్, యాప్స్‌ను తెరవగానే బ్రౌజింగ్ చార్జీలు మొదలైనట్టే. నెట్‌లో వినియోగించిన సమయం, వెబ్‌సైట్లు, యాప్స్‌నుబట్టి చార్జీలు పడతాయి. వీటికితోడు వీడియోల కోసం వాడితే అసలు కథ మొదలైనట్టే. ఎందుకంటే ఉదాహరణకు 5 ఎంబీ వీడియో మీ వాట్సాప్‌లోకి వచ్చిందంటే 5 ఎంబీ డేటా మీరు ఖర్చు చేసినట్టే. 10 మంది స్నేహితులకు వేర్వేరుగా ఈ వీడియోను పంపితే 50 ఎంబీ డేటా ఖర్చు అవుతుంది.

ఒక గ్రూప్‌కు మాత్రమే పంపితే 5 ఎంబీ డేటా వాడినట్టు. పిక్చర్స్, సంక్షిప్త సందేశమైనా సరే సైజునుబట్టి డేటా ఖర్చు అయిపోతుంది. ఇక ఫేస్‌బుక్‌లో మీరు విహరించినంతసేపూ బ్రౌజింగ్ చార్జీలు ఉంటా యి. వీడియోలు చూస్తే సైజునుబట్టి డేటా వినియోగం అవుతుంది. నిజానికిపుడు 3జీ, 4జీ వాడకం పెరగటంతో డేటా ఖర్చులూ పెరుగుతున్నాయి.

3జీ వినియోగదార్లు 1జీబీ డేటాకు ఆపరేటర్‌ను బట్టి కనీసం రూ.200 వెచ్చించాల్సి వస్తోంది. అందుకని అవసరానికి మాత్రమే మొబైల్ డేటా వాడటం... వాట్సాప్, మెసెంజర్ తదితర యాప్స్ సెట్టింగ్స్‌ను మార్చుకోవటం... అనుమతి ఉంటేనే వీడియోలు డౌన్‌లోడ్ అయ్యేట్టు సరిచేసుకోవటం ఉత్తమం. ఇక వాట్సాప్, ఫేస్‌బుక్‌ను విరివిగా వాడేవారు కాస్త స్పీడు తక్కువైనా అన్‌లిమిటెడ్ ప్యాక్స్‌ను ఎంచుకోవడం బెటర్.
- బిజినెస్ బ్యూరో

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement