మీరేంటో చెప్పే లేటు నిద్ర | Night owls have wider social networks than morning people: Study | Sakshi
Sakshi News home page

మీరేంటో చెప్పే లేటు నిద్ర

Published Mon, Dec 11 2017 8:53 AM | Last Updated on Mon, Dec 11 2017 8:53 AM

Night owls have wider social networks than morning people: Study - Sakshi

లండన్‌: మీరు రోజూ ఆలస్యంగా నిద్రపోతారా? అర్ధరాత్రి పన్నెండూ ఒకటి దాటితేగాని పడుకోరా? ఈ అలవాట్లే మీ ప్రవర్తన గురించి తెలియజేస్తాయట. మీరు ఇతరులతో ఎలా వ్యవహరిస్తారో వెల్లడిస్తాయట. బుద్ధిగా రాత్రి తొమ్మిదీ పదింటికే బెడ్డెక్కి దుప్పటి కప్పేవారి కన్నా నిత్యం లేటుగా నిద్రకు ఉపక్రమించేవారి సోషల్‌ నెట్‌వర్కే పెద్దదని ఓ అధ్యయనంలో తేలింది. ఈ నెట్‌వర్క్‌లో ఎక్కువగా ఉండేది కూడా ఇలాంటి వారేనట. పైగా వీరి కేంద్రంగానే ఈ చాటింగులూ మీటింగులూ జరుగుతాయని పరిశోధనలో వెలుగుచూసింది. ‘మనం డైలీ ఎంత సేవు ఫోన్‌ వాడతాం? ఎక్కువగా ఎవరికి కాల్స్‌ చేస్తుంటాం? ఎన్ని గంటలు మాట్లాడతాం? అనే విషయాలను బట్టి మన స్వభావాన్ని తెలుసుకోవచ్చని ఫిన్‌లాండ్‌లోని ఆల్టో వర్సిటీకి చెందిన తలాయే అలేదావుడ్‌ అనే పరిశోధకుడు అంటున్నారు.

మొబైల్‌ ఫోన్‌ డేటా ఆధారంగా వ్యక్తుల ప్రవర్తన తీరుతెన్నులపై ఈయన అధ్యయనం చేస్తున్నారు. ఫోన్‌కాల్స్, ఈమెయిల్స్, మెసేజ్‌ల టైమింగ్స్, సోషల్‌ నెట్‌వర్క్‌ పరిధిని బట్టి వ్యక్తుల సామాజిక అలవాట్ల గురించి చెప్పొచ్చని, ఇలా కచ్చితమైన సమాచారాన్ని సర్వేల ద్వారా పొందడం కష్టమని వివరిస్తున్నారు. ఈ పరిశోధన ఫలితాలు వ్యక్తుల మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారంలో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. ‘మధుమేహం, కణితులు వంటి వాటిని గుర్తించేందుకు బయోమార్కర్లు ఉన్నాయి. కానీ మానసిక రుగ్మతలను కచ్చితంగా కనుగొనేందుకు పరికరాలు గానీ వైద్య పద్ధతులు గానీ లేవు. అందువల్ల ఈ మేరకు కొత్త మార్గాలను అన్వేషించాలి. నిద్రకు ఉపక్రమించే వేళల్లో క్రమరాహిత్యం ఉందంటే వాళ్లు ఏవో మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వారు తమ సమస్య తీవ్ర రూపం దాల్చకముందే వైద్యులను సంప్రదించేలా చూడటమే మా లక్ష్యం’అని అలేదావుడ్‌ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement