ప్రతీకాత్మక చిత్రం
న్యూయార్క్: మొబైల్‌ఫోన్ డేటా విశ్లేషణ ద్వారా ప్రజల కదలికలను గుర్తించి తద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని రెండు వారాల ముందుగానే గుర్తించవచ్చునని అమెరికాలోని యేల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. నేచర్ జర్నల్ తాజా సంచికలో ఈ పరిశోధన తాలూకూ వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ ఏడాది జనవరిలో చైనాలోని వుహాన్ నుంచి ప్రజలు ఏ రకంగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లారో పరిశీలించి, ఆ సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త నికోలస్ క్రిస్టాకిస్ తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో వేర్వేరు ప్రాంతాలకు ప్రయాణమైతే స్థానికంగా ఉన్న ఆరోగ్య సమస్య కాస్తా ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారిపోతుందని నికోలస్ తెలిపారు.
జనవరి ఒకటవ తేదీ నుంచి వుహాన్‌లో లాక్‌డౌన్ నిబంధనలను విధించినప్పటి జనవరి 24వ తేదీ మధ్యలో కనీసం రెండు గంటల పాటు ఆ మహా నగరంలో గడిపిన వారి వివరాలను తాము సేకరించామని, చైనాలోని 31 ప్రావిన్సుల్లోని కోవిడ్ బాధితుల సమాచారంతో దీని పోల్చి చూశామని నికోలస్ తెలిపారు. ప్రజల కదలికలను సుమారు 94 శాతం వరకూ నిలిపివేసిన క్వారంటైన్ నిబంధనలు వ్యాధి నియంత్రణలో ఎంతో కీలకమయ్యాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రజలు ఎలా ఎక్కడెక్కడకు కదిలారన్నది మొబైల్‌ఫోన్ డేటా ఆధారంగా గుర్తించడం వల్ల రెండు వారాల ముందుగానే వ్యాధి ఎక్కడెక్కడకు ఎంత మేరకు విస్తరిస్తుందో గుర్తించడం వీలైందని వివరించారు. తాము ఉపయోగించిన మోడల్ ద్వారా కరోనా వంటి మహమ్మారులు ఏఏ నగరాలను తాకే అవకాశముందో కూడా ముందుగా తెలుసుకోవచ్చునని చెప్పారు. సమీప భవిష్యత్తులో కోవిడ్ –19 సామాజిక స్థాయిలో వ్యాపించడం మొదలుపెడితే దాన్ని ముందుగానే గుర్తించడం ద్వారా కట్టడి చర్యలు సమర్థంగా పనిచేస్తాయని నికోలస్ వివరించారు.
చదవండి: ఇటలీ తరహాలో భారత్‌లో లాక్‌డౌన్!
Comments
Please login to add a commentAdd a comment