మొబైల్ ఇంటర్నెట్ వినియోగం 74% అప్
న్యూఢిల్లీ: దేశంలో 3జీ వినియోగం పెరగటం వల్ల మొబైల్ ఇంటర్నెట్ వాడకంలో వృద్ధి కనిపించింది. 2013తో పోలిస్తే గతేడాది చివరకు 3జీ డాటా వినియోగంలో 114 శాతం వృద్ధి, మొబైల్ ఇంటర్నెట్ వినియోగంలో 74 శాతం వృద్ధి నమోదైందని నోకియా నెట్‌వర్క్స్ తెలిపింది. 2జీ మొబైల్ ఇంటర్నెట్ వినియోగంలో 41 శాతం వృద్ధి కనిపించింద ని నోకియా నెట్‌వర్క్స్ తన నివేదికలో పేర్కొంది. మొత్తం డాటా వినియోగంలో 3జీ వాటా 52 శాతంగా ఉంది. 2జీ వినియోగదారునితో పోలిస్తే 3జీ వినియోగదారుడు 3 రెట్లు ఎక్కువ డాటాను వినియోగించుకుంటున్నాడు.
‘ఏ’ సర్వీస్ ప్రాంతాలలో ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, ఏపీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో డాటా వినియోగం అధికంగా ఉంది. ఈ రాష్ట్రాల్లో 3జీ డాటా వినియోగంలో 129 శాతం వృద్ధి నమోదైంది. అలాగే ‘బి’ సర్వీస్ ప్రాంతాలలో కూడా 3జీ డాటా వినియోగంలో 107 శాతం వృద్ధి కనిపించింది. డాటా వినియోగం ప్రకారం ఢిల్లీ, కోల్‌కతా, ముంబై మెట్రో నగరాలు ‘బి’ సర్వీస్ ప్రాంతం కిందకు వస్తాయి. డాటా వినియోగంలో పెరుగుదల వివిధ మొబైల్ పరికరాలు, నెట్‌వర్క్‌ల పైన ఆధారపడి ఉంటుందని నోకియా నెట్‌వర్క్స్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ గిరోత్రా అన్నారు. పరిశ్రమ అధ్యయనం ప్రకారం, 2014లో భారత్‌కు 258 మిలియన్ల ఫోన్లు దిగుమతి అయ్యాయి. వీటిలో 22 శాతం 3జీ స్మార్ట్‌ఫోన్లు, 7 శాతం 2జీ స్మార్ట్‌ఫోన్లు, 1 శాతం 4జీ స్మార్ట్‌ఫోన్లు, 70 శాతం ఫీచర్ ఫోన్లు ఉన్నాయని చెప్పారు.