ఆరు నెలల్లో బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ..
• త్వరలో మొబైల్ డేటా ఆఫ్‌లోడ్ సేవలు
• కోటి కస్టమర్లకు చేరువలో తెలంగాణ, ఏపీ
• మొబిక్యాష్ ఎం–వాలెట్ ఆవిష్కరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఆరు నెలల్లో 4జీ సేవలను ప్రారంభిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడతగా 1,150 టవర్లు ఏర్పాటు చేస్తోంది. మొబైల్ డేటా ఆఫ్‌లోడ్ (ఎండీవో) సేవలను మార్చికల్లా అందుబాటులోకి తెస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ తెలంగాణ టెలికం సర్కిల్ సీజీఎం ఎల్.అనంతరామ్ తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ డేటాను వాడుతున్న కస్టమర్ వైఫై హాట్‌స్పాట్ ఉన్న ప్రాంతానికి వెళ్లగానే అంతరాయం లేకుండా వేగవంతమైన ఇంటర్నెట్‌ను వాడేందుకు ఎండీవో టెక్నాలజీ తోడ్పడుతుందన్నారు. బ్రాడ్ బ్యాండ్‌లో 24 ఎంబీ డౌన్‌లోడ్ వేగం అందిస్తున్నామని, కొద్ది రోజుల్లో వెక్టర్ వీడీఎస్‌ఎల్ టెక్నాలజీతో 100 ఎంబీ వరకు వేగాన్ని ఆఫర్ చేస్తామన్నారు. కొత్త మొబైల్ వాలెట్‌ను ఆవిష్కరించిన సందర్భంగా మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు.
అగ్రస్థానం దిశగా..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రతి నెల కొత్తగా 2 లక్షల మంది మొబైల్ కస్టమర్లు వచ్చి చేరుతున్నారు. కొత్త కస్టమర్ల సంఖ్యాపరంగా చూస్తే దేశంలో తెలుగు రాష్ట్రాలు తొలి స్థానంలో ఉన్నాయి. మొత్తం మొబైల్ చందాదారుల సంఖ్య ప్రస్తుతం 97 లక్షలుంది. మార్చికల్లా ఈ సంఖ్య ఒక కోటి దాట నుంది. ఇదే జరిగితే మూడో స్థానంలో ఉన్న తెలం గాణ, ఆంధ్రప్రదేశ్‌లు టాప్–1కు చేరతాయి. 4.5జీ టెక్నాలజీతో కూడిన వైఫై హాట్‌స్పాట్స్ 518 నెలకొల్పారు. డిసెంబర్‌కల్లా మరో 3,000 హాట్‌స్పాట్స్ జతకూడతాయని అనంతరామ్ వెల్లడించారు.
బ్యాంకు ఖాతా లేకున్నా..
బీఎస్‌ఎన్‌ఎల్–ఎస్‌బీఐ మొబిక్యాష్ మొబైల్ వాలెట్‌ను బ్యాంకు ఖాతా లేకున్నా వాడొచ్చు. ఫీచర్ ఫోన్ ద్వారా కూడా నిర్వహించుకోవచ్చు. వాలెట్‌లో నగదు నింపేందుకు డెబిట్/క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ అవసరం లేదని ఎస్‌బీఐ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీజీఎం హరదయాల్ ప్రసాద్ తెలిపారు. వాలెట్‌లో నగదు నింపుకునేందుకు ప్రస్తుతానికి బీఎస్‌ఎన్‌ఎల్ రిటైల్ ఔట్‌లెట్‌కు వెళ్లాలి. వాలెట్ నుంచి వాలెట్‌కు, వాలెట్ నుంచి బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేయవచ్చు. బిల్లులు, వర్తకులకు చెల్లింపుల వంటి సేవలు రెండో దశలో జోడిస్తారు.