
రెండురోజులు మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్
నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో అల్లర్ల కారణంగా రెండు రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను, మెసేజ్ సర్వీసులను రద్దు చేశారు. వదంతులను నివారించి, శాంతిభద్రతలను కాపాడటం కోసం పోలీసులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గత శనివారం నాసిక్ జిల్లా తాలెగావ్ అనే గ్రామంలో 16 ఏళ్ల మైనర్ బాలుడు ఐదేళ్ల బాలికపై లైంగికదాడికి ప్రయత్నించాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత నాసిక్ జిల్లాలో ఆందోళనలు తీవ్రమయ్యాయి.
నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలు ప్రాంతాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో సోమవారం నుంచి రెండు రోజులు మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను రద్దు చేయాలని నాసిక్ పోలీస్ కమిషనర్ రవీంద్ర సింఘాల్ నెట్ వర్క్ ఆపరేటర్లను ఆదేశించారు.