ఎయిర్టెల్ లాభం రూ.1,290 కోట్లు | Bharti Airtel Q4 net profit up 2.8 per cent, beats estimates | Sakshi
Sakshi News home page

ఎయిర్టెల్ లాభం రూ.1,290 కోట్లు

Published Thu, Apr 28 2016 12:54 AM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM

ఎయిర్టెల్ లాభం రూ.1,290 కోట్లు

ఎయిర్టెల్ లాభం రూ.1,290 కోట్లు

న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ నికరలాభం మార్చి క్వార్టర్లో 2.8 శాతం పెరిగి రూ. 1,290 కోట్లకు చేరింది. గతేడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ రూ. 1,255 కోట్ల లాభాన్ని నమోదుచేసింది. తాజా త్రైమాసికంలో మొత్తం ఆదాయం 8.4 శాతం వృద్ధితో రూ. 23,016 కోట్ల నుంచి రూ. 24,960 కోట్లకు పెరిగింది.

2015-16 పూర్తి సంవత్సరానికి రూ. 96,532 కోట్ల ఆదాయంపై రూ. 5,484 కోట్ల నికరలాభం ఆర్జించింది. తాజా త్రైమాసికంలో ఇండియా నుంచి ఆదాయం 11.7 శాతం పెరుగుదలతో రూ. 18,328 కోట్లకు పెరిగిందని, మొబైల్ డేటా ఆదాయం జోరుగా 44 శాతం ఎగిసి రూ. 3,357 కోట్లకు చేరినట్లు కంపెనీ  పేర్కొంది. డేటా వినియోగదారులు, ట్రాఫిక్ పెరగడంతో ఈ వృద్ధి సాధ్యపడిందని కంపెనీ తెలిపింది.

 మొబైల్ డేటా జోరు...: ఇండియా నుంచి ఒనగూడుతున్న మొబైల్ ఆదాయంలో డేటా ఆదాయం వాటా ప్రస్తుతం 23.3 శాతానికి పెరిగిందని, ఏడాది క్రితం ఇది 17.6 శాతమేనని ఎయిర్‌టెల్ వివరించింది. ఒక్కో వినియోగదారు నుంచి లభిస్తున్న డేటా సగటు ఆదాయం తాజా త్రైమాసికంలో రూ. 21 పెరిగి రూ. 196కు చేరిం దని, ఈ విభాగంలో 31 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొంది. మొబైల్ డేటాకు సంబంధించి ట్రాఫిక్ 69 శాతం, ఆదాయం 44% పెరగడంతో మంచి ఫలితాల్ని ప్రకటించగలిగామని, డేటా ట్రాఫిక్ 60% వృద్ధిచెందగా, ఆదాయం 44% ఎగిసిందని భారతీ ఎయిర్‌టెల్ ఇండియా, దక్షిణాసియా ఎండీ, సీఈఓ గోపాల్ విఠల్ వివరించారు.

  రూ. 1,434 కోట్లతో బైబ్యాక్ ప్రతిపాదనను కంపెనీ బోర్డు సిఫార్సుచేసింది. షేరుకు రూ. 400 ధరతో మొత్తం చెల్లింపు మూలధనంలో 0.90% షేర్లను కొనుగోలు చేయాలన్నది ప్రతిపాదన. 2016 మార్చి 31నాటికి కంపెనీ మొత్తం రుణభారం రూ. 83,888 కోట్లకు చేరింది. రూ. 5 ముఖవిలువగల షేరుపై రూ. 1.36  చొప్పున డివిడెండును డెరైక్టర్ల బోర్డు సిఫార్సుచేసింది.

 మార్కెట్ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ షేరు 3% పైగా పెరిగి రూ. 374 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement