
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 89% జంప్‌చేసి రూ. 2,145 కోట్లను తాకింది. అనూహ్య రాబడిని మినహాయిస్తే రూ. 2,052 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) క్యూ2లో కేవలం రూ.11,340 కోట్లు ఆర్జించింది. 4జీ లాభదాయకత, వినియోగదారుపై సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ), డేటా వినియోగం పుంజుకోవడం అధిక లాభాలకు దోహదం చేసింది. మొత్తం ఆదాయం సైతం 22% ఎగసి రూ. 34,527 కోట్లకు చేరింది. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల కస్టమర్లను అధిగమించడంతోపాటు.. నిలకడైన పటిష్ట పనితీరును చూపగలిగినట్లు కంపెనీ పేర్కొంది. పరిశ్రమలోనే అత్యుత్తమంగా రూ. 190 ఏఆర్‌పీయూను సాధించింది. గత క్యూ2లో ఇది రూ. 153 మాత్రమే.
20 జీబీ వినియోగం: 5జీ ప్రారంభించనున్న నేపథ్యంలో మరింత ఉత్తమ సేవలు అందించగలమని ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ విఠల్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే చౌక ధరల కారణంగా తక్కువ ఆర్‌వోసీఈని నమోదు చేస్తున్నట్లు తెలియజేశారు. కంపెనీ 8 పట్టణాలలో 5జీ సేవలకు శ్రీకారం చుట్టింది. కాగా ప్రస్తుత సమీక్షా కాలంలో 1.78 కోట్లమంది 4జీ కస్టమర్లు లభించగా.. ఒక్కొక్కరి నెలవారీ సగటు డేటా వినియోగం 20.3 జీబీకి చేరింది.
ఫలితాల నేపథ్యంలో ఎయిర్‌టెల్ షేరు 2 శాతం లాభపడి రూ. 832 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment