
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి క్వార్టర్‌లో టర్న్‌అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 284 కోట్ల నికర లాభం ఆర్జించింది. దీనిలో గ్రూప్‌లోని ఒక అనుబంధ సంస్థకు చెందిన టెలికం టవర్ల విక్రయం ద్వారా లభించిన రూ. 30.5 కోట్లు కలసి ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.
గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 15,933 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గత క్యూ1లో ఏజీఆర్ బకాయిల ప్రొవిజనింగ్ చేపట్టడం ప్రభావం చూపింది. కాగా.. ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం సైతం 15 శాతంపైగా ఎగసి రూ. 26,854 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ. 146కు మెరుగుపడింది. గత క్యూ1లో రూ. 138గా నమోదైంది. నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు 48.9 శాతం నుంచి 49.1 శాతానికి బలపడ్డాయి.
దేశీయంగా..: క్యూ1లో భారతీ ఎయిర్‌టెల్ దేశీ టర్నోవర్ 19 శాతం ఎగసి రూ. 18,828 కోట్లుగా నమోదైంది. మొబైల్ ఆదాయం 22 శాతం పుంజుకున్నట్లు కంపెనీ తెలియజేసింది. 51 లక్షల మంది 4జీ కస్టమర్లు కొత్తగా జత కలసినట్లు వెల్లడించింది. హోమ్ బిజినెస్‌లో కొత్తగా 2.85 లక్షల మంది కస్టమర్లు జత కలసినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తం గా కస్టమర్ల సంఖ్య దాదాపు 47.4 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో ఎయిర్‌టెల్ షేరు 2.3 శాతం లాభపడి రూ. 578 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment