Q1 Earnings Beat
-
లాభాల్లో ఎయిర్టెల్, 15శాతం పెరిగిన ఆదాయం
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి క్వార్టర్లో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 284 కోట్ల నికర లాభం ఆర్జించింది. దీనిలో గ్రూప్లోని ఒక అనుబంధ సంస్థకు చెందిన టెలికం టవర్ల విక్రయం ద్వారా లభించిన రూ. 30.5 కోట్లు కలసి ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 15,933 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గత క్యూ1లో ఏజీఆర్ బకాయిల ప్రొవిజనింగ్ చేపట్టడం ప్రభావం చూపింది. కాగా.. ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం సైతం 15 శాతంపైగా ఎగసి రూ. 26,854 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 146కు మెరుగుపడింది. గత క్యూ1లో రూ. 138గా నమోదైంది. నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు 48.9 శాతం నుంచి 49.1 శాతానికి బలపడ్డాయి. దేశీయంగా..: క్యూ1లో భారతీ ఎయిర్టెల్ దేశీ టర్నోవర్ 19 శాతం ఎగసి రూ. 18,828 కోట్లుగా నమోదైంది. మొబైల్ ఆదాయం 22 శాతం పుంజుకున్నట్లు కంపెనీ తెలియజేసింది. 51 లక్షల మంది 4జీ కస్టమర్లు కొత్తగా జత కలసినట్లు వెల్లడించింది. హోమ్ బిజినెస్లో కొత్తగా 2.85 లక్షల మంది కస్టమర్లు జత కలసినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తం గా కస్టమర్ల సంఖ్య దాదాపు 47.4 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు 2.3 శాతం లాభపడి రూ. 578 వద్ద ముగిసింది. -
దూసుకెళ్లిన హీరో మోటో కార్ప్
ముంబై: భారతదేశ అతిపెద్ద మోటార్ సైకిళ్ల తయారీ దారు హీరో మోటోకార్ప్ నికర లాభాల్లో దూసుకుపోయింది. సోమవారం వెల్లడించిన ఆర్థిక ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలను అధిగమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 18.1 శాతం ఎగబాకి రూ.883 కోట్ల రూపాయల నికరలాభాన్ని నమోదు చేసింది. జూన్ క్వార్టర్ లో ఆదాయంలో 7.7 శాతం వృద్ధితో రూ.8,011కోట్ల రూపాయలను ఆర్జించింది. ఆపరేటింగ్ మార్జిన్ (ఈబీఐటీడీఏ ) 15.35 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే క్వార్టర్ లో ఇది 14 శాతంగా ఉంది.అయితే రూ. 843కోట్ల నికర లాభాలు, విక్రయాల్లో రూ.7,658కోట్ల ఆదాయాన్ని ఎనలిస్టులు అంచనావేశారు. క్యూ 1 ఫలితాలతో వెల్లడితో మార్కెట్ లో షేరు మెరుపులు మెరిపించింది. 2 శాతానికిపైగా లాభపడి 52 వారాల గరిష్టాన్ని తాకింది హీరోమోటోకార్ప్ ద్విచక్ర వాహన విక్రయాల్లో 6 శాతానికి పైగా వృద్ధితో నికర లాభాల్లో అగ్రభాగాన్ని సాధించింది. విక్రయించిన ద్విచక్రవాహనాల యూనిట్ల మొత్తం సంఖ్య 17,45,389కు చేరింది గత ఏడాది ఇదే త్రైమాసికంలో 16,45,240 గా నమోదైంది. కాగా స్తబ్దుగా ఉన్న దేశీయ ద్విచక్రవాహనాల మార్కెట్ దేశంలో గతకొంతకాలంగా పుంజుకుందని, ఇది హీరో కంపెనీ బాగా కలిసి వచ్చిందని మార్కెట్ వర్గాల అంచనా. రానున్న కాలంలో సాధారణ వర్షపాతం కారణంగా గ్రామీణుల ఆదాయం పెరగనుందనీ, తత్ఫలితంగా ద్విచక్రవాహనాలు అమ్మకాలు కూడా జోరందుకోనున్నాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. అలాగే 7వ వేతన సంఘం సిఫారసులతో గణనీయంగా పెరిగిన ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ప్రభావం దేశీయ టూ వీలర్స్ అమ్మకాలపై సానుకూలంగా పడనుందని పేర్కొన్నారు.