దూసుకెళ్లిన హీరో మోటో కార్ప్
దూసుకెళ్లిన హీరో మోటో కార్ప్
Published Mon, Aug 8 2016 2:00 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
ముంబై: భారతదేశ అతిపెద్ద మోటార్ సైకిళ్ల తయారీ దారు హీరో మోటోకార్ప్ నికర లాభాల్లో దూసుకుపోయింది. సోమవారం వెల్లడించిన ఆర్థిక ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలను అధిగమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 18.1 శాతం ఎగబాకి రూ.883 కోట్ల రూపాయల నికరలాభాన్ని నమోదు చేసింది. జూన్ క్వార్టర్ లో ఆదాయంలో 7.7 శాతం వృద్ధితో రూ.8,011కోట్ల రూపాయలను ఆర్జించింది. ఆపరేటింగ్ మార్జిన్ (ఈబీఐటీడీఏ ) 15.35 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే క్వార్టర్ లో ఇది 14 శాతంగా ఉంది.అయితే రూ. 843కోట్ల నికర లాభాలు, విక్రయాల్లో రూ.7,658కోట్ల ఆదాయాన్ని ఎనలిస్టులు అంచనావేశారు. క్యూ 1 ఫలితాలతో వెల్లడితో మార్కెట్ లో షేరు మెరుపులు మెరిపించింది. 2 శాతానికిపైగా లాభపడి 52 వారాల గరిష్టాన్ని తాకింది
హీరోమోటోకార్ప్ ద్విచక్ర వాహన విక్రయాల్లో 6 శాతానికి పైగా వృద్ధితో నికర లాభాల్లో అగ్రభాగాన్ని సాధించింది. విక్రయించిన ద్విచక్రవాహనాల యూనిట్ల మొత్తం సంఖ్య 17,45,389కు చేరింది గత ఏడాది ఇదే త్రైమాసికంలో 16,45,240 గా నమోదైంది. కాగా స్తబ్దుగా ఉన్న దేశీయ ద్విచక్రవాహనాల మార్కెట్ దేశంలో గతకొంతకాలంగా పుంజుకుందని, ఇది హీరో కంపెనీ బాగా కలిసి వచ్చిందని మార్కెట్ వర్గాల అంచనా. రానున్న కాలంలో సాధారణ వర్షపాతం కారణంగా గ్రామీణుల ఆదాయం పెరగనుందనీ, తత్ఫలితంగా ద్విచక్రవాహనాలు అమ్మకాలు కూడా జోరందుకోనున్నాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. అలాగే 7వ వేతన సంఘం సిఫారసులతో గణనీయంగా పెరిగిన ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ప్రభావం దేశీయ టూ వీలర్స్ అమ్మకాలపై సానుకూలంగా పడనుందని పేర్కొన్నారు.
Advertisement
Advertisement