
భారతీ ఎయిర్‌టెల్‌కు మొబైల్ ఇంటర్నెట్ జోరు
40 శాతం ఎగసిన నికర లాభం
న్యూఢిల్లీ: మొబైల్ ఇంటర్నెట్ జోరుతో భారతీ ఎయిర్‌టెల్ లాభాలు బాగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో ఈ కంపెనీ నికర లాభం 40 శాతం వృద్ధి చెందింది. గత క్యూ1లో 1,108 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,554 కోట్లకు పెరిగింది. మొబైల్ డేటా బిజినెస్‌లో ట్రాఫిక్ 87 శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. మొత్తం అమ్మకాలు రూ.23,005 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.23,681 కోట్లకు పెరిగాయని వివరించింది. భారత వ్యాపారం 10 శాతం వృద్ధి సాధించిందని పేర్కొంది. మొబైల్ డేటా ఆదాయం 67 శాతం వృద్ధితో రూ.2,609 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఒక్కో వినియోగదారుడి నుంచి సగటు డేటా ఆదాయం రూ.42 నుంచి రూ.181కు వృద్ధి చెందిందని వివరించింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎయిర్‌టెల్ షేర్ 1 శాతం తగ్గి రూ.414 వద్ద ముగిసింది.