న్యూఢిల్లీ: మొబైల్ డేటా లేకపోయినా చాటింగ్, వార్తలు, రైలు టికెట్ల బుకింగ్, చెల్లింపులు వంటి సదుపాయాలు పొందే విధంగా మెసేజింగ్ సేవల సంస్థ హైక్ తాజాగా ’టోటల్’ పేరిట కొత్త సర్వీసును ఆవిష్కరించింది. యూఎస్‌ఎస్‌డీ టెక్నాలజీపై ఇది పనిచేస్తుందని హైక్ మెసెంజర్ సీఈవో కవిన్ మిట్టల్ తెలిపారు. చౌక ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో దీన్ని పొందుపర్చేలా ఇంటెక్స్, కార్బన్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. మెసేజింగ్, న్యూస్, స్పోర్ట్స్ స్కోర్లు మొదలైనవన్నీ ఈ సర్వీసుతో పొందవచ్చని.. అయితే, ఫొటోలు పంపేందుకు మాత్రం డేటా అవసరమవుతుందని మిట్టల్ తెలిపారు.
ఇందుకోసం 4జీ స్పీడ్‌తో 20 ఎంబీ డేటా ప్యాకేజీలను రూ. 1 నుంచి అందించేలా అటు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఎయిర్‌సెల్, బీఎస్‌ఎన్‌ఎల్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు. రిలయన్స్ జియో తదితర సంస్థలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలియజేశారు. ఎంపిక చేసిన ఇంటెక్స్, కార్బన్ ఫోన్లు కొనుగోలు చేసిన వారు టోటల్ సర్వీసుల కోసం సైన్ అప్ చేయగానే.. వారి హైక్ వాలెట్‌లో రూ.200 జమవుతాయని మిట్టల్ తెలిపారు. కేవైసీ ప్రక్రియ పూర్తయ్యాక డేటా ప్లాన్ల కొనుగోలుకు, ఇతరత్రా ఎవరికైనా పంపేందుకు కూడా ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment