సాక్షి, న్యూఢిల్లీ : డేంజర్ డెత్ గేమ్‌గా అభివర్ణిస్తున్న బ్లూవేల్ ఛాలెంజర్ మన దేశంలో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకుంది. నియంత్రణతోపాటు నిషేధం కోసం ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు కూడా విఫలమవుతూనే ఉన్నాయి. అందుకు కారణం ఆటకు సంబంధించిన లింకులు విస్తరించకుండా ఆపలేకపోవటమే.
బ్లూవేల్ లింకులు ఇంటర్నెట్‌లో దొరకదు. అలాగని ఏ యాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవటానికి వీల్లేదు. కేవలం సోషల్ మీడియాల్లో లింకుల ద్వారానే ఆట విస్తరించేలా అడ్మిన్ రూపకల్పన చేశాడు. అయితే ఇంతకాలం యువత ప్రాణాలతో చెలాగటం ఆడుతున్న బ్లూవేల్ ఇప్పుడు మరో రూపంలో కూడా ముప్పును మోసుకోస్తుంది. ప్రమాదకరమైన వైరస్‌ను సైబర్ నేరగాళ్లు బ్లూవేల్ లింకుల పేరిట పంపుతూ వ్యాపింజేస్తున్నారు. బ్లూవేల్ పేరిట వచ్చే నోటిఫికేషన్లను గానీ, సమాచారాన్నీ గానీ క్లిక్ చేస్తే చాలూ మీఫోన్‌లోని వ్యక్తిగత సమాచారం హ్యాక్‌కి గురయ్యే అవకాశం ఉందని ఇషాన్ సిన్హా అనే సైబర్ నిపుణుడు హెచ్చరిస్తున్నారు.
సుమారు 70 లింకులపై అధ్యయనం చేసిన ఆయన అవన్నీ నకిలీవని తేల్చేశారు. ఇప్పటికే పలువురు తమ డేటా చోరీకి గురైనట్లు సైబర్ విభాగానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బ్లూవేల్ నేపథ్యం తెలిసి కూడా ఆత్రుతతో ఓపెన్ చేసి నష్టపోతున్న వారే చాలా మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్లూవేల్ పేరిట వచ్చే హ్యాష్‌ట్యాగ్‌లను కూడా క్లిక్ చేయకపోవటమే మంచిదని వారు ప్రజలకు సూచిస్తున్నారు. గూగుల్, యాహూ, ఫేక్ బుక్‌సహా పలు సోషల్ మీడియా దిగ్గజాలకు ఇప్పటికే కేంద్రం బ్లూవేల్ లింకులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.