Blue Whale Challenge Game
-
బ్లూవేల్‌తో మరో డేంజర్ కూడా...
సాక్షి, న్యూఢిల్లీ : డేంజర్ డెత్ గేమ్‌గా అభివర్ణిస్తున్న బ్లూవేల్ ఛాలెంజర్ మన దేశంలో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకుంది. నియంత్రణతోపాటు నిషేధం కోసం ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు కూడా విఫలమవుతూనే ఉన్నాయి. అందుకు కారణం ఆటకు సంబంధించిన లింకులు విస్తరించకుండా ఆపలేకపోవటమే. బ్లూవేల్ లింకులు ఇంటర్నెట్లో దొరకదు. అలాగని ఏ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవటానికి వీల్లేదు. కేవలం సోషల్ మీడియాల్లో లింకుల ద్వారానే ఆట విస్తరించేలా అడ్మిన్ రూపకల్పన చేశాడు. అయితే ఇంతకాలం యువత ప్రాణాలతో చెలాగటం ఆడుతున్న బ్లూవేల్ ఇప్పుడు మరో రూపంలో కూడా ముప్పును మోసుకోస్తుంది. ప్రమాదకరమైన వైరస్‌ను సైబర్ నేరగాళ్లు బ్లూవేల్ లింకుల పేరిట పంపుతూ వ్యాపింజేస్తున్నారు. బ్లూవేల్ పేరిట వచ్చే నోటిఫికేషన్లను గానీ, సమాచారాన్నీ గానీ క్లిక్ చేస్తే చాలూ మీఫోన్‌లోని వ్యక్తిగత సమాచారం హ్యాక్‌కి గురయ్యే అవకాశం ఉందని ఇషాన్ సిన్హా అనే సైబర్ నిపుణుడు హెచ్చరిస్తున్నారు. సుమారు 70 లింకులపై అధ్యయనం చేసిన ఆయన అవన్నీ నకిలీవని తేల్చేశారు. ఇప్పటికే పలువురు తమ డేటా చోరీకి గురైనట్లు సైబర్ విభాగానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బ్లూవేల్ నేపథ్యం తెలిసి కూడా ఆత్రుతతో ఓపెన్ చేసి నష్టపోతున్న వారే చాలా మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్లూవేల్ పేరిట వచ్చే హ్యాష్‌ట్యాగ్‌లను కూడా క్లిక్ చేయకపోవటమే మంచిదని వారు ప్రజలకు సూచిస్తున్నారు. గూగుల్, యాహూ, ఫేక్ బుక్సహా పలు సోషల్ మీడియా దిగ్గజాలకు ఇప్పటికే కేంద్రం బ్లూవేల్ లింకులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. -
బ్లూ వేల్ ను బ్లాక్ చేసిన తమిళనాడు
సాక్షి, మధురై : సూసైడ్ గేమ్ గా మారి యువత ప్రాణాలు తీస్తున్న బ్లూ వేల్ ఛాలెంజ్ ను తమిళనాడు ప్రభుత్వం బ్యాన్ చేసేసింది. ప్రమాదకరంగా మారిన ఈ ఆటను ఆన్ లైన్ బ్లాక్ చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్ కు ఈ విషయాన్ని తెలియజేశారు. కోర్టు ఆదేశాలతో బ్లూ వేల్ గేమ్ ను బ్లాక్ చేశామని.. సోషల్ మీడియాలో వీటి లింకులను షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీస్ శాఖ ప్రకటించిన విషయాన్ని ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోవిందరాజన్ బెంచ్ కు తెలిపారు. ఇక నిఘా వర్గాలు కూడా ఈ విషయంలో సమర్థవంతంగా పని చేస్తున్నాయని వివరించారు. దీంతో తదుపరి వాదనను బెంచ్ సెప్టెంబర్ 8కి వాయిదా వేసింది. మధురైకి చెందిన విఘ్నేష్ అనే యువకుడు గత నెల 30న బ్లూ వేల్ ఆటతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా, గేమ్ కు బానిసలై టీనేజర్లు ప్రాణాలు తీసుకోవటంపై తక్షణమే స్పందించాలంటూ మద్రాస్ హైకోర్టు మధుర బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 50 రోజులపాటు కొనసాగే బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ లో ప్లేయర్ కి పలు టాస్క్ లను ఇస్తారు. తనని తాను గాయపరుచుకుని, ఆ ఫోటోలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరి లెవల్ లో భాగంగా ఆత్మహత్య చేసుకోవాలంటూ సూచనలు రావటం.. అప్పటికే ఆటకు బానిస అయ్యే గేమర్ ఆ క్రమంలో ప్రాణాలు తీసేసుకుంటుంటాడు. రష్యా నుంచి మొదలైన బ్లూ వేల్ గేమ్ భూతం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుటివరకు వందల మంది ప్రాణాలను బలి తీసుకుంది. -
బ్లూవేల్ గేమ్‌ను బ్యాన్ చేయాలన్న హైకోర్ట్
మధురైః పిల్లల ప్రాణాలను హరిస్తున్న బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్‌ను నిషేధించే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మద్రాస్ హైకోర్ట్ సోమవారం కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన జస్టిస్ కేకే శశిధరన్, జీఆర్ స్వామినాథన్‌లతో కూడిన మధురై బెంచ్ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి, రాష్ట్ర హోం కార్యదర్శి, ఐటీ శాఖకు నోటీసులు జారీ చేసింది. మృత్యు క్రీడగా మారిన బ్లూవేల్ నిషేధంపై చర్యలు చేపట్టాలని ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైన సహకారం అందించేందుకు ఐఐటీ మద్రాస్ డైరెక్టర్‌ను కేసులో ఇంప్లీడ్ కావాలని బెంచ్ ఆదేశించింది. ఆన్లైన్ గేమ్స్ నిషేధానికి ఐటీ శాఖ కూడా సూచనలు చేయాలని కోరింది. కాగా, వాదనల సందర్భంగా రాష్ట్రప్రభుత్వం కోర్టుకు పలు అంశాలు నివేదించింది. ఈ గేమ్‌ను 75 మందితో ఆడిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, గేమ్ ఆడుతున్న 75 మందిని ఆట నుంచి విరమింపచేశామని కోర్టుకు తెలిపింది. -
‘బ్లూవేల్’ లింక్‌లను తొలగించండి
ఇంటర్నెట్ దిగ్గజాలను ఆదేశించిన ప్రభుత్వం న్యూఢిల్లీ: ప్రమాదకర ‘బ్లూవేల్ చాలెంజ్’ గేమ్, ఆ తరహా ఆన్లైన్ ఆటలకు సంబంధించిన అన్ని లింక్‌లను తక్షణం తొలగించాలని కేం ద్రం ఇంటర్నెట్ దిగ్గజ సంస్థలను ఆదేశించింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఆగస్టు 11న గూగుల్, యాహూ, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, మైక్రోసాఫ్ట్‌లకు ఓ లేఖ రాసింది. 50 రోజులపాటు సాగే బ్లూవేల్ ఆన్లైన్ గేమ్‌లో చివరి టాస్క్ ఆత్మహత్య చేసుకోవడం. ఈ గేమ్‌లో లీనమై ఇటీవల మహారాష్ట్రలో ఒకరు, పశ్చిమబెంగాల్లో ఒకరు పాఠశాల విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని భారత ఇంటర్నెట్ సేవల సరఫరాదారుల (ఐఎస్పీ) సంఘం సమర్థించింది. సామాజిక మాధ్యమాలు ప్రభుత్వం ఆదేశించే వరకు నిర్లక్ష్యం వహించకుండా... ఈ గేమ్ వ్యాప్తి చెందకుండా ముందే అడ్డుకోవాల్సిందనీ ఐఎస్పీ సంఘం అధ్యక్షుడు అన్నారు. ఆన్లైన్ గేమ్‌లకు ఓ నియంత్రణ వ్యవస్థ ఉండాల్సిన అవసరాన్ని బ్లూ వేల్ గేమ్ తెలియజేస్తోందని ముంబైకి చెందిన ఓ సైబర్ నిపుణుడు అన్నారు. భారత సంస్కృతికి, చట్టాలకు సరిపోయే ఆటలనే అనుమతించాలన్నారు. -
బ్లూ వేల్ లింకులను వెంటనే తొలగించండి
న్యూఢిల్లీ: మృత్యుక్రీడగా ఘటికలు మోగిస్తున్న డేంజర్ గేమ్ బ్లూ వేల్ ఛాలెంజ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఓ అడుగు వేసింది. తక్షణమే ఈ ఆటకు సంబంధించిన లింకులను తీసేయాలంటూ సోషల్ మీడియా దిగ్గజాలకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలను జారీచేసింది. ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లతోపాటు మైక్రోసాప్ట్ మరియు యాహూలు ఉత్తర్వులు అందుకున్న వాటిలో ఉన్నాయి. " బ్లూ వేల్ ఆటకి బానిసలై పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. సోషల్ మీడియా అందుకు వేదికగా మారటం దురదృష్టకరం. అందుకే ఆటకు సంబంధించి ఎటువంటి లింకులున్నా తొలగించండి" అని ఆ లేఖలో మంత్రిత్వశాఖ పేర్కొంది. ఆన్లైన్ సూసైడ్ గేమ్ మూలంగా ముంబై, పశ్చిమ బెంగాల్ లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి మేనకా గాంధీ హెం శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఐటీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ ల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అంశాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్రం తాజా మార్గదర్శకాలను జారీచేసినట్లు స్పష్టమౌతోంది. ఇప్పటిదాకా సుమారు 100 మంది బ్లూవేల్ భూతానికి బలైనట్లు ఓ అంచనా.