బ్లూ వేల్ ను బ్లాక్ చేసిన తమిళనాడు
బ్లూ వేల్ ను బ్లాక్ చేసిన తమిళనాడు
Published Tue, Sep 5 2017 9:39 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
సాక్షి, మధురై : సూసైడ్ గేమ్ గా మారి యువత ప్రాణాలు తీస్తున్న బ్లూ వేల్ ఛాలెంజ్ ను తమిళనాడు ప్రభుత్వం బ్యాన్ చేసేసింది. ప్రమాదకరంగా మారిన ఈ ఆటను ఆన్ లైన్ బ్లాక్ చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్ కు ఈ విషయాన్ని తెలియజేశారు.
కోర్టు ఆదేశాలతో బ్లూ వేల్ గేమ్ ను బ్లాక్ చేశామని.. సోషల్ మీడియాలో వీటి లింకులను షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీస్ శాఖ ప్రకటించిన విషయాన్ని ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోవిందరాజన్ బెంచ్ కు తెలిపారు. ఇక నిఘా వర్గాలు కూడా ఈ విషయంలో సమర్థవంతంగా పని చేస్తున్నాయని వివరించారు. దీంతో తదుపరి వాదనను బెంచ్ సెప్టెంబర్ 8కి వాయిదా వేసింది.
మధురైకి చెందిన విఘ్నేష్ అనే యువకుడు గత నెల 30న బ్లూ వేల్ ఆటతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా, గేమ్ కు బానిసలై టీనేజర్లు ప్రాణాలు తీసుకోవటంపై తక్షణమే స్పందించాలంటూ మద్రాస్ హైకోర్టు మధుర బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
50 రోజులపాటు కొనసాగే బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ లో ప్లేయర్ కి పలు టాస్క్ లను ఇస్తారు. తనని తాను గాయపరుచుకుని, ఆ ఫోటోలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరి లెవల్ లో భాగంగా ఆత్మహత్య చేసుకోవాలంటూ సూచనలు రావటం.. అప్పటికే ఆటకు బానిస అయ్యే గేమర్ ఆ క్రమంలో ప్రాణాలు తీసేసుకుంటుంటాడు. రష్యా నుంచి మొదలైన బ్లూ వేల్ గేమ్ భూతం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుటివరకు వందల మంది ప్రాణాలను బలి తీసుకుంది.
Advertisement