లావణ్య సూసైడ్ కేసు.. స్టాలిన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ!
తమిళనాడును కుదిపేసిన విద్యార్థిని లావణ్య ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసును సీబీఐకు అప్పగించాలన్న మద్రాస్ హైకోర్టు అభిప్రాయంతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. దీంతో రాష్ట్ర పోలీసులతోనే దర్యాప్తు చేయించాలన్న డీఎంకే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.
సాక్షి, న్యూఢిల్లీ: తంజావూర్ విద్యార్థిని లావణ్య(17) బలవన్మరణ ఉదంతం తమిళనాడును, సోషల్ మీడియా ద్వారా దేశం మొత్తం కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీ సీఐడీ లేదంటే సమానమైన దర్యాప్తు ఏజెన్సీకి అప్పగించాలంటూ లావణ్య తండ్రి మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌తో ఏకీభవించిన జస్టిస్ జీఎస్ స్వామినాథన్.. జనవరి 1న కేసును సీబీఐకి అప్పగించాలని తీర్పు వెలువరించారు.
అయితే ఈ పరిణామం అనంతరం డీజీపీ ద్వారా తమిళనాడు ప్రభుత్వం ఫిబ్రవరి 3న సుప్రీం కోర్టులో ఒక పిటిషన్(స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేయించింది. దీనిపై నేడు(సోమవారం) విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. మధురై బెంచ్ తీర్పును సమర్థిస్తూ తమిళనాడు డీజీపీకి, ప్రభుత్వానికి నోటీసులు పంపింది. అంతేకాదు ఇదేం ప్రెస్టీజ్ ఇష్యూ( సీబీఐకు అప్పగించడం ద్వారా రాష్ట్ర పోలీసుల ప్రతిష్టకు భంగం కలిగించే విషయమేం కాదంటూ..) కాదంటూ స్టాలిన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కామెంట్ చేసింది బెంచ్. అంతేకాదు దర్యాప్తు కూడా హైకోర్టు ఆదేశాల ప్రకారమే జరగాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, బెల ఎం త్రివేది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
మధురై బెంచ్ ఏం చెప్పిందంటే..
తంజావూర్ మైకేల్పట్టీలో నివాసం ఉండేది లావణ్య కుటుంబం. ఆత్మహత్యకు పాల్పడ్డ లావణ్య.. పదిరోజుల తర్వాత కన్నుమూసింది. స్కూల్లో మతమార్పిడి ఒత్తిళ్లతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ చిన్నారి మరణవాంగ్మూలం వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. అయితే మరో వీడియోలో చిన్నారి వార్డెన్ వేధింపుల్ని భరించలేకపోయినట్లు, పినతల్లి వేధింపులు కూడా కారణమేనని చెప్పడం సైతం వైరల్ అయ్యింది. ఈ వ్యవహారంలో బీజేపీ, తమిళనాడు ప్రభుత్వాల మధ్య రాజకీయ వాగ్వాదం సైతం చోటు చేసుకుంది.
ఈ పరిణామాల నడుమే.. స్కూల్లో వేధింపుల కోణంలో కాకుండా.. మతమార్పిడి వేధింపుల కోణంలోనే దర్యాప్తు చేయించాలంటూ లావణ్య తల్లిదండ్రులు మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో.. రాష్ట్ర పోలీసులతో దర్యాప్తు చేయించడం సమంజసం కాదనే ఉద్దేశాన్ని వ్యక్తపరిచింది మద్రాస్ మధురై బెంచ్. అదే టైంలో ఆ వీడియోలను రికార్డు చేసిన వ్యక్తుల పాత్రపైనా అనుమానం వ్యక్తం చేస్తూనే.. ఈ మేరకు సమర్థుడైన అధికారికి అప్పగించాలంటూ సీబీఐని ఆదేశించింది.