బ్లూవేల్ గేమ్‌ను బ్యాన్ చేయాలన్న హైకోర్ట్
మధురైః పిల్లల ప్రాణాలను హరిస్తున్న బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్‌ను నిషేధించే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మద్రాస్ హైకోర్ట్ సోమవారం కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన జస్టిస్ కేకే శశిధరన్, జీఆర్ స్వామినాథన్‌లతో కూడిన మధురై బెంచ్ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి, రాష్ట్ర హోం కార్యదర్శి, ఐటీ శాఖకు నోటీసులు జారీ చేసింది. మృత్యు క్రీడగా మారిన బ్లూవేల్ నిషేధంపై చర్యలు చేపట్టాలని ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైన సహకారం అందించేందుకు ఐఐటీ మద్రాస్ డైరెక్టర్‌ను కేసులో ఇంప్లీడ్ కావాలని బెంచ్ ఆదేశించింది.
ఆన్లైన్ గేమ్స్ నిషేధానికి ఐటీ శాఖ కూడా సూచనలు చేయాలని కోరింది. కాగా, వాదనల సందర్భంగా రాష్ట్రప్రభుత్వం కోర్టుకు పలు అంశాలు నివేదించింది. ఈ గేమ్‌ను 75 మందితో ఆడిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, గేమ్ ఆడుతున్న 75 మందిని ఆట నుంచి విరమింపచేశామని కోర్టుకు తెలిపింది.