
3 రోజుల తర్వాత ఇంటర్నెట్ పునరుద్ధరణ
శ్రీనగర్: మూడు రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ లేకుండా గడిపిన జమ్మూకశ్మీర్ యువత ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. మొబైల్ ఇంటర్నెట్ సేవలపై విధించిన నిషేధాన్ని సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర పభుత్వం ఎత్తివేసింది. బక్రీద్ పండుగ, ఎద్దు మాంసంపై నిషేధం నేపథ్యంలో మూడు రోజుల పాటు డేటా సేవలు నిలిపి వేసింది.
ముందుగా శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి శనివారం రాత్రి 10 గంటలకు ఇంటర్నెట్ సేవలు ఆపేశారు. తర్వాత ఈ నిషేధాన్ని సోమవారం ఉదయం 10 గంటల వరకు పొడిగించారు. అసాంఘిక శక్తులు మతవిద్వేషాలు రెచ్చగొట్టే అవకాశముందని భావించి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. దీంతో ఇంటర్నెట్ లో వీడియోలు అప్ లోడ్ చేయడం, సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లను ఓపెన్ చేయడం సాధ్యం కాలేదు.