కేరళకు సెమీస్ భాగ్యం
సల్మాన్ నిజర్, అజహరుద్దీన్ అజేయ అర్ధ సెంచరీలు
జమ్మూ కశ్మీర్‌తో రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ‘డ్రా’
పుణే: ఒక్క పరుగే కదా అని తేలిగ్గా తీసుకుంటే... ఆ ఒక్క పరుగే ఒక్కోసారి ఫలితాన్ని నిర్ణయిస్తుంది. దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో ఈ ఒక్క పరుగు విలువ ఎలాంటిదో అటు కేరళ జట్టుకు... ఇటు జమ్మూ కశ్మీర్ జట్టుకు తెలిసొచ్చింది. రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి సెమీఫైనల్ చేరుకోవాలని ఆశించిన జమ్మూ కశ్మీర్ జట్టుకు ఒక్క పరుగు నిరాశను మిగిల్చింది. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో సంపాదించిన ఒక్క పరుగు ఆధిక్యం కేరళ జట్టుకు ఆరేళ్ల తర్వాత మళ్లీ రంజీ ట్రోఫీలో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసింది.
వివరాల్లోకి వెళితే... జమ్మూ కశ్మీర్ నిర్దేశించిన 399 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్ స్కోరు 100/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కేరళ జట్టు చివరి రోజు ఆట ముగిసేసరికి 126 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 295 పరుగులు సాధించి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. సల్మాన్ నిజర్ (162 బంతుల్లో 44 నాటౌట్; 8 ఫోర్లు), మొహమ్మద్ అజహరుద్దీన్ (118 బంతుల్లో 67 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) 43 ఓవర్లు ఆడి ఏడో వికెట్‌కు అజేయంగా 115 పరుగులు జోడించి జమ్మూ కశ్మీర్ విజయాన్ని అడ్డుకున్నారు.
భారత్‌లోని పిచ్‌లపై చివరిరోజు 299 పరుగులు చేయాలంటే ఏ స్థాయి టోర్నీలోనైనా కష్టమే. ఈ నేపథ్యంలో కేరళ బ్యాటర్లు ఆఖరి రోజు క్రీజులో నిలదొక్కుకొని సాధ్యమైనన్ని బంతులు ఆడాలని... జమ్మూ కశ్మీర్ బౌలర్లకు వికెట్లు సమర్పించుకోరాదని... మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకోవాలనే ఉద్దేశంతోనే పోరాడారు. చివరకు తమ ప్రయత్నంలో కేరళ బ్యాటర్లు విజయవంతమయ్యారు.
వెరసి కేరళ, జమ్మూ కశ్మీర్ జట్ల మధ్య ఐదు రోజుల రంజీ ట్రోఫీ చివరి క్వార్టర్ ఫైనల్ ‘డ్రా’గా ముగిసింది. ఫలితం తేలకపోవడంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన జట్టుకు సెమీఫైనల్ బెర్త్ లభిస్తుంది. జమ్మూ కశ్మీర్‌పై 1 పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకున్న కేరళ జట్టుకు సెమీఫైనల్ బెర్త్ ఖాయమైంది. ఈనెల 17 నుంచి జరిగే సెమీఫైనల్లో మాజీ చాంపియన్ గుజరాత్ జట్టుతో కేరళ తలపడుతుంది.
ఆ ఇద్దరు అడ్డుగోడలా...
ఓవర్‌నైట్ స్కోరు 100/2తో ఇన్నింగ్స్ కొనసాగించిన కేరళ బుధవారం తొలి సెషన్‌లో నింపాదిగా ఆడి 46 పరుగులు జోడించి ఒక్క వికెట్ కోల్పోయింది. లంచ్ సమయానికి కేరళ 146/3తో ఉంది. రెండో సెషన్‌లోనూ కేరళ బ్యాటర్లు ఎలాంటి ప్రయోగాలకు పోలేదు. ఆచితూచి ఆడుతూ వికెట్లను కాపాడుకున్నారు.
అయితే ఎనిమిది బంతుల వ్యవధిలో కేరళ సచిన్ బేబీ (162 బంతుల్లో 48; 7 ఫోర్లు), జలజ్ సక్సేనా (48 బంతుల్లో 18; 3 ఫోర్లు) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత ఆదిత్య సర్వాతే (27 బంతుల్లో 8; 2 ఫోర్లు) కూడా అవుటయ్యాడు. దాంతో టీ విరామానికి కేరళ 216/6 స్కోరుతో వెళ్లింది. టీ బ్రేక్ తర్వాత ఆఖరి సెషన్‌లో మరో నాలుగు వికెట్లు తీస్తే జమ్మూ కశ్మీర్‌కు విజయంతోపాటు సెమీఫైనల్ బెర్త్ లభించేది.
కానీ సల్మాన్ నిజర్, అజహరుద్దీన్ మొండి పట్టుదలతో ఆడి జమ్మూ కశ్మీర్ జట్టు ఆశలను వమ్ము చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీ సాధించడంతోపాటు రెండో ఇన్నింగ్స్‌లోనూ నాటౌట్‌గా నిలిచిన నిజర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
సంక్షిప్త స్కోర్లు
జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్: 280; కేరళ తొలి ఇన్నింగ్స్: 281; జమ్మూ కశ్మీర్ రెండో ఇన్నింగ్స్: 399/9 డిక్లేర్డ్; కేరళ రెండో ఇన్నింగ్స్: 295/6 (126 ఓవర్లలో) (రోహన్ 36, అక్షయ్ 48, సచిన్ బేబీ 48, సల్మాన్ నిజర్ 44 నాటౌట్; అజహరుద్దీన్ 67 నాటౌట్, యు«ద్‌వీర్ 2/61, సాహిల్ 2/50).
Comments
Please login to add a commentAdd a comment