![Ranji Trophy: Paras Dogra Gritty Ton Takes Jammu And Kashmir To Brink Of Historic Semis Spot](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/paras.jpg.webp?itok=LsgfftvV)
పుణే: రంజీ ట్రోఫీ (Ranji Trophy) తాజా సీజన్‌లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir) జట్టు కేరళతో క్వార్టర్ ఫైనల్లో భారీ స్కోరు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 180/3తో మంగళవారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జమ్మూ కశ్మీర్ జట్టు 100.2 ఓవర్లలో 399/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
కెప్టెన్ పారస్ డోగ్రా (Paras Dogra) (232 బంతుల్లో 132; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) చక్కటి సెంచరీతో చెలరేగగా... కన్హయ్య (64; 5 ఫోర్లు), సాహిల్ (59; 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్‌సెంచరీలతో రాణించారు. కేరళ బౌలర్లలో నిదీశ్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 399 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ జట్టు మంగళవారం ఆట ముగిసే సమయానికి 36 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.
రోహన్ (36), ఆక్షయ్ చంద్రన్ (32 బ్యాటింగ్), కెప్టెన్ సచిన్ బేబీ (19 బ్యాటింగ్) తలా కొన్ని పరుగులు చేశారు. జమ్మూ కశ్మీర్ బౌలర్లలో యుధ్‌వీర్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 8 వికెట్లు ఉన్న కేరళ జట్టు విజయానికి ఇంకా 299 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఫలితం జమ్మూ కశ్మీర్‌కు అనుకూలంగా వస్తే చరిత్ర అవుతుంది. ఈ జట్టు తొలిసారి సెమీస్‌కు అర్హత సాధించినట్లవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment