
టీమిండియా స్టార్ ప్లేయర్లంతా ఒక్కొక్కరుగా రంజీ బాట పడుతున్నారు. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ (ముంబై), యశస్వి జైస్వాల్ (ముంబై), శుభ్‌మన్ గిల్ (పంజాబ్), రిషబ్ పంత్ (ఢిల్లీ), రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర), శ్రేయస్ అయ్యర్ (ముంబై) తమతమ జట్ల తరఫున బరిలోకి దిగారు.
జనవరి 30న ప్రారంభమయ్యే మ్యాచ్‌లో టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లి (ఢిల్లీ) కూడా బరిలోకి దిగుతానని ప్రకటించాడు. తాజాగా మరో స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా జనవరి 30న ప్రారంభమయ్యే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని వెల్లడించాడు.
రాహుల్ కర్ణాటక తరఫున బరిలోకి దిగుతాడు. కర్ణాటక జట్టుకు మయాంక్ అగర్వాల్ సారథ్యం వహిస్తాడు. ఈనెల 30న ప్రారంభమయ్యే మ్యాచ్‌లో కర్ణాటక.. హర్యానాను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కర్ణాటక హోం గ్రౌండ్ అయిన చిన్న స్వామి స్టేడియంలో జరుగుతుంది.
కాగా, రాహుల్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడిన తన సహచరులు రోహిత్, యశస్వి, గిల్, పంత్, జడేజాలతో పాటు రంజీ బరిలో దిగాల్సి ఉండింది. అయితే మోచేతి గాయం కారణంగా అతను ఇవాళ (జనవరి 23) ప్రారంభమైన మ్యాచ్‌కు దూరమయ్యాడు. విరాట్ కోహ్లి సైతం గాయం కారణంగానే ఇవాళ మొదలైన మ్యాచ్‌కు అందుబాటులో లేడు.
ఇదిలా ఉంటే, ఖాళీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లంతా రంజీల్లో తప్పకుండా ఆడాలని బీసీసీఐ కండీషన్ పెట్టిన విషయం తెలిసిందే. రంజీల్లో ఆడటం తప్పనిసరి చేసిన నేపథ్యంలో గత్యంతరం లేక భారత ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా రంజీ బాట పడుతున్నారు.
టీమిండియా స్టార్లంతా విఫలం.. ఒక్క జడేజా తప్ప..!
రంజీ బరిలోకి దిగిన టీమిండియా స్టార్లంతా దారుణంగా విఫలమయ్యారు. వేర్వేరు జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. రంజీ బరిలోకి దిగిన టీమిండియా స్టార్ ఆటగాళ్లలో ఒక్క రవీంద్ర జడేజా మాత్రమే సత్తా చాటాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో జడ్డూ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.
రంజీల మాట అటుంచితే, ప్రస్తుతం భారత టీ20 జట్టు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లో భాగంగా నిన్న (జనవరి 22) జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి 132 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ జోస్ బట్లర్ (68) ఒక్కడే రాణించాడు. భారత బౌలర్లు వరుణ్ చక్రవర్తి (4-0-23-3), అర్షదీప్ సింగ్ (4-0-17-2), అక్షర్ పటేల్ (4-1-22-2), హార్దిక్ పాండ్యా (4-0-42-2) అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టారు.
స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు ఓపెనర్లు సంజూ శాంసన్ (26), అభిషేక్ శర్మ (34 బంతుల్లో 79; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించారు. అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగి 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (0) నిరాశపరిచినా తిలక్ వర్మ (19), హార్దిక్ పాండ్యా (3) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు.
కేవలం 12.5 ఓవర్లలోనే (3 వికెట్లు) భారత్ గెలుపు తీరాలు తాకింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2, ఆదిల్ రషీద్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో తదుపరి టీ20 జనవరి 25న చెన్నై వేదికగా జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment