మధ్యప్రదేశ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కుల్వంత్ కేజ్రోలియా చరిత్రపుట్లోకెక్కాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో భాగంగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో అతను నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. మ్యాచ్ ఆఖరి రోజు 95వ ఓవర్ వేసిన కుల్వంత్.. రెండు, మూడు, నాలుగు, ఐదు బంతులకు వికెట్లు తీసి, రంజీల్లో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
కుల్వంత్‌కు ముందు ఢిల్లీ బౌలర్ శంకర్ సైనీ (1988), జమ్మూ కశ్మీర్ బౌలర్ మొహమ్మద్ ముదాసిర్ (2018) మాత్రమే రంజీల్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశారు. కుల్వంత్ హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లతో విరుచుకుపడటంతో (5/34) మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో బరోడాపై ఘన విజయం సాధించింది.
ఐపీఎల్‌లో ఢిల్లీ, కేకేఆర్ జట్ల తరఫున ఆడిన కుల్వంత్.. మధ్యప్రదేశ్ తరఫున హ్యాట్రిక్ సాధించిన మూడో బౌలర్‌గా, రంజీ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన 80వ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. నాలుగో బంతుల్లో నాలుగు వికెట్ల ఘనతను అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఎక్కువ మంది సాధించలేదు. ఇప్పటివరకు కేవలం ఐదుగురు మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. లసిత్ మలింగ, ఆండ్రీ రసెల్, షాహీన్ అఫ్రిది, రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్ ఈ అరుదైన రికార్డును నమోదు చేశారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 454 పరుగులకు ఆలౌటైంది. హిమాన్షు మంత్రి (111) సెంచరీతో కదంతొక్కాడు. అనంతరం బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే కుప్పకూలింది. అనుభవ్ అగర్వాల్, సరాన్ష్ జైన్ బరోడా పతనాన్ని శాశించారు. కుల్వంత్ 2 వికెట్లు తీశాడు. ఆతర్వాత ఫాలో ఆన్ ఆడిన బరోడా.. కుల్వంత్ ధాటికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో 270 పరుగులకు చాపచుట్టేసి ఇన్నింగ్స్ పరాజయాన్ని ఎదుర్కొంది. రావత్ (105) సెంచరీ చేసినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment