Kulwant Khejroliya
-
చరిత్రపుటల్లోకెక్కిన మధ్యప్రదేశ్ బౌలర్
మధ్యప్రదేశ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కుల్వంత్ కేజ్రోలియా చరిత్రపుట్లోకెక్కాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో అతను నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. మ్యాచ్ ఆఖరి రోజు 95వ ఓవర్ వేసిన కుల్వంత్.. రెండు, మూడు, నాలుగు, ఐదు బంతులకు వికెట్లు తీసి, రంజీల్లో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కుల్వంత్‌కు ముందు ఢిల్లీ బౌలర్ శంకర్ సైనీ (1988), జమ్మూ కశ్మీర్ బౌలర్ మొహమ్మద్ ముదాసిర్ (2018) మాత్రమే రంజీల్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశారు. కుల్వంత్ హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లతో విరుచుకుపడటంతో (5/34) మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో బరోడాపై ఘన విజయం సాధించింది. ఐపీఎల్లో ఢిల్లీ, కేకేఆర్ జట్ల తరఫున ఆడిన కుల్వంత్.. మధ్యప్రదేశ్ తరఫున హ్యాట్రిక్ సాధించిన మూడో బౌలర్‌గా, రంజీ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన 80వ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. నాలుగో బంతుల్లో నాలుగు వికెట్ల ఘనతను అంతర్జాతీయ క్రికెట్లోనూ ఎక్కువ మంది సాధించలేదు. ఇప్పటివరకు కేవలం ఐదుగురు మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. లసిత్ మలింగ, ఆండ్రీ రసెల్, షాహీన్ అఫ్రిది, రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్ ఈ అరుదైన రికార్డును నమోదు చేశారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 454 పరుగులకు ఆలౌటైంది. హిమాన్షు మంత్రి (111) సెంచరీతో కదంతొక్కాడు. అనంతరం బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే కుప్పకూలింది. అనుభవ్ అగర్వాల్, సరాన్ష్ జైన్ బరోడా పతనాన్ని శాశించారు. కుల్వంత్ 2 వికెట్లు తీశాడు. ఆతర్వాత ఫాలో ఆన్ ఆడిన బరోడా.. కుల్వంత్ ధాటికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో 270 పరుగులకు చాపచుట్టేసి ఇన్నింగ్స్ పరాజయాన్ని ఎదుర్కొంది. రావత్ (105) సెంచరీ చేసినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. -
వెయిటర్ నుంచి క్రికెటర్‌గా..
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ద్వారా స్టార్ క్రికెటర్లు అయిన వారు చాలా మందే ఉన్నారు. గల్లీ క్రికెటర్లను సైతం అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసిన వేదిక ఐపీఎల్ అనడంలో సందేహం లేదు. మరొకవైపు ఆటగాళ్లను రాత్రికి రాత్రే కోటేశ్వరుల్ని చేసే టోర్నమెంట్ కూడా ఇదే. ఎన్ని ఇబ్బందులున్నా క్రికెట్ మీద ఉన్న మక్కువతో ఈ రంగాన్ని కెరీర్ గా ఎంచుకోవడానికి ఐపీఎల్ కూడా ఒక కారణం. దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో రాణించి జాతీయ జట్టుకు ఆడిన ఆటగాళ్లతో వేలంలో పోటీ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అనామక క్రికెటర్లకూ ఇక్కడ కొదవ ఉండదు. అదే కోవకి చెందిన ఆటగాడే రాజస్థాన్ లోని ఝున్ ఝున్ అనే గ్రామం నుంచి వచ్చిన కుల్వంత్ ఖేజ్రోలియా. దాదాపు ఏడాది కాలంగా మాత్రమే దేశవాళీ క్రికెట్ ఆడుతున్న కుల్వంత్ ను ఐపీఎల్-10వ సీజన్ లో ముంబై ఇండియన్స్ తీసుకుంది. ఎడమచేతి వాటం పేసర్ అయిన కుల్వంత్ క్రికెటర్ కాకముందు గోవాలోని రెస్టారెంట్లో వెయిటర్ గా పని చేసేవాడు. పేద కుటుంబానికి చెందిన కుల్వంత్ ఒకవైపు వెయిటర్ గా పని చేస్తూనే మరొకవైపు క్రికెట్ ఆడటాన్ని వదులుకోలేదు. ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ప్రాక్టీస్.. క్రికెట్‌ను కెరీర్‌ను ప్రొఫెషన్ గా మార్చుకోవాలని ఢిల్లీకి రావడానికి అతని స్నేహితుడే కారణం. కుల్వంత్ లో ప్రతిభను ఫ్రెండ్ గుర్తించడంతో అతనికి తొలి అడుగు పడింది. ఇలా ఢిల్లీకి వచ్చిన కుల్వంత్ క్రికెటర్ గా ఎదిగేందుకు అలుపెరగని పోరాటం చేశాడు. గతంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు నెట్స్ లో ప్రాక్టీస్ చేసేటప్పుడు అక్కడ వారితోపాటే నెట్స్ లో గడిపేవాడు. అదే కుల్వంత్ వెలుగులోకి రావడానికి దోహదం చేసింది. కుల్వంత్ ను ఒకసారి పరీక్షించాలంటూ ఢిల్లీ రాష్ట్ర జట్టుకు సందేశం అందింది. దాంతో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన విజయ్ హజారే వన్డే టోర్నీకి ఎంపికయ్యాడు. ఢిల్లీ జట్టులో ఒక అదనపు సభ్యుడిగా ఎంపికైన కుల్వంత్.. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆ టోర్నీలో ఐదు మ్యాచ్ లు ఆడిన కుల్వంత్ మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లతో సత్తా చాటుకున్నాడు. ఇదే అతను ఐపీఎల్లో అరంగేట్రం చేయడానికి ఉపయోగపడింది. అయితే కుల్వంత్ కు ఇంకా ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కలేదు. ఈ సీజన్ ఐపీఎల్లో అతని కనీస ధర రూ.10 లక్షలకు ముంబై వేలంలో దక్కించుకుంది. కేవలం ఏడాది క్రితం మాత్రమే దేశవాళీ అరంగేట్రం చేసిన తనకు ముంబై ఇండియన్స్ తరపున ఆడటం చాలా సంతోషంగా ఉందని అంటున్నాడు. ఐపీఎల్లో దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవాలనే కల నెరవేరడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నట్లు ఇంట్లో చెప్పలేదని కుల్వంత్ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు.