వెయిటర్ నుంచి క్రికెటర్గా.. | Kulwant Khejroliya waiter to cricketer | Sakshi
Sakshi News home page

వెయిటర్ నుంచి క్రికెటర్గా..

Published Sat, May 20 2017 6:11 PM | Last Updated on Tue, Sep 5 2017 11:36 AM

వెయిటర్ నుంచి క్రికెటర్గా..

వెయిటర్ నుంచి క్రికెటర్గా..

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ద్వారా స్టార్ క్రికెటర్లు అయిన వారు చాలా మందే ఉన్నారు. గల్లీ క్రికెటర్లను సైతం అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసిన వేదిక ఐపీఎల్ అనడంలో సందేహం లేదు. మరొకవైపు ఆటగాళ్లను రాత్రికి రాత్రే కోటేశ్వరుల్ని చేసే టోర్నమెంట్ కూడా ఇదే.  ఎన్ని ఇబ్బందులున్నా క్రికెట్ మీద ఉన్న మక్కువతో ఈ రంగాన్ని కెరీర్ గా ఎంచుకోవడానికి ఐపీఎల్ కూడా ఒక కారణం. దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో రాణించి జాతీయ జట్టుకు ఆడిన ఆటగాళ్లతో వేలంలో పోటీ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అనామక క్రికెటర్లకూ ఇక్కడ కొదవ ఉండదు. అదే కోవకి చెందిన ఆటగాడే రాజస్థాన్ లోని ఝున్ ఝున్ అనే గ్రామం నుంచి వచ్చిన కుల్వంత్ ఖేజ్రోలియా.

 

దాదాపు ఏడాది కాలంగా మాత్రమే దేశవాళీ క్రికెట్ ఆడుతున్న కుల్వంత్ ను ఐపీఎల్-10వ సీజన్ లో ముంబై ఇండియన్స్ తీసుకుంది. ఎడమచేతి వాటం పేసర్ అయిన కుల్వంత్ క్రికెటర్ కాకముందు గోవాలోని రెస్టారెంట్లో వెయిటర్ గా పని చేసేవాడు. పేద కుటుంబానికి చెందిన కుల్వంత్ ఒకవైపు వెయిటర్ గా పని చేస్తూనే మరొకవైపు క్రికెట్  ఆడటాన్ని వదులుకోలేదు.



ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ప్రాక్టీస్..

క్రికెట్ను కెరీర్ను ప్రొఫెషన్ గా మార్చుకోవాలని ఢిల్లీకి రావడానికి అతని స్నేహితుడే కారణం. కుల్వంత్ లో ప్రతిభను ఫ్రెండ్ గుర్తించడంతో అతనికి తొలి అడుగు పడింది. ఇలా ఢిల్లీకి వచ్చిన కుల్వంత్ క్రికెటర్ గా ఎదిగేందుకు అలుపెరగని పోరాటం చేశాడు. గతంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు నెట్స్ లో ప్రాక్టీస్ చేసేటప్పుడు అక్కడ వారితోపాటే నెట్స్ లో గడిపేవాడు. అదే కుల్వంత్ వెలుగులోకి రావడానికి దోహదం చేసింది. కుల్వంత్ ను ఒకసారి పరీక్షించాలంటూ ఢిల్లీ రాష్ట్ర జట్టుకు సందేశం అందింది. దాంతో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన విజయ్ హజారే వన్డే టోర్నీకి ఎంపికయ్యాడు. ఢిల్లీ జట్టులో ఒక అదనపు సభ్యుడిగా ఎంపికైన కుల్వంత్.. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆ టోర్నీలో ఐదు మ్యాచ్ లు ఆడిన కుల్వంత్ మొత్తం ఐదు మ్యాచ్లు ఆడి  13 వికెట్లతో సత్తా చాటుకున్నాడు. ఇదే అతను ఐపీఎల్లో అరంగేట్రం చేయడానికి ఉపయోగపడింది. అయితే కుల్వంత్ కు ఇంకా ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కలేదు.

ఈ సీజన్ ఐపీఎల్లో అతని కనీస ధర రూ.10 లక్షలకు ముంబై వేలంలో దక్కించుకుంది. కేవలం ఏడాది క్రితం మాత్రమే దేశవాళీ అరంగేట్రం చేసిన తనకు ముంబై ఇండియన్స్ తరపున ఆడటం చాలా సంతోషంగా ఉందని అంటున్నాడు. ఐపీఎల్లో దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవాలనే కల  నెరవేరడంతో  ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నట్లు ఇంట్లో చెప్పలేదని కుల్వంత్ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement