చివరి ఓవర్ లో వ్యూహం అదే..
హైదరాబాద్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10వ సీజన్ టైటిల్ ను ముంబై ఇండియన్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. చివరి బంతి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన తుది పోరులో ముంబై ఇండియన్స్ పైచేయి సాధించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. కేవలం పరుగు తేడాతో రైజింగ్ పుణెను ఓడించి ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. తద్వారా ఐపీఎల్ ట్రోఫీని మూడుసార్లు గెలిచిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ కొత్త చరిత్ర సృష్టించింది. ఇదిలా ఉంచితే, అసలు చివరి ఓవర్ లో తమ వ్యూహం అమలు చేసిన తీరును మ్యాచ్ ముగిసాక ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.
'చివరి ఓవర్లో పుణె విజయానికి 11 పరుగుల మాత్రమే కావాలి. అప్పటికి పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇంకా అవుట్ కాకపోవడంతో మాకు విజయావకాశాలు తక్కువగానే ఉన్నాయి. స్మిత్ ను కట్టడి చేస్తే గెలుపును సొంతం చేసుకోవచ్చనేది మా ప్రణాళిక. ఆ మేరకు చివరి ఓవర్ వేయడానికి వచ్చిన మిచెల్ జాన్సన్తో చర్చించా. సాధ్యమైనంత వరకూ స్మిత్ బంతిని పేస్ చేయకుండా విధంగా బౌలింగ్ చేయమనే చెప్పా. అతను పేస్ బౌలింగ్ ను ఎలా పేస్ చేస్తాడో మనం అంతకుముందు చూశాం. మరొకవైపు అప్పుడు జాన్సన్ గాలికి వ్యతిరేక దిశలో బౌలింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో స్మిత్ ను గాల్లోకి బంతిని హిట్ చేసేలా చేయాలనుకున్నాం. అప్పుడు గాల్లోకి బంతి లేపితే కచ్చితంగా మాకు అనుకూలంగా ఉంటుందనే అనుకున్నాం. ఆ రకంగా ముందు స్మిత్ విషయంలో సక్సెస్ అయ్యాం. ఆపై పుణె పై ఒత్తిడి పెంచి టైటిల్ సాధించాం' అని రోహిత్ పేర్కొన్నాడు.
ఆఖరి ఓవర్లో పుణె విజయానికి 11 పరుగులు కావల్సిండగా జాన్సన్ వేసిన తొలిబంతిని మనోజ్ తివారీ బౌండరీ బాదడంతో పుణె సునాయసంగా విజయాన్ని సాధిస్తుందని భావించారు. కానీ రెండో బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నించిన మనోజ్ లాంగ్ ఆన్ లో పోలార్డ్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. అయినా అర్ధసెంచరీ చేసిన స్మిత్ క్రీజులో ఉండటంతో విజయం పుణె నే వరిస్తుందనుకున్నారు. కాగా మూడో బంతికి స్మిత్ గాల్లోకి లేపి అంబటి రాయుడుకు చిక్కాడు. చివరి మూడు బంతులకు 7 పరుగులు చేయాల్సి ఉండగా క్రీజులో కి వచ్చిన వాషింగ్టన్ సుందర్ బై రన్ తీశాడు. బ్యాటింగ్ కు వచ్చిన క్రిస్టియన్ ఐదో బంతికి రెండు పరుగులు తీశాడు. ఇక చివరి బంతికి 4 పరుగులు చేయాల్సి ఉండగా రెండు పరుగులు తీసి మూడో పరుగుల తీసే ప్రయత్నంలో క్రిస్టియన్ రనౌటయ్యాడు. దీంతో టైటిల్ ముంబై సొంతమైంది.